Chandrababu Arrested: చంద్రబాబును మరోసారి అరెస్ట్ చేస్తారా? నిజమెంత?
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. అయితే తన కేసు విషయంలో ఎటువంటి ఆధారాలు లేవని.. ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన తనను అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరిని.

Chandrababu Arrested: చంద్రబాబును మళ్ళీ అరెస్టు చేస్తారా? జైల్లో పెడతారా? అందుకు వీలుందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు దీనిపై ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ఆధారాలు లేని కేసుల్లో చంద్రబాబును దాదాపు 50 రోజులు పాటు జైల్లో పెట్టారని.. వారు అనుకుంటే తప్పకుండా జైల్లో పెట్టించగలరని టిడిపి శ్రేణులు భయపడుతున్నాయి. అయితే మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబును.. బెయిల్ గడువు కంటే ముందే అరెస్టు చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. అయితే తన కేసు విషయంలో ఎటువంటి ఆధారాలు లేవని.. ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన తనను అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరిని.. ఇందుకు సంబంధించి సెక్షన్ 17 ఏను పాటించలేదని వాదిస్తూ చంద్రబాబు కేసును కొట్టివేయాలని కోరుతూ తొలుత ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తరువాత హైకోర్టును ఆశ్రయించారు. అయితే రెండు చోట్ల చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ అయ్యింది. సుప్రీంకోర్టులో మాత్రం విచారణకు వచ్చింది. దీనికి సంబంధించి తీర్పు ఈ నెల 8న వెల్లడి కానుంది. ఇంతలో అనారోగ్య కారణాలు చూపడంతో ఏపీ హైకోర్టు నాలుగు వారాలపాటు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సిఐడి అభ్యంతరాలు వ్యక్తం చేసినా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అటు చంద్రబాబు మెయిల్ విషయంలో కఠిన షరతులు అమలు చేయాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై సైతం విచారణ జరుగుతోంది.
సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబును మరోసారి అరెస్టు చేస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే అందుకు ఎంతవరకు వీలుంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసులో సైతం చంద్రబాబును అరెస్టు చేయవద్దని కోర్టు సిఐడి ని ఆదేశించింది. అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. ఫైబర్ నెట్ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇలా కేసులన్నీ ఒకవైపు ఉండగా.. చంద్రబాబును అరెస్టు చేయడం అన్నది అంత సులువు కాదని తెలుస్తోంది. న్యాయ వర్గాలు సైతం ఇదే మాట చెబుతున్నాయి.
చంద్రబాబుకి ఇచ్చింది మధ్యంతర బెయిల్. అది కూడా అనారోగ్య సమస్యలను చూపడం వల్లే కోర్టు బెయిల్ కి మొగ్గుచూపింది. చంద్రబాబు కుడి కంటికి సంబంధించి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. ఈ ఏడాది జూన్ లోనే ఎడమ కంటికి ఆపరేషన్ చేశారు. మూడు నెలల వ్యవధిలో ఆపరేషన్ తప్పనిసరి కావడంతో కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు బెయిల్ లో ఉండగా మరో కేసులో అరెస్టు చేయడం అసాధ్యం. ప్రత్యేక పరిస్థితులు, నిబంధనలను అధిగమించడం వంటి కారణాలు చూపితేనే తిరిగి అరెస్టు చేసే అవకాశం ఉందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. అయితే వైసిపి సోషల్ మీడియాలో మాత్రం చంద్రబాబును మరోసారి అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
