Kaleshwaram Project: నమ్ముకున్న కాళేశ్వరమే నట్టేట ముంచుతుందా?.. ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ వరుస షాక్‌లు!
ఒకవైపు మేడిగడ్డ డ్యామేజీ ఇప్పటికే బీఆర్‌ఎస్ సర్కార్‌ను డ్యామేజీ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు అన్నారం వంతు వచ్చింది. బ్యారేజీ పిల్లర్ల సమీపంలో బుంగలు ఏర్పడి నీళ్లు లోపలికి వెళ్తున్నాయి.

Kaleshwaram Project: బీఆర్‌ఎస్‌కు ఏది బలం అనుకున్నారో… ఇప్పుడు అదే బలహీనంగా మారుతోందా… కాళేశ్వరం.. స్కామేశ్వరం నిజమేనా.. ప్రజలు కేసీఆర్ అవినీతిని విశ్వసిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది ఇటు బీఆర్‌ఎస్ అటు విశ్లేషకుల నుంచి. సీఎం కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికలకు ముందు అధికార బీఆర్‌ఎస్‌కు అతి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. విద్రోహ చర్య అంటూ కేసులు పెట్టినా నిర్మాణ, డిజైన్ లోపమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ఒక్క పిల్లర్ కాదని, ఐదారు కుంగిపోయాయనని గుర్తించారు. ఇప్పుడీ బ్యారేజీని ఖాళీ చేశారు. మరమ్మతులు ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారు.
అన్నారంపై అనుమానాలు..
ఒకవైపు మేడిగడ్డ డ్యామేజీ ఇప్పటికే బీఆర్‌ఎస్ సర్కార్‌ను డ్యామేజీ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు అన్నారం వంతు వచ్చింది. బ్యారేజీ పిల్లర్ల సమీపంలో బుంగలు ఏర్పడి నీళ్లు లోపలికి వెళ్తున్నాయి. ఇసుక బస్తాలతో బుంగ పూడ్చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అయినా ఇది వార్షిక మరమ్మతులో భాగంగా జరుగుతోందని, ఇది సమస్యే కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాఫ్ట్ ఫౌండేషన్ కింద నుంచి నీళ్లు వెళ్లడం అతిపెద్ద ప్రమాదాని, లోపానికి నిదర్శనమని నిపుణులు అంటున్నారు.
స్కామేశ్వరమేనా..
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఆ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన నాటి గవర్నర్ ఈఎస్‌ఎల్.నర్సింహన్… కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ అంటే కాళేశ్వర్‌రావు అని అభివర్ణించారు. ఇక గులాబీ బాస్ తన పనితనాన్ని చాటుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఓ వీడియో తీయించి.. అంతర్జాతీయ చానెల్ నేషనల్ జియోగ్రఫీలో టెలికాస్ట్ చేయించారు. ఇక ముఖ్యమంత్రి నుంచి కిందస్థాయి నేతల వరకు ఎక్కడ సభలు పెట్టినా మొదట చెప్పే మాట కాళేశ్వరం గురించే. కాళేశ్వరం కారనంగానే తెలంగాణ సస్యశ్యామలం అయిందని, లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదని చెబుతన్నారు. కానీ, తాజాగా మేడిగడ్డ కుండగం, అన్నారంలో బుంగలు పడడం చూస్తుంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం కాదని స్కామేశ్వరం అన్న విషయం తెలంగాణ ప్రజానీకానికి అర్థమవుతోంది. విపక్షాలు ఆరోపణలకు లోపాలు బలం చేకూరుస్తున్నాయి.
కేంద్రం చర్యలపై ఆసక్తి..
ఎన్నికల వేళ కాళేశ్వరం లోపాలు బయట పడుతుండడం, ఈ విషయంలో కేంద్ర కమిటీ రంగంలోకి దగడం చూస్తుంటే పరిస్థితి ఎటు పోతుందో బీఆర్‌ఎస్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు బీఆర్‌ఎస్–బీజేపీ ఒక్కటి కాకుంటే కాళేశ్వరం లోపాలపై కేంద్రం చర్యలకు దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ, ఎన్నికలయ్యే వరకూ కేంద్రం మౌన వహించి కమిటీ నివేదికను బహిర్గతం చేయకుంటే మాత్రం కాంగ్రెస్ చెబుతున్నట్లు బీఆర్‌ఎస్–బీజేపీ ఒక్కటే అన్న భావన ప్రజల్లో మరింత బలపడుతుంది. ఇప్పటికే లిక్కర్ స్కాంలో పేర్లు ఉన్న అందరూ అరెస్ట్ అయ్యారు. కేసీఆర్ కూతురు కవిత మాత్రం అరెస్ట్ కాలేదు. దీంతో బీఆర్‌ఎస్–బీజేపీ మధ్య డీల్ కుదిరిందన్న భావన తెలంగాణ ప్రజల్లో నెలకొంది. తాజాగా కాళేశ్వరంపై కేంద్రం మౌనంగా ఉంటే.. కేంద్రం కావాలనే మౌనం వహిస్తుందని నిర్ధారణ అవుతుంది. మరి ఎన్నికలలోపు ఏం జరుగతుందో చూడాలి.
రూ.లక్ష కోట్లకుపైగా వ్యయంతో కట్టిన ప్రాజెక్టు కావడంతో ప్రజలకు సెంటిమెంట్ ఉంటుంది. అప్పులు చేసిన ప్రాజెక్టు ఏ మాత్రం ఉపయోగం ఉండకపోగా, అది కూడా తప్పులతడకగా నిర్మించారని, భారీ అవినీతిగా ప్రజలు భావిస్తే బీఆర్‌ఎస్ పార్టీ పుట్టి మునగడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
