TDP: ఏపీలో అసలు టీడీపీ పరిస్థితి ఎలా ఉంది?
గతంలో జగన్కు ఎదురైన పరిణామాలే చంద్రబాబుకు ఎదురయ్యాయి. అప్పట్లో జగన్కు మద్దతుగా కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా ఆ ముగ్గురు జనాల్లోకి వస్తారని చెబుతున్నారు.

TDP: తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. ఆయనకు రిమాండ్ విధించి దాదాపు 15 రోజులు అవుతోంది. అటు పాత కేసులు సైతం వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి. అటు కోర్టుల్లో సైతం చంద్రబాబుకు చుక్కెదురు కావడంతో పార్టీ శ్రేణులు తల్లడిల్లి పోతున్నాయి. ఇప్పుడు ఒకే ఒక్క సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్. తీర్పు అనుకూలంగా వస్తే హ్యాపీనే. లేకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పవు. అవినీతి కేసు కావడంతో కనీసం 90 రోజులు పాటు రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఎవరు అవునన్నా.. కాదన్నా తెలుగుదేశం పార్టీకి కర్త,కర్మ,క్రియ చంద్రబాబే. ఇన్నాళ్లు ఏం జరిగినా చంద్రబాబు చూసుకుంటారులే అన్న మాటలు తెలుగుదేశం పార్టీలో వినిపించాయి. కానీ ఇప్పుడు అధినేతే జైలులో రోజుల తరబడి ఉండడంతో టీడీపీ శ్రేణుల్లో స్థైర్యం దెబ్బతింటోంది. మరోవైపు లోకేష్ ను సైతం జైల్లో పెడతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరింత కృంగిపోవడం ఖాయం. ఈ తరుణంలోనే తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ప్లాన్ బి ని అమలు చేయనున్నట్లు సమాచారం.బాలకృష్ణ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి సేవలను వినియోగించుకోవాలని గట్టిగా డిసైడ్ అయినట్లు సమాచారం.
గతంలో జగన్కు ఎదురైన పరిణామాలే చంద్రబాబుకు ఎదురయ్యాయి. అప్పట్లో జగన్కు మద్దతుగా కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా ఆ ముగ్గురు జనాల్లోకి వస్తారని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజల్లో ఎండగట్టడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. జనాల్లో చంద్రబాబుపై సానుభూతిని పెంచడంతోపాటు టిడిపిని కూడా బలోపేతం చేయడం పై ఆ ముగ్గురు ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ దూకుడు పెంచనున్నట్లు సమాచారం.
చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అటు తెలంగాణ నుంచి సైతం మద్దతు వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉండే చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో కుటుంబ సభ్యులు రంగంలోకి దిగితే సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషణలు సైతం వెలువడుతున్నాయి. సోమవారం సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో అనుకూల తీర్పు వస్తుందని టిడిపి నాయకత్వం భావిస్తోంది. ఒకవేళ కానీ ప్రతికూల ఫలితం వస్తే.. యాక్షన్ బి అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
