Karnataka Election Results: కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఎవరు సంతోషంగా ఉన్నారు?
ఏపీలో కూడా అటువంటి పరిస్థితే. ఉనికి చాటుకోవాలంటే పొత్తులు పెట్టుకోవాలి. లేకుంటే మాత్రం పరువుపోయే పరిస్థితి. ఇన్నాళ్లూ చంద్రబాబును దూరం పెట్టినా దగ్గరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఓటమి బీజేపీలో అనూహ్యమైన మార్పులకు దారి తీసే అవకాశం ఉంది.

Karnataka Election Results: దాని పేరే రాజకీయం. పార్టీలన్నాక వ్యూహాలు ఉంటాయి. మిత్రులుంటారు.. ప్రత్యర్థులుంటారు.. అన్నింటికీ మించి అంతర్గతంగా కూడా శత్రుత్వం, మిత్రుత్వం నడుస్తుంటుంది. అయితే ఇప్పుడు కర్నాటకలో బీజేపీ ఓటమి ఎవరికి మోదం.. ఎవరికి ఖేదమంటే సమాధానం దొరకని ప్రశ్న. అయితే బాహటంగా ఎవరూ మాట్లాడకపోయినా లోలోపల అన్ని పార్టీలు సంతోషించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏపీలో పార్టీలు కర్నాటక ఫలితాలను ఎలా తీసుకుంటున్నాయన్న చర్చ నడుస్తోంది. ఏపీలో చూస్తే బయటకు కనిపించేది అంతా బీజేపీకి మిత్రులే. ఒక్క వామపక్షాలు మాత్రమే బాహటంగా విమర్శిస్తాయి. మిగతా పార్టీలకు అంత సీన్ లేదు.
బాధిత పార్టీల్లో ఖుషీ..
యావత్ భారతావనని బీజేపీ బలవంతంగా కబళిస్తోంది. దొడ్డిదారిని చాలా రాష్ట్రాలను హస్తగతం చేసుకుంది. ఇలా వశపరచుకున్న రాష్ట్రాల జాబితా చాంతాడంత ఉంది. బాధిత పార్టీలు సైతం ఉన్నాయి. అవన్నీ టైమ్ కోసం వేచిచూస్తున్నాయి. మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో శివసేనను ఇలానే చావుదెబ్బ కొట్టింది. అలాంటి బీజేపీ ఇపుడు కర్నాటకలో చతికిలపడిపోయింది. దాంతో పాటు బీజేపీ విపక్ష పార్టీలను కట్టడి చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందన్న ఆరోపణ ఉంది. అందుకే దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీని శత్రువుగానే చూస్తున్నాయి. కానీ కొన్ని పార్టీల అవసరాలు, భయంతో బలవంతపు స్నేహాన్ని కొనసాగిస్తున్నాయి.
లెక్కలు మారే చాన్స్..
బీజేపీ బాధిత పార్టీలన్నీ ధైర్యం పోగుచేసుకునే అవకాశముంది. నిన్నటివరకూ బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేవారు అధికం. కర్నాటక రిజల్ట్స్ తో కాస్తా అనుమానం ప్రారంభమైంది.కాంగ్రెస్ గెలవడంతో లెక్కలు ఏమైనా మారుతాయా అన్న చర్చ కూడా వస్తోంది. దాంతో బీజేపీ ఓటమిని చెందడాన్ని బయటకు ఏమీ అనకపోయినా లోలోపల మాత్రం దేశంలోని అన్ని పొలిటికల్ పార్టీలు ఆనందపడుతున్నాయి. ఇక ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీ జనసేన వంటివి కొంత హ్యాపీగానే ఫీల్ అవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
మర్యాద తగ్గితే..
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మర్యాద తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ప్రయత్నంలో ఉన్న బీజేపీ గతంలో మాదిరిగా దూకుడు కనబరచలేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు తగ్గుతాయి. కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో బలం ఉండడంతో ఆ పార్టీకి జవసత్వాలు పెరిగే అవకాశముంది. దీంతో బీజేపీ మిగతా రాజకీయ పక్షాలతో స్నేహం చేయక తప్పని పరిస్థితి. ఇన్నాళ్లూ పట్టించుకోని పార్టీలను చేరదీయ్యాల్సి ఉంటుంది. ఏపీలో కూడా అటువంటి పరిస్థితే. ఉనికి చాటుకోవాలంటే పొత్తులు పెట్టుకోవాలి. లేకుంటే మాత్రం పరువుపోయే పరిస్థితి. ఇన్నాళ్లూ చంద్రబాబును దూరం పెట్టినా దగ్గరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఓటమి బీజేపీలో అనూహ్యమైన మార్పులకు దారి తీసే అవకాశం ఉంది.
