
Australia Vs India 2nd Odi
Australia Vs India 2nd Odi: ముంబైలో తొలి వన్డే గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా ఆదివారం ఆస్ట్రేలియా తో వైజాగ్ లో జరిగే మ్యాచ్ కి సన్నద్ధమవుతోంది. ఇక్కడి మ్యాచ్లో గెలిచి ట్రోఫీని ఒడిసి పట్టాలని అనుకుంటున్నది.. తొలి వన్డేకు గైర్హాజరైన కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి రావడంతో జట్టులో ఉత్సాహం తొణికిసలాడుతోంది. తొలి మ్యాచ్లో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షో తో టీమ్ ఇండియా గెలిచింది.. మరోవైపు 0_1తో వెనుకబడిన ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ సిరీస్ లో జట్టు ఆశలు సజీవంగా ఉండాలంటే స్మిత్ సేనకు గెలుపు తప్పనిసరి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ కోల్పోకూడదనే పట్టుదలతో ఉంది.
ఇక తొలి వన్డేలో భారత జట్టు నుంచి మెరుగైన ప్రదర్శన కనిపించలేదు. బౌలర్లు తమ పాత్ర పోషించినప్పటికీ.. బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ నిరాశపరిచారు. మరో ఓపెనర్ గిల్ ఎక్కువసేపు క్రీజు లో ఉండలేకపోయాడు. హార్థిక్ పాండ్యా కూడా సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మరోవైపు తొలి వన్డేలో వ్యక్తిగత పని వల్ల మ్యాచ్ కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. రెండో వన్డేలో జట్టులోకి ప్రవేశించాడు దీంతో కిషన్ రిజర్వ్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. తొలి మ్యాచ్లో డక్ ఔట్ అయిన సూర్యకుమార్ యాదవ్.. జట్టు ఆశలను నీరుగార్చాడు. టీ20 లో సూర్య కుమార్ యాదవ్ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు. వన్డే ఫార్మాట్లో మాత్రం సత్తా చాటులేకపోతున్నాడు.. ఈ ఏడాది ఆడిన ఐదు మ్యాచ్ల్లో కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు..ఇప్పటి వరకూ 27 వన్డేలు ఆడిన అతడు కేవలం రెండు హాఫ్ సెంచరీ లు మాత్రమే చేశాడు. అయ్యర్ గైర్హాజరుతో సూర్య స్థానానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ… అతడు తనను తాను నిరూపించుకోకపోతే మున్ముందు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. ఇక ఐదో నెంబర్ లో కొనసాగుతున్న రాహుల్ తొలి మ్యాచ్లో సత్తా చాటాడు. ఇప్పుడు అందరి చూపు అతడి పైనే ఉంది.

Australia Vs India 2nd Odi
ఇక గాయం నుంచి కోల్పోయిన తర్వాత టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చెల రేగిపోతున్నాడు. ఫార్మాట్ ఏదైనా రెచ్చిపోయి ఆడుతున్నాడు.. ఏడాది చివర్లో వరల్డ్ కప్ ఉండడంతో జడ్డూ ఫాం జట్టుకు కీలకంగా ఉంది. బౌలింగ్లో షమీ, సిరాజ్ రాణిస్తున్నారు..వైజాగ్ పిచ్ ను దృష్టిలో పెట్టుకొని శార్దూల్ స్థానంలో స్పిన్నర్ అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.. అతను బ్యాటింగ్ లోనూ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కులదీప్ యాదవ్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు.
ఇక తొలి వన్డేలో నలుగురు ఆల్ రౌండర్ లతో బరిలోకి దిగినా ఆస్ట్రేలియాకు ఉపయోగం లేకుండా పోయింది. వార్నర్ స్థానం లో బరిలోకి దిగిన మార్ష్ ప్రమాదకరమైన ఆట తీరుతో చెలరేగిపోయాడు. బౌలింగ్ కు అనుకూలమైన మైదానం లో షాట్లు ఆడాడు. అయితే మధ్య ఓవర్లలో ఆస్ట్రేలియా తడబడటంతో వికెట్లు కోల్పోయింది. చావో రేవో తేలాల్సిన మ్యాచ్లో అలాంటి పొరబాటు చేయకుండా ఉండాలనే భావనతో ఆస్ట్రేలియా ఉంది. ఇక ఇండియా టూర్ లో స్మిత్ ఇంతవరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఏది ఏమైనప్పటికీ తమ బ్యాటింగ్ లోపాలు సరిదిద్దుకొని ఎదురు దాడికి దిగాలని ఆస్ట్రేలియా జట్టు అనుకుంటున్నది.
ఇక వైజాగ్ కు వాన ముప్పు పొంచి ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న అకాల వర్షాలు ఆ మ్యాచ్ పై ప్రభావం చెప్పే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు..మ్యాచ్ రోజూ వైజాగ్ మొత్తం మేఘావృతమై ఉంటుందని చెబుతున్నారు.. వర్షం కురిసే అవకాశం 80శాతం వరకు ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఒకవేళ వర్షం తెరిపినిస్తే 45 నిమిషాల్లో సిద్ధం చేస్తామని నిర్వాహకులు అంటున్నారు. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. సగటు స్కోర్ 241 కాగా, ఇక్కడ నమోదైన అత్యధిక స్కోరు 387.
జట్ల అంచనా ఇలా
భారత్
గిల్, రోహిత్( కెప్టెన్), విరాట్, సూర్య, రాహుల్, హార్దిక్, జడేజా, శార్దూల్/ అక్షర్, కులదీప్, సిరాజ్, షమీ.
ఆసీస్
హెడ్, మార్ష్, స్మిత్( కెప్టెన్), లబు షేన్, మ్యాక్స్ వెల్, స్టోయినీస్, ఎబాట్, స్టార్క్, జంపా.