Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ ఎవరికి లాభం?
సమాజంలో చాలా రకాల మైండ్ సెట్ ఉన్నవారు ఉంటారు. అప్పట్లో జగన్ను అక్రమంగా అరెస్టు చేశారని భావించారు. తండ్రి మరణం తర్వాత జగన్ను ఏకాకి చేసి అణగదొక్కారని ఒక అభిప్రాయానికి వచ్చారు.

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఇప్పుడు ఈ రెండు అంశాల చుట్టూనే ఏపీ రాజకీయం నడుస్తోంది. చంద్రబాబు అరెస్టుతో విపరీతమైన సానుభూతి లభిస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అంత సీన్ లేదని వైసిపి వాదిస్తోంది. కాసేపు ఆ రెండు పార్టీల విషయాన్ని పక్కన పెడితే.. సామాన్య జనాలు, తట్టస్తులు ఎలా భావిస్తున్నారన్నదే ఇప్పుడు ముఖ్యమైన అంశం. 74 సంవత్సరాల వయస్సు ఉన్న చంద్రబాబును అరెస్టు చేయడం ఎవరికైనా బాధ కలిగిస్తుంది. అయితే చంద్రబాబుపై విపరీతమైన ఏహ్యభావం ఉన్నవారు మాత్రం ఆయనకు తగిన శాస్తి జరిగిందని చెబుతున్నారు. కానీ రాజకీయాలతో సంబంధం లేని వారు… తటస్తులు మాత్రం ఎక్కువగా తప్పు పడుతున్నారు. మరికొందరు మాత్రం రివేంజ్ రాజకీయాలతో పోల్చుతున్నారు.
సమాజంలో చాలా రకాల మైండ్ సెట్ ఉన్నవారు ఉంటారు. అప్పట్లో జగన్ను అక్రమంగా అరెస్టు చేశారని భావించారు. తండ్రి మరణం తర్వాత జగన్ను ఏకాకి చేసి అణగదొక్కారని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆ క్రమంలో వచ్చిన సానుభూతి జగన్ను ఒక తిరుగులేని నాయకుడిగా చేసింది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా చంద్రబాబు విషయంలో సానుభూతి వస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఎఫ్ఐఆర్లో పేరు లేకపోవడం, అప్పటికప్పుడు పేరు నమోదు చేయడం, a37 గా ఉన్న చంద్రబాబును అరెస్టు చేయడం, కనీస ఆధారాలు చూపించలేకపోవడం, అరెస్టు చేసే సమయంలో నిబంధనలను పాటించకపోవడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి రాజకీయ కక్షతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఏపీలో మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు.
అయితే ఏసీబీ కోర్టులో విచారణ, పాత కేసులు తిరగ దోడడం వంటి కారణాలు ప్రజల్లో సానుభూతికి కారణమయ్యాయి. కానీ హైకోర్టులో సైతం క్వాష్ పిటిషన్ కొట్టివేత తర్వాత పరిస్థితిలో కాస్త చేంజ్ కనిపించింది. ఈ కేసులో ఏదో దాగి ఉందని.. అవినీతి జరిగి ఉంటుందని క్రమేపీ అనుమానాలు పెరిగాయి. అలా వ్యాప్తం చేయించడంలో జగన్ సర్కార్ సక్సెస్ అయ్యింది. అయితే పాత కేసులను తిరగ దోడడం.. వీలున్నంతవరకు చంద్రబాబును రిమాండ్ లో ఉంచే ప్రయత్నం చేయడంవంటివి మాత్రం వైసీపీ సర్కార్కు ప్రతికూలంగా మారాయి.ఆ మధ్యన ఓ సర్వేలో సైతంఇదే అంశం ఎక్కువగా ప్రభావం చూపడం విశేషం.
ఒకవేళ కానీ క్వాష్ పిటీషన్ను సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసి.. రిమాండ్ ను కొట్టేస్తే మాత్రం చంద్రబాబు విజృంభించే అవకాశం ఉంది. వైసీపీ సీనియర్లలో అదే భయం వెంటాడుతోంది. పైగా ఇటువంటి రివెంజ్ రాజకీయాలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్లో సీనియర్ మంత్రులు ఎవరూ నోరు మెదపట్లేదు. ఆర్కే రోజా, అప్పలరాజు వంటి జూనియర్లే ఎక్కువ మాట్లాడుతున్నారు. జగన్ విషయంలో పనిచేసిందే సానుభూతి. పైపెచ్చు ఆయన ఏమైనా స్టేట్ లీడర్ కాదు, ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడు కాదు. కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, ఆపై రాజకీయంగా అణచివేతకు గురయ్యారన్న సానుభూతితోనే ఆయన నాయకత్వం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు సీనియారిటీకి సానుభూతి తోడైతే తప్పకుండా తాము మూల్యం చెల్లించుకోవడం తప్పదని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
