Telangana BJP: లిక్కర్ కేసులో కవితను ఎందుకు అరెస్టు చేయలేదు? బండి సంజయ్ ని అధ్యక్షుడిగా ఎందుకు తొలగించారు?
కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అసోం, తమిళనాడు, ఒడిశాకు చెందిన 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జాతీయ నాయకత్వం ఆదేశాలతో ఇటీవల వారం పాటు రాష్ట్రంలో పర్యటించారు.

Telangana BJP: ‘‘రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను ఎందుకు తప్పించారు? ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఖాయమని మీ పార్టీ వారే ప్రకటించారు. మరి ఎందుకు చేయలేదు? బీఆర్‌ఎస్‌తో బీజేపీ కుమ్మక్కైందనే ప్రచారం నిజమేనా? అందులో భాగంగానే కవితను అరెస్టు చేయలేదా?’’ ఇవీ తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎదుర్కొన్న ప్రశ్నలు. ‘‘బీజేపీ-బీఆర్‌ఎస్ ఒకటే అటగా? అసెంబ్లీ ఎన్నికల్లో పరోక్షంగా మీరు బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తే.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మీకు మద్దతు ఇస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజముందా?’’ అని నిలదీసినంత పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితిని అంచనా వేయడంతో పాటు పార్టీ విజయావకాశాలపై సర్వేకు వెళ్లిన వీరంతా.. తమకు ఎదురైన ఊహించని అనుభవంతో అవాక్కయ్యారు.
వారం పాటు తెలంగాణలో పర్యటన
కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అసోం, తమిళనాడు, ఒడిశాకు చెందిన 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జాతీయ నాయకత్వం ఆదేశాలతో ఇటీవల వారం పాటు రాష్ట్రంలో పర్యటించారు. ‘ఎక్కడెక్కడ గెలిచే అవకాశం ఉంది? ఇలాంటిచోట ఏం చేయాలి? బలహీనంగా ఎక్కడ ఉన్నాం? ప్రజాదరణ ఉన్న నాయకులు ఎవరు? ప్రత్యర్థి పార్టీల్లో గట్టి నాయకులెవరు?’ తదితర అంశాలతో వీరు సర్వే నిర్వహించారు. సామాజికంగా ప్రభావితం చేసే కీలక వ్యక్తులతో భేటీ అయ్యారు. కేడర్, సామాజికంగా పలుకుబడి ఉన్న ముఖ్యుల నుంచి తాము ఎదుర్కొన్నది రెండే ప్రశ్నలని.. అవి సంజయ్‌ను తప్పించడం, కవితను అరెస్టు చేయకపోవడం అని ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. ఇదే అంశాలపై డాక్టర్లు, రైతులు, యువకులు ఒకవిధంగా తమను నిలదీశారని మరో ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంజయ్‌ను తప్పించిన తర్వాత పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని ఒక చార్టెడ్ అకౌంటెంట్ స్పష్టం చేశారన్నారు. నియోజకవర్గం సర్వేకు వెళ్లామా? లేక సంజయ్ సర్వే కోసం వెళ్లామా? అనిపించిందని మరో ఎమ్మెల్యే వివరించారు. కాగా, వీరంతా తాజా రాజకీయ పరిస్థితులపై జాతీయ నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
ఛుగ్‌జీ.. కేసీఆర్ అవినీతిపై చర్యలేవి?
సీఎం కేసీఆర్ రూ.వేల కోట్ల అవినీతి చేస్తున్నా ఎలాంటి చర్యలు లేకపోవడం, కవితను అరెస్టు చేయకపోవడంతో.. ప్రజలు మనలిన నమ్మడం లేదని నల్లగొండ జిల్లా నేతలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్మి తరుణ్ ఛుగ్ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకటేనని చెబుతున్నా విశ్వసించడం లేదన్నారు. ప్రతిగా.. బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్నే నమ్ముతున్నారని అన్నారు. తమకు ఎదురైన అనుభవాలను వారు వివరించగా.. ఛుగ్ స్పందిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తుందని.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తాయని సమాధానం ఇవ్వడం గమనార్హం. బిజెపి ఎమ్మెల్యేల ఇలాంటి సమాధానాలు ఇవ్వడంతో ఏం చేయాలో పాలు పోని పరిస్థితి కమలం పార్టీ నాయకుల్లో ఏర్పడింది. మరి దీనిని ఏ విధంగా చక్కదిద్దుతారో వేచి చూడాల్సి ఉంది.
