Ushasri Charan Resort: ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తారు. రైతుల భూములు కాజేస్తారు. ప్రశ్నిస్తే పోలీసుల అండతో బెదిరిస్తారు. ఎదిరిస్తే అణచివేస్తారు. ఇంకా వినకపోతే పదో.. పరకో పారేస్తారు. ఇది ఏపీ మంత్రి ఉషాశ్రీచరణ్ భర్త శ్రీచరణ్ తీరు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అధికారం అండతో పేట్రేగిపోతున్నారు. వందలాది ఎకరాల రైతుల భూములను చౌకగా కొనుగోలు చేయడంతో శ్రీచరణ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Ushasri Charan Resort
కల్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల పరిధిలో సులాన్ గుజరాత్ విండ్ పార్క్ సంస్థ వందలాది ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేసింది. మొదటి దశలో గాలి మరలను ఏర్పాటు చేసింది, మిగిలిన భూమిని రెండో దశలో వినియోగించుకోవాలని చూసింది. కానీ విండ్ పవర్ కెపాసిటీని విస్తరించే అవకాశం రాలేదు. దీంతో భూములు కంపెనీ చేతిలో ఉండిపోయాయి. ఇది గమనించిన ఏపీ మంత్రి ఉషా భర్త శ్రీచరణ్ రంగంలోకి దిగారు. భూములను తమకు అమ్మాలని సుజలాన్ కంపెనీ పై ఒత్తిడి తెచ్చారు. ఏపీ మంత్రి నుంచి ఒత్తిడి పెరగడం, కంపెనీ కెపాసిటీ విస్తరణ అవకాశం లేకపోవడంతో సుజలాన్ సంస్థ భూముల్ని తక్కువ ధరకే అమ్మేసింది.
కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల పరిధిలోని నూతిమడుగు, రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండల పరిధిలోని తూంచెర్ల, భానుకోట, మద్దెలచెరువు గ్రామాల్లో 160 ఎకరాలను సుజలాన్ కంపెనీ నుంచి మంత్రి ఉషా భర్త శ్రీచరణ్ కొనుగోలు చేశారు. శ్రీచణ్ డ్రైవర్ గురురాజ్ రిప్రెజెంటేటివ్ గా .. భూమి రిజిస్ట్రేషన్ తతంగం పూర్తీ చేశారు. తూంచెర్ల పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 99లో 64.80 ఎకరాలు, నూతిమడుగు పరిధిలోని సర్వే నెంబర్ 125లో 33.98 ఎకరాలు, మద్దెల చెరువు పరిధిలో సర్వే నెంబర్ 229లో 70.45 ఎకరాలను కొనుగోలు చేశారు. సాధారణంగా ఈ ప్రాంతంలో ఎకరం రూ 8 లక్షల నుంచి రూ 10 లక్షల మధ్యలో ఉంటుంది. కానీ మంత్రి భర్త కేవలం రూ. లక్షకే ఎకరం కొన్నట్టు తెలుస్తోంది.

Ushasri Charan Resort
కనగానపల్లి మండల పరిధిలో ఉన్న భూమిని చెన్నేకొత్తపల్లిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ మంత్రి భర్త చెన్నెకొత్తపల్లిలో కాకుండా కల్యాణుదర్గం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ పూర్తీ చేశారు. గత ఏడాది జులైలో సుజలాన్ ప్రతినిధి బుద్ధ వెంకటశివనాగేశ్వరావు .. మంత్రి భర్త శ్రీచరణ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. మంత్రి భర్త కొన్న భూమికి చుట్టుపక్కల భూములను కూడ భయపెట్టి కొన్నట్టు తెలుస్తోంది.
సుజలాన్ భూమి సేకరించినప్పుడు ఎకరా రూ. 3 లక్షలు, రూ 4 లక్షలకు భూమిని కొనుగోలు చేసింది. కానీ ఈ ప్రాంతంలో ఎకరం పది లక్షల దాక పలుకుతుంది. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తమకు ఉపాధి దొరకుతుందని నమ్మి రైతులు భూముల్ని అమ్మారు. కానీ ఇప్పుడు ఆ భూముల్ని మంత్రి కొనుగోలు చేయడంతో భూమిలేని నిరుపేదలుగా మారినట్టు రైతులు వాపోతున్నారు. మంత్రి భర్త కొన్న భూముల్లో రిసార్ట్ నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం భూమిని చదును చేస్తున్నారు. విషయం తెలుసుకుని రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయగా .. మీ భూములు ఎప్పుడో అమ్మేశారు. ఇక్కడ మీకేం హక్కు ఉందని మంత్రి అనుచరులు రైతుల్ని బెదిరించారు. దీంతో రైతులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.
సుజలాన్ కంపెనీ గాలిమరలు ఏర్పాటు చేస్త ఈ ప్రాంతంలో తమకు ఉపాధి దక్కుతుందని, గాలిమరలు ఏర్పాటు చేయగా మిగిలిన భూమిని సాగుచేసుకోవచ్చని రైతులు భావించారు. కానీ భూములు మంత్రి భర్త కొనేయడంతో ఒకవైపు ఉపాధి, మరోవైపు భూమిని కూడ కోల్పోయామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.