
TV9 Ravi Prakash
TV9 Ravi Prakash: అప్పట్లోనే మనం చెప్పుకున్నాం.. టీవీ9 రవి ప్రకాష్ కెసిఆర్ ఫోల్డ్ లోకి వెళ్లిపోతున్నాడని.. ఇవాళ అది అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే టీవీ9 నుంచి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో బయటకు వచ్చిన తర్వాత రవి ప్రకాష్ రఘు అనే ఒక జర్నలిస్టు తో తొలి వెలుగు అనే ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. ఇదే రఘుతో అప్పట్లో మోజో అనే ఛానల్ రన్ చేశాడు. టీవీ9 నుంచి పెట్టుబడులను మోజో ఛానల్ లో పెట్టాడని రవి ప్రకాష్ మీద అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. తర్వాత అతడు పెంచి పోషించిన ఛానల్స్ అతడికి కాకుండా పోయాయి. దీని తెర వెనుక సీఎం కేసీఆర్ ఉన్నాడు.. ఆ కేసీఆర్ కనుసన్నల్లో మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డి ఉన్నారు. వాళ్లే టీవీ9 తెలుగును కొనుగోలు చేశారు. మోజో ను హస్తగతం చేసుకున్నారు. అప్పటినుంచి రవి ప్రకాష్ పెద్దగా వెలుగులో లేడు. ఈ పంచాయతీని సెటిల్ చేయాలని టీవీ9 భారత వర్ష ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విన్నవించే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
ఇక్కడ సీన్ కట్ చేస్తే తనకు రావలసిన ప్రయోజనాల కోసం, తాను పెంచి పోషించిన టీవీ9 కోసం రవి ప్రకాష్ చేయని ప్రయత్నాలు అంటూ లేవు. అతడు కోర్టుకు వెళ్ళినా చుక్కెదురు కావడంతో సైలెంట్ అయిపోయాడు.. ఇదే సమయంలో కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం, దేశ రాజకీయాల్లో చక్రాలు తిప్పాలని అనుకోవడంతో వెంటనే రవి ప్రకాష్ గుర్తుకు వచ్చాడు. ఇప్పటిదాకా శత్రువు అయిపోయిన అతడు.. తర్వాత మిత్రుడు అయిపోయాడు.. ఈ క్రమంలోనే ఆయనకు ఆర్ టీ వీ ఏర్పాటుకు కెసిఆర్ కాంపౌండ్ నుంచి నిధులు అందుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఛానల్ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయినట్టు సమాచారం. ఇప్పటి యూట్యూబ్ కాలంలో ఈ ఛానల్ ఎవరు చూస్తారు అనేది మీ సందేహం కదా.. అసలు టార్గెట్ వేరే విధంగా ఉన్నప్పుడు.. రవి ప్రకాష్ ఈ వాదనలను లెక్కచేయడు. ఇప్పుడు టీ న్యూస్, ఎన్టీవీ, హెచ్ఎంటీవీ భారత రాష్ట్ర సమితి మౌత్ పీసులుగా ఉన్నాయి. మరి ఇలాంటి అప్పుడు రవి ప్రకాష్ అవసరం చంద్రశేఖర రావుకు ఏమిటి అని మీకు సందేహం రావచ్చు. ఇప్పుడు జాతీయస్థాయిలో తను ప్రొజెక్టు కావడానికి సరైన వేదిక కావాలి. రవి ప్రకాష్ కు ఎలాగూ టీవీ9 భారత వర్ష అనుభవం ఉండటంతో ఆ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.

TV9 Ravi Prakash
ఇక రవి ప్రకాష్ ఎలాగూ కెసిఆర్ ఫోల్డ్ లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో తన తొలి వెలుగు వెబ్ ఛానల్ కు కూడా గులాబీ రంగు వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. మొన్నటిదాకా కవితకు వ్యతిరేకంగా వార్తలు వచ్చిన ఆ చానల్లో ఇకనుంచి పాజిటివ్ కోణం చూపించాలని ఆ ఛానల్ రన్ చేస్తున్న రఘు అనే జర్నలిస్టుకు రవి ప్రకాష్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఉదయం నుంచి రఘు అగ్గిమీద గుగ్గిలవుతున్నాడు. ఆ మధ్య రఘును తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు 15 రోజులపాటు జైల్లో ఉంచారు. దీంతో రఘు రెట్టించిన ఉత్సాహంతో అధికార పార్టీ లోపాలను ప్రజల ముందు ఉంచాడు. వాస్తవానికి తొలి వెలుగు ఛానల్ సుమారు పది లక్షల మంది సబ్స్క్రైబర్లతో ఉంది అంటే దానికి కారణం రఘు. కానీ రెండో మాటకు తావు లేకుండా రఘును నిర్ధాక్షిణ్యంగా బయటికి గెంటి వేయడంతో రవి ప్రకాష్ అసలు రూపం ఇప్పుడు బయటపడుతోంది. అంతేకాదు యాజమాన్యాలు తమ వ్యాపార అవసరాల కోసం మాత్రమే జర్నలిజాన్ని నడిపిస్తాయని వెలుగులోకి వస్తోంది. ఇలాంటప్పుడు ఆ ఛానల్ నాదని రఘు అనడంలో ఉపయోగం లేదు. గొంతు చించుకున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే మీడియాలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు ఉండరు. ఇది నానుడి కాదు. ప్రస్తుత సమాజానికి రవి ప్రకాష్ నేర్పుతున్న “న్యూ” నుడి.