
Chandrababu
AP MLC Election Results: తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అన్ని మంచి శకునాలే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయాలను ఆ పార్టీ సొంతం చేసుకుంది. మూడు పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకుంది. కీలకమైన ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ స్థానాల్లో విజయం సాధించింది. పశ్చిమ రాయసీమలో చివర వరకూ విజయం దోబూచులాడినా.. రెండో ప్రాధాన్యత ఓట్లలో టీడీపీ మెజార్టీ దక్కించుకుంది. తొలి ప్రాధాన్య ఓట్లలో వైసీపీకి స్వల్ప ఆధిక్యత వచ్చినా.. రెండో ప్రాధాన్యత ఓట్లలో మాత్రం టీడీపీ నెగ్గుకు రాగలిగింది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి వ్యూహాలు ఎంతగానో పనిచేశాయి. అటు పవన్ యాంటీ వైసీపీ పిలుపు,.. పీడీఎఫ్ తో రెండో ప్రాధాన్యత ఓట్ల విషయంలో పరస్పర అవగాహన లాభించింది. వైసీపీకి కీలకమైన, పట్టున్న రాయలసీమలోనే ఆ పార్టీకి దెబ్బగొట్టగలిగింది.
అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ప్రజల్లో చరిష్మ ఉన్న వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయడం కలిసి వచ్చింది. ఉత్తరాంధ్రలో బీసీ మహిళ గాడు చిన్నకుమారి లక్ష్మిని బరిలో దించారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో పరిచయ కార్యక్రమాన్ని సైతం పూర్తిచేశారు. అయితే అనూహ్యంగా జనవరి 31న వేపాడ చిరంజీవిరావును తెరపైకి తెచ్చారు. ఆయన విద్యాధికుడు. ఉపాధ్యాయ వృత్తి నుంచి డిగ్రీ కాలేజీ అధ్యాపకుడి వరకూ వివిధ హోదాల్లో పనిచేశారు. అందరికీ సుపరిచితులు కావడం, కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మరింత కలిసి వచ్చింది.
రాయసీలమ స్థానాలకు వచ్చేసరికి ఈసారి అనేక సంచలనాలు నమోదయ్యాయి. ఏకంగా పులివెందుల నుంచి పశ్చిమ రాయలసీమ క్యాండిడేట్ ను నిలబెట్టడం వ్యూహాత్మకంగా టీడీపీకి కలిసి వచ్చింది. సింహాద్రిపురం మండలానికి చెందిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని టీడీపీ హైకమాండ్ గుర్తించి బరిలో దించింది. అయితే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఒక ఎత్తు.. పశ్చిమ రాయలసీమ మరో ఎత్తుగా ఉండేది. ఇక్కడ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పట్టు ఎక్కువ. ఇప్పటివరకూ టీడీపీ చెప్పుకోదగ్గ విజయాలు నమోదుచేయలేదు. అయినా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు వచ్చేసరికి మంచి ఫలితమే నమోదుచేయగలిగింది. అయితే ఈ విజయం వెనుక లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు బదలాయింపు జరగడమే గెలుపునకు కారణం.

Chandrababu- Jagan
పశ్చిమ రాయలసీమ స్థానంలో ఎన్నిక ఫలితం పైన తొలి నుంచి చివరికి ఫలితం సమయంలోనూ ఉత్కంఠ కొనసాగింది. మొదటి ప్రాధాన్య ఓటులో గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 1,13,224 ఓట్లు రావాలి. తొలి ప్రాధాన్యం కింద వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డికి 95,969 ఓట్లు మాత్రమే వచ్చాయి. అగ్రస్థానంలో ఉన్న ఆయన గెలిచేందుకు మరో 17,255 ఓట్లు అవసరమయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓట్లతో చివరకు టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు. 7,543 ఓట్ల మెజార్టీ సాధించారు. 3 రోజులపాటు ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చివరకు టీడీపీ అభ్యర్థినే విజయం వరించింది. పులివెందుల నుంచి టీడీపీ ఎమ్మెల్సీగా గెలిచిన వారిలో రాంగోపాలరెడ్డి రెండో వ్యక్తి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నాడు పోటీ చేసిన దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి పైన బీటెక్ రవి గెలుపొందారు.
అయితే టీడీపీ, లెఫ్ట్ మధ్య జరిగిన రెండో ప్రాధాన్యత ఓట్ల అవగాహన పీడీఎఫ్ కు పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ టీడీపీ మాత్రం భారీగా లబ్ధి పొందింది. మూడుచోట్ల రెండో ప్రాధాన్యత ఓట్లతోనే టీడీపీ గట్టెక్కిన విషయాన్ని గుర్తించుకోవాలి. అదే సమయంలో టీడీపీ ఒక స్లోగన్ అందుకుంటోంది. వైనాట్ 175 అన్న స్లోగన్ ను తిప్పికొడుతోంది. పులివెందులకు చెందిన రాంగోలపాల్ రెడ్డి విజయంతో.. వైనాట్ పులివెందుల అని పసుపుదళం సౌండ్ చేస్తోంది. కడపలో భారీ ర్యాలీ తీసిన టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాగా ఇదే ఫార్ములాతో మున్ముందు పులివెందులపై పంజా విసరాలని టీడీపీ వ్యూహం పన్నుతోంది.