
Cheddi Gang
Cheddi Gang: గత కొన్ని సంవత్సరాలుగా చెడ్డీ గ్యాంగ్ పేరు బాగా వినిపిస్తుంది. వీరు స్కెచ్ వేసి మరీ దొంగతానికి పాల్పడతారు. ఒంటిపై దిట్టంగా నూనె రాసుకొని చెడ్డీ తప్ప ఇంకేమీ ధరించరు. ఈ మధ్య వచ్చిన తమిళ హీరో ‘ఖాకీ’ సినిమాను తలపిస్తుండే వీరి దొంగతనాలు కూడా యమ డేంజర్ గా ఉంటాయి. అడ్డొచ్చిన వారికి అదే చివరి రోజు అవుతుంది. ఇంతటి భయంకర ముఠా ఎక్కడ ఎప్పుడో ప్రవేశిస్తుందో తెలియదు.
ముందుగానే రెక్కీ..
దొంగతనానికి పాల్పడే ముందు చెడ్డీ గ్యాంగ్ ముఠా ముందుగానే రెక్కీ నిర్వహిస్తారు. ఏవో వస్తువులు అమ్ముకోవడానికి వచ్చినట్లుగా కనబడతారు. ఎక్కువ శాతం తెలుగు మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. వచ్చీ రాని భాషతో మాటలు కలుపుతారు. ఇటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎంచుకున్న ఇళ్లలో కొన్నింటిని నిర్థారించుకొని పక్కగా చోరీకి పాల్పడతారు.
చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి వచ్చే ముందుకు ఒంటిపై దుస్తులు లేకుండా నూనెను రాసకుంటారు. ఎవరకిరీ దొరక్కుండా ఉండేందుకు జాగ్రత్త పడతారు. మారణాయులతో తిరుగుతూ తలుపులు కొడతారు. అరుపులు, కేకలు వేస్తుంటారు. అవి విని ఎవరైనా ఇళ్లల్లోంచి బయటకు వచ్చిన అనంతరం దాడికి పాల్పడతారు. చంపేందుకు కూడా వెనుకాడరు. ఆ తరువాత తాము వచ్చిన పనిని చక్కగా చేసుకొని వెళ్లిపోతారు.
‘చెడ్డీ‘ ఉనికిని గుర్తించిందెప్పుడు?
చెడ్డీ గ్యాంగ్ సృష్టికర్త రాంజీ. ఇతనిది గుజరాత్‌లోని దావోద్ జిల్లాలోని గూద్‌బాలా తాలూకా ఓ గిరిజన గ్రామం. కొంత మంది యువకులను ఒకచోటకు చేర్చి దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవారు. కొన్నాళ్లకు పదుల సంఖ్యలో ముఠాలు పుట్టుకొచ్చాయి.
కాగా, చెడ్డీ గ్యాంగ్ 1987 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వరుస దొంగతనాలు జరుగుతున్న తీరు ఒకేలా ఉండటం, సభ్యులందరూ చెడ్డీలు ధరించి ఉండడంతో ఒక నిర్థారణకు వచ్చారు. 1999లో వీరి ఉనికిని బయట ప్రపంచానికి తెలిసింది. అంటే దాదాపు 10 సంవత్సరాలుగా వీరు ఎవరికీ దొరక్కుండా దొంగతనాలు చేస్తున్నారన్న మాట. అప్పటికే వీరు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ముంబై తదితర ప్రాంతాల్లో దొంగతనాలు చేశారు. పోలీసులు గుర్తించిన వెంటనే మకాం మార్చేస్తారు. తరువాత కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చి మరలా దొంగతనానికి బయల్దేరుతారు.
మొదటిసారి గుర్తించింది హైదరాబాద్‌లో..
మన తెలుగు రాష్ట్రాల్లో చెడ్డీ గ్యాంగ్ ఉనికిని గుర్తించింది హైదరాబాద్‌లో. సుమారు 10 ఏళ్ల క్రితం వీరి కదలికలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఇది అప్పట్లో సంచలనం సృష్టించడమే కాకుండా, భాగ్యనగరం అంతటిని భయాందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. ఆ తరువాత గతేడాది మహబూబ్ నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, జగిత్యాల, రంగారెడ్డి జిల్లాలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ముఠా ఎంటరైందంటే ఎవరైనా అమ్మో అనాల్సిందే.
