
CM Jagan
CM Jagan: దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఉంటుంది. సాధారణంగా ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి, ప్రజల ఇబ్బందులు, కొత్త పథకాల అమలు వంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. అయితే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తుంటారు. మీడియా అంటే అందులోను తెలుగు మీడియా అంటే సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏ మాత్రం నచ్చదు. అందుకే మీడియా సమావేశాలు పెట్టేందుకు కూడా ఆయన పెద్దగా ఇష్టపడరు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆ తరువాత నుంచి దూరం..
అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటి, రెండు సార్లు మీడియాతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటల్లో తప్పులను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ట్రోల్ చేశాయి. దీంతో ఆ తర్వాత నుంచి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి మానేశారు. కొద్ది నెలలపాటు ఎడిట్ చేసిన వీడియోలు మీడియాకు రిలీజ్ చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రక్రియను నిలిపేశారు. దీంతో మొత్తంగా మీడియాతో మాట్లాడాలన్న వ్యవహారాన్ని సీఎం పూర్తిగా పక్కన పెట్టేసారు.
ఎందుకు ఈ సమస్య..
సాధారణంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అనేక అంశాలపై మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అనేక విషయాలను తెలియజేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మీడియాతో తనకు అవసరమే లేదన్నట్లు గత నాలుగేళ్లుగా ఆయన వ్యవహరించిన తీరును చూస్తే అర్థమవుతుంది. మీడియాతో మాట్లాడటం వలన వచ్చే లాభం కంటే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతోనే ఆయన దూరంగా ఉంటున్నారని విమర్శలు ఉన్నాయి.

CM Jagan
జాతీయ మీడియాతో..
ఇక రాష్ట్రస్థాయిలో మీడియాతో మాట్లాడేందుకు అసలు ఇష్టపడని సీఎం జగన్ మోహన్ రెడ్డి జాతీయస్థాయి చానల్స్ తో మాత్రం ఎక్కువగానే మాట్లాడుతుంటారు. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు జాతి స్థాయిలో ఉన్న మీడియాతో మాట్లాడటం వలన ఏ విషయాలు తెలుస్తాయి అన్న భావన సర్వత్రా ఉంది. ఇక రాష్ట్రంలో తనకు ఉన్న సాక్షితో తప్ప మరో ఛానల్ తో మాట్లాడిన దాఖలాలు ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ కనిపించలేదు. సాక్షి ఉంటే చాలు మరే ఛానల్, పత్రిక అవసరం లేదన్న భావన ఆయనలో ఉంది. తెలుగు మీడియాను సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారన్న విమర్శలు ఉన్నాయి. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, ఆయా ప్రశ్నల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను భరించలేక మీడియాకు సీఎం జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలకు చెక్ చెప్పాల్సిన జగన్ మోహన్ రెడ్డి పట్టనట్టుగా వ్యవహరించడం వలన అది నిజమేనన్న భావన ప్రజల్లోనూ వ్యక్తం అవుతోంది.