Chandrababu: చంద్రబాబు జైల్లో ఉన్న ఈ 52 రోజులు ఎన్ ఎస్ జి కమాండోలు ఎక్కడున్నారంటే?
చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలంగా పాలించారు. అటు 14 ఏళ్ల పాటు విపక్షనేతగా సైతం ఉన్నారు. ఒకసారి ఆయనపై నక్సలైట్లు దాడి చేశారు. మావోయిస్టుల హిట్ లిస్టులో సైతం ఉన్నారు.

Chandrababu: స్కిల్స్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ లభించింది. ఆయన జైలు నుంచి కాలు బయట పెట్టిన మరుక్షణం ఆయనకున్న జెడ్ ప్లస్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనుసరించారు. రక్షణ వలయం మధ్య చంద్రబాబును బయటకు తెచ్చారు. ప్రధానంగా ఈ దృశ్యాలనే టిడిపి సోషల్ మీడియా వైరల్ చేసింది.12+12 సెక్యూరిటీ గార్డ్స్ నడుమ చంద్రబాబు నడిచి వస్తున్న స్టిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ తరుణంలోనే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పై రకరకాల చర్చలు సాగాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత.. 52 రోజులు పాటు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తరుణంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడ ఉన్నారు అన్నదే ఇప్పుడు ప్రశ్న.
చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలంగా పాలించారు. అటు 14 ఏళ్ల పాటు విపక్షనేతగా సైతం ఉన్నారు. ఒకసారి ఆయనపై నక్సలైట్లు దాడి చేశారు. మావోయిస్టుల హిట్ లిస్టులో సైతం ఉన్నారు. ఇటువంటి తరుణంలోనే జెడ్ ప్లస్ కేటగిరి తో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రత కల్పిస్తున్నారు. ఏపీలో మారిన పరిస్థితుల నేపథ్యంలో కొద్ది నెలల కిందటే ఆయన సెక్యూరిటీని పెంచారు. 6 +6 నుంచి..12+12 పెంచుతూ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆ మధ్యన అలిపిరిలో చంద్రబాబు పర్యటనలో జరిగిన అపశృతుల దృష్ట్యా ఆయన సెక్యూరిటీని ఎన్ ఎస్ జి పెంచింది. మనదేశంలో కొద్దిమంది నేతలకు మాత్రమే జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉంటుంది. అందులో చంద్రబాబు ఉండడం విశేషం.
అయితే స్కిల్స్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా గడిపారు. అయితే ఎప్పుడైతే రిమాండ్ విధించారో జైలు అధికారులకు చంద్రబాబును అప్పగించి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కనిపించకుండా పోయారు. బెయిల్ మంజూరైన గంటల వ్యవధిలోనే వాహనశ్రేణి తో రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో వారు ఇన్ని రోజులు ఎక్కడ గడిపారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే వారంతా రాజమండ్రి నగరంలోనే ఉన్నారని తెలియడం విస్తుగొల్పుతోంది. తొలుత ఒక నెల రోజులపాటు ఓ హోటల్లో గడిపారని.. అనంతరం ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉన్నారని తెలుస్తోంది.
సహజంగా సెక్యూరిటీ గార్డ్స్ షిఫ్టులవారీగా డ్యూటీ చేస్తారు. వీరికి భోజన వసతి తెలుగుదేశం పార్టీయే కల్పిస్తూ వచ్చింది. అయితే రాజమండ్రిలో ఉన్నంతకాలం ఎవరు వసతి, భోజనం కల్పించారో మాత్రం తెలియడం లేదు. అయితే దాదాపు 52 రోజులు పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రాజమండ్రిలోనే గడపడం మాత్రం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబుకు మెయిల్ వచ్చిన మరుక్షణం భారీ వాహనశ్రేణితో వారంతా జైలు ప్రాంగణానికి చేరుకోవడం విశేషం. ఇలా చేరుకునే క్రమంలో వారికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
