EL Nino Effect: ఏమిటీ ఈ ఏల్నినో?: ప్రపంచం ఎందుకు భయపడుతోంది?
వాస్తవానికి సముద్రాలపై ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. భూభాగం పై వాతావరణాన్ని అవి తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి.

EL Nino Effect: ఉదయం ఏడు గంటలకు బయటికి వెళ్తే నెత్తి భగ్గుమంటోంది. సాయంత్రం అయినప్పటికీ వేడి తగ్గడం లేదు. మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పటికైతే ఎండ చుక్కలు చూపిస్తోంది.. అయితే సాధారణంగా ఎండాకాలంలో ఎండలు అనేవి తీవ్రంగా ఉంటాయి. మహా అయితే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉంటాయి. కానీ ఏకంగా 46 డిగ్రీలకు మించిపోతే దాన్ని ఏమనాలి? రోజుకు పదుల సంఖ్యలో వడదెబ్బ మృతులు పతాక శీర్షికలుగా వార్తలు కావడాన్ని ఏ విధమైన విషయంగా చెప్పుకోవాలి? అయితే ఈ ఎండలు ఓ పది రోజులో నెలలోనో ఉండవట! వచ్చే ఐదు సంవత్సరాలు భూగోళం ఇలా నిప్పుల కొలిమిలాగా మండుతూనే ఉంటుందట. ఇది చెప్పింది ఎవరో కాదు.. సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి.
46 డిగ్రీలకు మించి
గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు మించి పోతున్నాయి. మొన్నటికి మొన్న భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం లో ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు మించి రికార్డు అయింది. అయితే ఈ అసాధారణ వేడుక రెండు కారణాలు ఉన్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఒకటి గ్లోబల్ వార్మింగ్. మరొకటి ఎల్ నినో.. వాస్తవానికి ఇవి రెండు కొత్తవి కాకపోయినప్పటికీ.. ఇప్పుడు చూపిస్తున్న అనుకోని పరిణామాలు పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం భారత దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందనే అధ్యయనాలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఏమిటి ఈ ఎల్ నినో
వాస్తవానికి సముద్రాలపై ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. భూభాగం పై వాతావరణాన్ని అవి తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. భూగోళంపై భారీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు భూభాగాలపై ఉష్ణోగ్రతలను, వర్షపాతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. పసిఫిక్ సముద్రంలో భూమధ్యరేఖ వెంబడి స్థిరంగా వీచే పవనాలను వ్యాపార పవనాలు అని పిలుస్తుంటారు. పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పుడు పసిఫిక్ సముద్రంలో భూమధ్యరేఖ వెంబడి ఈ వ్యాపార పవనాలు ఉత్తరార్థ గోళంలో ఈశాన్యం నుంచి నైరుతి వైపు, దక్షిణార్థ గోళంలో నైరుతి నుంచి ఈశాన్య వైపు వీస్తూ ఉంటాయి. ఆసియా ప్రాంతంలోని సముద్ర జలాల్లోకి వేడి నీటిని తీసుకొచ్చేది, మన దేశంలోకి జూన్లో నైరుతి దిశ నుంచి ప్రవేశించే రుతుపవనాలు ఇవే. అయితే కొన్నిసార్లు పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే పెరిగిపోతాయి. ఈ పరిస్థితినే ఎల్ నినో పిలుస్తూ ఉంటారు. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు వేడి నీరు పశ్చిమానికి, చల్లని నీరు తూర్పు వైపు కదులుతాయి. ఈ ప్రభావంతో వ్యాపార పవనాలు బలహీనపడతాయి. దీంతో భారత్ లోకి నైరుతి రుతుపవనాల రూపంలో వచ్చే ఈ పవనాలు తక్కువ వర్షపాతాన్ని ఇస్తాయి. వర్షపాతం తగ్గిపోవడంతో భూభాగం పై కరువు పరిస్థితులు ఏర్పడి, ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
తక్కువ ఉపరితల ఉష్ణోగ్రతలు నమోదైతే
ఇలా కాకుండా పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ కంటే తక్కువగా నమోదైతే దానిని లానినో అంటారు. ఈ పరిస్థితులతో వ్యాపార పవనాలు మరింత బలపడతాయి. అవి ఈశాన్యం వైపు కదిలి భారత దేశంలో నైరుతి రుతుపవనాలు రూపంలో ప్రవేశించి భారీ వర్షపాతాన్ని ఇస్తాయి. గత మూడు సంవత్సరాలుగా పసిఫిక్ మహాసముద్రం పై లానినో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ లానినో గత ఏడాది సెప్టెంబర్ తో పూర్తయిపోయింది. ఇప్పుడు ఎల్ నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో వచ్చే నెలలో భారత్ లోకి ప్రవేశించే నైరుతి పవనాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం ఉన్నట్టు అని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం 2027 వరకు కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. దీనివల్ల భారత్ లాంటి పలు దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరిస్తోంది. ఇక ఉష్ణోగ్రతలు సాధారణ కంటే అధికంగా నమోదవుతాయని చెబుతోంది.
గ్లోబల్ వార్మింగ్
ఇక ఎల్ నినో కు గ్లోబల్ వార్మింగ్ తోడు కావడంతో వాతావరణంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 1850_1900 మధ్యకాలంతో పోలిస్తే దాదాపు రెండు డిగ్రీల చంటిగాడు ఉష్ణోగ్రతలు పెరిగినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ధ్రువాల వద్ద మంచు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు తీవ్రమైన ఎండ, వడగాలులు పెరిగిపోతున్నాయి. భవిష్యత్తులో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు 2015లో పారిస్ పేరుతో ప్రపంచ దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిని అమలు చేయడంలో మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆ ఫలితాన్ని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అనుభవిస్తున్నారు.
