Chandrababu Arrest: చంద్రబాబును మళ్ళీ అరెస్టు చేస్తారా?
చంద్రబాబుపై ఒక్క స్కిల్ స్కాం కేసే కాదు. చాలా రకాల కేసులు నమోదు చేశారు. అవి న్యాయస్థానాల్లో వివిధ దశల్లో ఉన్నాయి. అయితే స్కిల్ స్కామ్ కేసులో తొలుత చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ లభించింది.

Chandrababu Arrest: చంద్రబాబు కేసుల నుంచి బయటపడినట్టేనా? ఆయన సేఫ్ జోన్ లో ఉన్నారా? మిగతా కేసుల్లో అరెస్టు అవుతారా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు ఇతర కేసుల్లో చంద్రబాబును మరోసారి అరెస్టు చేస్తారన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే అందుకు సాధ్యం ఉందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
చంద్రబాబుపై ఒక్క స్కిల్ స్కాం కేసే కాదు. చాలా రకాల కేసులు నమోదు చేశారు. అవి న్యాయస్థానాల్లో వివిధ దశల్లో ఉన్నాయి. అయితే స్కిల్ స్కామ్ కేసులో తొలుత చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ లభించింది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ విషయంలో కోర్టు అనారోగ్య కారణాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అది మిగతా కేసులకు కూడా వర్తిస్తాయని న్యాయ వర్గాల నుంచి ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. కానీ ఇంకో రకంగా కూడా ప్రచారం జరుగుతోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి చాలా కీలకమైన అంశాలను పొందుపరిచింది. అలైన్మెంట్ మార్చి చంద్రబాబు, ఆయన అస్మదీయులు భారీగా లబ్ధి పొందాలని అభియోగం మోపింది. ఇదే కేసులో హెరిటేజ్ సంస్థ ప్రస్తావనం సైతం తీసుకొచ్చారు. ఇందులో వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందినట్లు చెప్పుకొస్తున్నారు. అయితే రింగ్ రోడ్డు లేదు.. అవినీతి ఎలా సాధ్యమని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు సైతం బలమైన వాదనలు వినిపించారు. అటు ఫైబర్ నెట్ కేసులో సైతం ఇదే రకమైన వాదనలు ఉన్నాయి. ఇవి చాలు అన్నట్టు ఇసుక, మద్యం కుంభకోణాలతో పాటు అంగళ్లు అల్లర్ల కేసు సైతం చంద్రబాబు పై నమోదు చేశారు. ఈ కేసుల్లో చంద్రబాబును మరోసారి అరెస్టు చేసేందుకు ఏపీ సిఐడి పావులు కదుపుతుందన్న వార్తలు వస్తున్నాయి.
ఎన్నికలకు ఇంకా మూడు నెలల వ్యవధి ఉంది. ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీకి డామేజ్ జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో టిడిపి సైతం గట్టిగానే పోరాడింది. కేవలం కక్షపూరితంగానే చంద్రబాబును అరెస్టు చేశారని టిడిపి తో పాటు జనసేన ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. జగన్ ఎన్నికల ముంగిట చంద్రబాబును టచ్ చేసి తప్పు చేశారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కానీ మరోసారి అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే మరోసారి అరెస్టు చేసే ఛాన్స్ లేదని.. జగన్ అంతటి సాహసానికి దిగరని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఎలా స్పందిస్తారో చూడాలి.
