Foreign Tourists In India: విదేశీయులు మన దేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రాలను సందర్శిస్తున్నారంటే..
ఆలయాలకు ప్రసిద్ధి పొందిన ఈ రాష్ట్రం.. ఎక్కువ మంది పర్యాటకలను ఆకర్షిస్తోంది. తంజావూరు, మహాబలిపురం, మధురై వంటి ప్రాంతాల్లో చారిత్రాత్మక ఆలయాలు ఉన్నాయి. 4.1 లక్షల మంది పర్యాటకులు ఈ ఆలయాలను సందర్శించారు.

Foreign Tourists In India: మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి.. లేకపోతే మనిషికి గొడ్డుకు పెద్ద తేడా ఉండదు. వెనకటికి ముత్యాలముగ్గు సినిమాలో రామ్ గోపాల్ రావు పలికిన డైలాగ్ ఇది. ఆర్థిక స్థిరత్వం పెరిగిన తర్వాత మనుషులు తమ కళాపోషణను ఏదో ఒక రూపం ద్వారా ప్రదర్శిస్తున్నారు. వీటిలో వివిధ ప్రాంతాలను సందర్శించడం కూడా ఒకటి. అయితే పర్యాటకం అనే పదం స్ఫురణకు వస్తే మనకు మొట్టమొదటిగా పాశ్చాత్య దేశాలే గుర్తుకు వస్తాయి. అయితే మన వాళ్ళు ఆ ప్రాంతాలను సందర్శించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటే.. అక్కడి వాళ్ళు మాత్రం మన దేశంలో ఈ పది రాష్ట్రాలపై మనసు పారేసుకున్నారు. ఇంతకీ విదేశీయులు ఎక్కువగా సందర్శించే మన దేశంలోని ఆ పది రాష్ట్రాల్లో ఏమిటో ఒకసారి ఈ కథనంలో తెలుసుకుందాం.
గుజరాత్
ఘనమైన చారిత్రక వారసత్వానికి ఈ రాష్ట్రం పేరు పొందింది. దట్టమైన అడవులు, సముద్రాలు, రాణ్ ఆఫ్ కచ్, ఎడారులు.. ఈ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి..1.78 మిలియన్ విదేశీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా సౌకర్యాలు కల్పించడంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు విదేశీయులు ఆసక్తి చూపిస్తున్నారు.
మహారాష్ట్ర
ఈ ప్రాంతం అడవులకు ప్రసిద్ధి. విస్తారమైన గిరిజన తెగలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ రాష్ట్ర రాజధాని ముంబై దేశ ఆర్థిక రాజధానిగా పేరుపొందింది. సముద్ర మార్గం ఎక్కువగా ఉండటంతో వివిధ రకాలైన సంస్కృతులు ఇక్కడ విలసిల్లుతున్నాయి. ఖరీదైన హోటళ్ళు, విడిది గృహాలు ఉండటంతో 1.51 మిలియన్ విదేశీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ముఖ్యంగా ఇక్కడి తడోబా ఫారెస్ట్ కు చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. జంగిల్ సఫారీ ఇక్కడ ప్రధాన ఆకర్షణ.
పశ్చిమబెంగాల్
డార్జిలింగ్ టీ తోటలకు, సుందర్ బన్ మడ అడవులకు, చారిత్రాత్మక భవనాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. హౌరా వంతెన, విక్టోరియా మెమోరియల్ మ్యూజియం, మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్.. వంటి ప్రాంతాలు కూడా పశ్చిమ బెంగాల్ లోనే ఉన్నాయి. బెంగాల్ టైగర్ ఇక్కడి అడవుల్లో విరివిగా కనిపిస్తుంది. 1.04 మిలియన్ ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శించారు.
ఢిల్లీ
దేశ రాజధానిగా పేరుపొందిన ఈ ప్రాంతం.. చారిత్రాత్మక ఆనవాళ్లకు ప్రతీతి. వివిధ రాజుల కాలంలో నిర్మించిన భవనాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.
విభిన్న సంస్కృతులకు ఈ ప్రాంతం ఆలవాలం. 8.2 లక్షల మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు.
ఉత్తర ప్రదేశ్
ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, షాజహాన్ కాలంలో నిర్మించిన తాజ్ మహల్ ప్రపంచ ఏడవ వింతగా ప్రసిద్ధి పొందాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. బాలీవుడ్ సినిమా షూటింగులు ఎక్కువగా ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. 6.5 లక్షల మంది పర్యాటకులు ఈ ప్రాంతాలను సందర్శించారు.
తమిళనాడు
ఆలయాలకు ప్రసిద్ధి పొందిన ఈ రాష్ట్రం.. ఎక్కువ మంది పర్యాటకలను ఆకర్షిస్తోంది. తంజావూరు, మహాబలిపురం, మధురై వంటి ప్రాంతాల్లో చారిత్రాత్మక ఆలయాలు ఉన్నాయి. 4.1 లక్షల మంది పర్యాటకులు ఈ ఆలయాలను సందర్శించారు.
రాజస్థాన్
ఎడారి రాష్ట్రంగా పేరు పొందిన రాజస్థాన్లో.. రాజ దర్బార్లకు కొదవలేదు. పింక్ సిటీగా పేరుపొందిన జైపూర్ ఈ రాష్ట్రానికి రాజధాని. ఇక్కడ ఎత్తయిన కోటలు ఉంటాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ లు ఇక్కడ ఎక్కువ జరుగుతుంటాయి. ఉదయ్ పూర్, జోధ్ పూర్, జై సల్మీర్ వంటి ప్రాంతాలు పర్యాటకుల మదిని దోచుకుంటున్నాయి. ఈ ప్రాంతాలను 4 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు.
కేరళ
భగవంతుడి సొంత ప్రాంతంగా పేరుపొందిన కేరళ రాష్ట్రాన్ని సందర్శించేందుకు విదేశీ పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాఫీ తోటలు, టీ గార్డెన్లు, అరేబియా సముద్రం, రబ్బరు తోటలు, ఇక్కడ విశేష ప్రాచుర్యం పొందాయి. ఈ ప్రాంతాలను 3.5 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు.
పంజాబ్
శౌర్యానికి ప్రతీకైన పంజాబ్ రాష్ట్రంలో దర్శనీయ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం చూడదగిన ప్రదేశం. ఈ సిక్కుల దేవాలయాన్ని చూసేందుకు 3.5 లక్షల మంది విదేశీయులు వచ్చారు. ఈ ప్రాంతంలో వడ్డించే రోటి వంటకాన్ని ఇష్టంగా తిన్నారు.
మధ్యప్రదేశ్
దేశంలో విస్తారమైన అడవులకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి. ఖజురహో దేవాలయాలు ఈ రాష్ట్రానికి ప్రధాన ఆకర్షణ. వీటిని సందర్శించేందుకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. గత ఏడాది రెండు లక్షల మంది విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చారు.
