Five Eyes Alliance Countries: ట్రూడో ఆరోపణల వెనుక ఆ “ఐదు కళ్ళు”.. అందుకే ఎగిరెగిరి పడుతున్నాడు

సిక్కు వేర్పాటువాది హర్‌దీప్ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో ‘ఫైవ్‌ ఐస్‌’ నిఘా వ్యవస్థ ఇచ్చిన ఆధారాలతోనే కెనడా ప్రధాని ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేశారని తాజాగా వెల్లడైంది.

  • Written By: Bhaskar
  • Published On:
Five Eyes Alliance Countries: ట్రూడో ఆరోపణల వెనుక ఆ “ఐదు కళ్ళు”..  అందుకే ఎగిరెగిరి పడుతున్నాడు

Five Eyes Alliance Countries: భారత్ పై కెనడా ప్రధానమంత్రి ఎందుకు ఆ స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు? తన దేశంలో జరిగిన హత్యకు భారతదేశంతో ఎందుకు ముడి పెడుతున్నారు? వేర్పాటువాద ఉద్యమాలను నడిపిస్తున్న వ్యక్తులకు తన దేశంలో ఆశ్రయమిస్తూ.. మన దేశం మీద ఎందుకు లేనిపోని అబాండాలు వేస్తున్నారు? పైగా జీ_20 లాంటి ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించినప్పుడు ఎందుకు తన అక్కసును వెళ్లగక్కెందుకు ప్రయత్నించారు.. అయితే ఇన్ని ప్రశ్నలకు లభిస్తున్న ఒకే ఒక సమాధానం ట్రూడో వెనక ఉన్న ఆ “ఐదు కళ్ళు”!

సిక్కు వేర్పాటువాది హర్‌దీప్ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో ‘ఫైవ్‌ ఐస్‌’ నిఘా వ్యవస్థ ఇచ్చిన ఆధారాలతోనే కెనడా ప్రధాని ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేశారని తాజాగా వెల్లడైంది. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటానికి ఫైవ్‌ ఐస్‌ (ఐదు కళ్లు అనే అర్థంలో) అనే కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. నిజ్జర్‌ హత్యపై దర్యాప్తులో ప్రభుత్వానికి అనేక సాక్ష్యాధారాలు లభించాయని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ కెనడా వార్తాసంస్థ సీబీసీ న్యూస్‌ ప్రకటించింది. ఫైవ్‌ఐస్‌ కూటమికి చెందిన ఓ దేశం ఇచ్చిన సాక్ష్యాధారాలు కూడా వీటిలో ఉన్నాయని తెలిపింది. అయితే, ఆ దేశం పేరును సీబీసీ వెల్లడించలేదు. ‘ఈ సాక్ష్యాధారాల్లో భారతీయ అధికారులు, కెనడాలో ఉన్న భారతీయ దౌత్యాధికారుల పాత్రకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. నిజ్జర్‌ హత్యపై దర్యాప్తునకు భారత్‌ సహకారాన్ని కోరుతూ కెనడా అధికారులు పలుమార్లు ఆ దేశానికి వెళ్లారు. కెనడా జాతీయ భద్రతా, నిఘా సలహాదారు జోడీ థామస్‌ ఆగస్టులో నాలుగు రోజులు, సెప్టెంబరులో ఐదు రోజులు భారత్‌లో ఉన్నారు. నిజ్జర్‌ హత్యలో భారత్‌ పాత్ర ఉందన్న విషయాన్ని అంతర్గత సమావేశాల్లో భారత అధికారులు ఎవరూ కూడా నిరాకరించలేదు’ అని సీబీసీ పేర్కొంది.

మరోవైపు, ఐరాస సర్వసభ్యసమావేశాల్లో పాల్గొనటానికి అమెరికాకు వెళ్లిన ట్రూడో భారత్‌తో వివాదంపై స్పందిస్తూ, ఆ దేశానికి వ్యతిరేకంగా ప్రతీకార చర్యలు చేపట్టాలని తమకేమీ లేదని, నిజ్జర్‌ హత్య కేసులో నిజాలు బయటపడటానికి సహకరించాలని కోరుతున్నామని తెలిపారు. మరోవైపు, కెనడాలో ఉన్న హిందువులు దేశం విడిచివెళ్లిపోవాలని బెదిరిస్తూ ఆన్‌లైన్‌లో వైరల్‌ అయిన ఓ వీడియోపై ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విద్వేషానికి కెనడాలో చోటులేదని హెచ్చరించింది. మరో వైపు
కెనడా-భారత్‌ వివాదం ప్రభావం విమాన టికెట్ల ధరలపై తీవ్రంగా పడుతోంది. పరిస్థితులు విషమిస్తున్న దృష్ట్యా.. పలువురు తమ ప్రయాణాల్ని ముందుకు జరుపుకొని, చివరి నిమిషంలో టికెట్లు కొనుగోలు చేస్తుండటంతో ధరలు దాదాపు 25 శాతం పెరిగాయని ట్రావెల్‌ పోర్టల్‌లు చెబుతున్నాయి. మరోవైపు, భారతీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రాకు 11 శాతం వాటా ఉన్న కెనడా కంపెనీ రెసెన్‌ ఏరోస్పేస్‌ మూతబడింది. కంపెనీని మూసివేయటానికి రెసెన్‌ స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుందని, ఈ మేరకు ప్రభుత్వం అనుమతించిందని తెలిసింది.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube