YS Jagan – CBI : జగన్ ను విచారణకు పిలుస్తారా?
కేసు విచారణలో సీబీఐ తప్పకుండా జగన్ ను పిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

YS Jagan – CBI : వివేకా హత్యకేసులో ఏపీ సీఎం జగన్ ను విచారణకు పిలవనున్నారా? ఇప్పుడు దీనిపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇప్పటివరకూ కేసు విషయంలో విపక్షాలు జగన్ పై ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఇప్పుడు సీబీఐ జగన్ పేరు ప్రస్తావించేసరికి కేసు మరింత బిగుసుగా కనిపిస్తోంది. అరెస్టుల విషయంలో వెనుకబడిన సీబీఐ కేసును ముందుకు తీసుకెళ్లడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అనుబంధ పిటీషన్లు, కేసుల వాదనలో వ్యూహాత్మకంగా రోజుకో పేర్లు వెల్లడిస్తోంది. మొన్న అవినాష్ ముందస్తు బెయిల్ పై దాఖలు చేసిన అనుబంధ పిటీషన్ లో జగన్ ప్రస్తావన తీసుకొచ్చింది. నిన్నటికి నిన్న వాదనలో ఓ రహస్య సాక్షి అంటూ చెప్పడంతో అందరి చూపు వైఎస్ కుటుంబంపై పడింది.
కేసు విచారణలో సీబీఐ తప్పకుండా జగన్ ను పిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ముందే తెలుసని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. జగన్‌కు ఉదయం 6.15 కు ముందే తెలిసినట్లు సీబీఐ విచారణలో తేలింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి చెప్పకముందే జగన్‌కు విషయం తెలుసని సీబీఐ అనుబంధ కౌంటర్‌లో ప్రస్తావించింది. అయితే దీనిపై సీఎం జగన్ తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సీబీఐ అఫిడవిట్ వెనుక కుట్ర కోణం ఉందని భావిస్తున్న జగన్ న్యాయవాదులు.. దీనిపై న్యాయపర చర్యలకు సిద్ధం అవుతున్నారు. అయితే ఈ కేసులో సీఎం జగన్ ప్రస్తావన రావడంతో.. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
మరోవైపు వివేకా మృతిచెందినట్టు జగన్ తమకు చెప్పారని.. ఆయనతో ఆ రోజు ఉన్న అజయ్ కల్లాం వెల్లడించారు. వివేకా హత్య జరిగిన అర్ధరాత్రి దాటిన తరువాత జగన్ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించే పనిలో ఉన్నారు. తెల్లవారుజాము వరకూ అజయ్ కల్లాం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లతో పాటు మరొకరితో చర్చించినట్టు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో జగన్ కు ఫోన్ వచ్చింది. ఆయన మేడపైకి వెళ్లి కిందకు వచ్చారు. బాబాయ్ వివేకా మృతిచెందినట్టు చెప్పారని అజయ్ కల్లాం ఇటీవల విలేఖర్ల సమావేశంలో సైతం వెల్లడించారు. అయితే ఎలా చనిపోయారన్నది చెప్పలేదని చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు కేసులోఇదే కీలకాంశంగా సీబీఐ భావిస్తున్నట్టు సమాచారం. అవినాష్ రెడ్డి అటు జగన్, ఇటు భారతి వ్యక్తిగత సహాయకులతో తరచూ మాట్లాడినట్టు సీబీఐ గుర్తించింది. అయితే వివేకా పీఏ కృష్ణారెడ్డి చెప్పక ముందే జగన్ కు వివేకా హత్య కేసు విషయం తెలుసునని సీబీఐ భావిస్తోంది. తమ విచారణలో అదే తేలినట్టు కోర్టుకు తెలిపింది. అయితే జగన్ కు అవినాశ్ రెడ్డి ముందే చెప్పారా? అనే తేలాల్సి ఉంది. అవినాశ్ రెడ్డిని కస్టోడియల్ విచారణ చేస్తే అన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశముంది.వివేకా హత్య జరిగిన రోజు రాత్రి 12.27 గంటల నుంచి 1.10 గంటల వరకు అవినాశ్ రెడ్డి వాట్సాప్ కాల్ మాట్లాడారని సీబీఐ చెబుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ను సీబీఐ విచారించే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
