TDP Mahanadu : మహానాడులో ఈసారి ఏం జరుగనుంది? ఏజెండా ఇదీ

మహానాడు వేడుకలను చంద్రబాబు ప్రారంభించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. టీడీపీ శ్రేణులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

  • Written By: Dharma Raj
  • Published On:
TDP Mahanadu : మహానాడులో ఈసారి ఏం జరుగనుంది? ఏజెండా ఇదీ

TDP Mahanadu: గోదావరి తీరంలో తెలుగుదేశం పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. రాజమండ్రిలో పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో శ్రేణులకు దిశ నిర్దేశం చేసేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమైంది. మహానాడు వేదికగా ఎన్నికల శంఖారావం పూరించింది. తొలిరోజు శనివారం నాటి సమావేశాల్లో భాగంగా ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభ జరుగుతాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శత జయంతి సంవత్సరం కావడం ఈసారి మహానాడుకు అదనపు ఆకర్షణ. ప్రధానంగా వైసీపీ సంక్షేమ పథకాలకు దీటుగా టీడీపీ మేనిఫెస్టో ఉంటుందని సంకేతాలిచ్చే అవకాశముంది. చంద్రబాబు సైతం సమావేశాల్లో కీలక ప్రసంగం చేయనున్నారు.

మహానాడు వేడుకలను చంద్రబాబు ప్రారంభించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. టీడీపీ శ్రేణులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈసారి రాజమండ్రిలో మహానాడు నిర్వహణ వెనుక సెంటిమెంట్ ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా 1993లో ఎన్టీఆర్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగర్జన సభకు కనీవినీ ఎరుగని రీతిలో జనంలో వచ్చారు. ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అపూర్వ విజయం సాధించింది. అదే సెంట్‌మెంట్‌తో ఇప్పుడిక్క మహానాడు నిర్వహిస్తున్నారు.

మహానాడు వేదిక ప్రాంగణంలోనే నిన్న పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపారు. మొత్తం 21 తీర్మానాలను మహానాడులో చర్చకు ప్రతిపాదించనున్నారు. వీటిలో 14 ఆంధ్రప్రదేశ్‌కు, ఆరు తెలంగాణకు సంబంధించినవి. ఆంధ్ర తీర్మానాల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి సంక్షోభం, విపరీతంగా పెరిగిపోయిన అవినీతి, పథకాల పేరిట ప్రచారార్భాటం వంటివాటిపై మహానాడు ప్రధానంగా దాడి చేయనుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలు, పేదరికం నిర్మూలనకు తీసుకున్న చర్యలు, ఆ సమయంలో రాష్ట్రాభివృద్ధిని కూడా నేతలు వివరిస్తారు. ఈ మధ్య కాలంలో మరణించిన పార్టీ నేతలకు సంతాప తీర్మానం, పార్టీ జమా ఖర్చుల నివేదిక, ప్రధాన కార్యదర్శి నివేదిక వంటి అజెండా ఉంటుంది.

రాజకీయ తీర్మానాలకు సంబంధించి కేవలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీనే టీడీపీ టార్గెట్ చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి నడవాలనుకుంటున్న తరుణంలో ఆ పార్టీ ప్రస్తావన లేదు. ఇక పొత్తులకు తమ పార్టీ సుముఖంగా ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో మహానాడు వేదికగా టీడీపీ కూడా అటువంటి సంకేతాన్నే ఇచ్చే అవకాశం ఉంది. అయితే నేరుగా ప్రకటిస్తారా? లేక భావసారుప్యత పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని చెబుతారా? అన్నది చూడాల్సి ఉంది.

సంబంధిత వార్తలు