తాజాగా తిరుపతి, మాచర్లలో వీరు దొంగతనానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. చెడ్డీ గ్యాంగ్ సభ్యులు ఒకచోటే మకారం వేయరు. వెంటనే ఇంకో చోటకు వెళ్లిపోతారు. కాబట్టి వీరు ఎక్కడ ఎలా దొంగతనానికి తెగబడతారో తెలియదు. ఆ మేరకు పోలీసు శాఖ అప్రమత్తమైంది.
ఈ ముఠా బారి నుంచి తప్పించుకోవాలంటే…
చెడ్డీ గ్యాంగ్ ముఠా బారి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. పగటి పూట సంచార కుటుంబాల్లా కనిపించే వారు చీరలు, తినుబండారాలు, ప్లాస్టిక్ వస్తువులు లాంటివి అమ్ముకుంటున్నట్లు కనిపిస్తారు. ఇటువంటి వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. పగలు రెక్కీ నిర్వహించి తెల్లవారుజామున 3 గంటలకు అందరూ మంచి నిద్రలో ఉన్న సమయంలో దొంగతనానికి వస్తారు.
ముఖ్యంగా మారుమూల ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఓ పోలీసులు సూచిస్తున్నారు. ఇంటికి ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేసుకోవడం, కాలనీవాసులందరూ కలిసి ఓ ప్రైవేటు గుర్ఖాను గాని, నైట్ వాచ్ మెన్ ను గాని ఏర్పాటు చేసుకుంటే దొంగల బారి నుంచి కాపాడుకోవచ్చు.
రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు, ఆర్థిక పరిపుష్టి ఉన్నవారు, మారుమూల ప్రాంతాల వారు సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంటిలో నిద్రించే ముందు గడియ సరిగ్గా పెట్టుకున్నది లేనిదీ ఒకటి రెండుసార్లు చూసుకోవాలని అంటున్నారు. బయట అరుపులు, కేకలు వినిపిస్తే గడియ తీయకుండా వచ్చింది ఎవరో నిర్థారించుకోవాలని చెబుతున్నారు. అనుమానాస్పద వ్యక్తుల్లా కనిపిస్తే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని పేర్కొంటున్నారు.

Cheddi Gang
అలాగే, శుభకార్యాలకు, తీర్థ యాత్రలకు వెళ్లేముందు పోలీసులకు తెలియజేస్తే (LHM) లాక్డ్ హౌసింగ్ మానిటరింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ఇదిలా పనిచేస్తుందంటే పోలీసుల సాయం కోరిన వారి ఇంట్లో ఓ సీసీ కెమేరా ఏర్పాటు చేస్తారు. ఇది పోలీసు కంట్రోల్ రూంకు కనెక్ట్ అయి ఉంటుంది. ఎవరైనా తలుపు తీసినా, ఇంట్లోకి ప్రవేశించినా వెంటనే సమాచారం పోలీసులకు చేరిపోతుంది. అప్పుడు దొంగలను పట్టుకునే వీలుంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొంటున్నారు.
వివిధ పనులు చేసుకునే వారితో ఇబ్బంది లేదు..
పంజాబ్, హర్యానా, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి దక్షిణాది ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య ఎప్పుడు ఎక్కువైంది. కార్మికులుగా జీవనం సాగిస్తున్న వారందరినీ ఒకే గాటన కట్టలేము. వారిలో దొంగలున్నారన్న సంగతి మనకు తెలియదు. కార్మికులందరికీ ఒక మేస్రీ ఉంటాడు. వీరి ఆధీనంలోనే వారు పనిచేస్తూ ఉంటారు. ఇటువంటి వారితో మనకు తలనొప్పి లేదు. కానీ, వీరి ముసుగులో దొంగతనాలకు పాల్పడే వారిపై ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
బీ అలర్ట్…
తెలుగు రాష్ట్రాల్లో సవాల్ గా మారిన చెడ్డీ గ్యాంగ్ ఎక్కువగా వేసవి కాలంలోనే సంచరిస్తుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైంది . ఇటీవల తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ దిగినట్లు సీసీ కెమేరాలు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొన్ని నెలల క్రితం తిరుచానూరులో, దానికి ముందు చిగురువాడలోనూ చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడినట్లు సీసీ టీవీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి. ఇటీవల గుంటూరు జిల్లా మాచర్లలోనూ ఈ గ్యాంగ్ కదలికల దృశ్యాలు సీసీ టీవీకి చిక్కాయి. మరిన్ని చోట్ల దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు బీ అలర్ట్.