Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుపై స్పందించడానికి సినీ పరిశ్రమకు ఎందుకంత భయం?
తాజాగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చంద్రబాబు అరెస్టుపై మాట్లాడారు. ఈ ఘటనను ఖండించాలి అని.. తనకున్న ఆ పని చేయలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తో పాటు ఎందరో ముఖ్యమంత్రులు తెలుగు
సినీ పరిశ్రమకు మంచి సేవలు అందించారని గుర్తు చేశారు.

Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమలో కదలిక వస్తోంది. కానీ రకరకాల భయాందోళనలతో చాలామంది ప్రముఖులు స్పందించడానికి ముందుకు రావడం లేదు. స్పందించాలని ఉన్నా.. వారికి ఏవేవో భయాలు వెంటాడుతున్నాయి. తెలంగాణ,ఏపీ ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు తప్పవని భావిస్తూ వారు వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది . చంద్రబాబు అరెస్టు తరువాత ఏపీతో పాటు తెలంగాణ, మిగతా అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్న కామెంట్స్ వినిపించాయి.
తొలుత చంద్రబాబు అరెస్ట్ పై తెలుగు సినీ పరిశ్రమ నుంచి రాఘవేంద్రరావు, అశ్విని దత్ స్పందించారు. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. కానీ ఈ ఇద్దరికీ తెలుగుదేశం పార్టీతో మంచి అనుబంధం ఉంది. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరికీ మించి ఎవరూ స్పందించకపోవడంతో సినీ పరిశ్రమపై విమర్శలు వ్యక్తమయ్యాయి. వైసీపీ సర్కార్కు భయపడే ఎవరు ముందుకు రావడం లేదన్న వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో మాజీ ఎంపీ మురళీమోహన్ వైసీపీ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేసినా.. ఆయన సైతం తెలుగుదేశం పార్టీ నేతల కోటాలోకి వెళ్లిపోయారు. అటు తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం స్పందించారు. కానీ తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖులు ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం.
తాజాగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చంద్రబాబు అరెస్టుపై మాట్లాడారు. ఈ ఘటనను ఖండించాలి అని.. తనకున్న ఆ పని చేయలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తో పాటు ఎందరో ముఖ్యమంత్రులు తెలుగు
సినీ పరిశ్రమకు మంచి సేవలు అందించారని గుర్తు చేశారు. కానీ ఇది ఒక సున్నితమైన రాజకీయ అంశం కావడంతో స్పందించలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. తద్వారా దీనికి సినీ పరిశ్రమతో సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే స్పందించను అంటూనే సురేష్ బాబు తన మనసులో ఉన్న మాటను బయటకు వ్యక్తం చేశారు.
మరోవైపు మనసు ఉండబట్టలేక నిర్మాత బండ్ల గణేష్ సైతం బరస్ట్ అయ్యారు. తనదైన రీతిలో స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ తనను ఎంతో బాధించిందని.. ఆ బాధలో తాను ఇంట్లో వినాయక చవితి వేడుకలు జరుపుకోలేదని బాధపడ్డారు. చంద్రబాబు జైల్లో ఇబ్బంది పడుతుంటే తనకు అన్నం కూడా తినబుద్ధి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించి చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఖాయం అని బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. చంద్రబాబు జాతీయ సంపదని.. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరు చెప్పుకొని ఎంతోమంది బాగుపడ్డారని సంచలన కామెంట్స్ చేశారు. మొత్తానికైతే తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కొక్కరు చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తుండడం విశేషం.
