
Uttarandhra- BJP
Uttarandhra- BJP: భారతీయ జనతా పార్టీ.. అశేష భారతావనిని ఏలుతూ ప్రబలమైన రాజకీయ శక్తిగా మారింది. కానీ ఏపీలో మాత్రం ఎందుకూ కొరకరాని కొయ్యగా మిగులుతోంది. దీనికి కారణం ముమ్మాటికీ బీజేపీయే. దేశంలో తనకు తానుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ ఏపీలో మాత్రం ప్రాంతీయ పార్టీలు, సామంత పార్టీలపై ఆధారపడుతుండడం సగటు కాషాయ పార్టీ అభిమానికి నైరాశ్యంలోకి నెట్టేస్తోంది. కేంద్రంలో పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్న బీజేపీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రాంతీయ పార్టీలతో ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేయడం లేదన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. అప్పుడెప్పుడో దశాబ్దాల కిందట విశాఖ గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ను సొంత బలంతో కైవసం చేసుకున్న పార్టీ.. ప్రస్తుతం ఓ కార్పొరేటర్ స్థానాన్ని గెలుచుకునేందుకు ముప్పు తిప్పలు పడడానికి కారణం ఏమిటని విశ్లేషించలేకపోతోంది. అసలు ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి పాత్రదారులు, సూత్రధారులు ఎవరు అని గుర్తించకపోవడాన్ని ఏమనాలి?
ఈవీఎంలు అయితే నోటా.. బ్యాలెట్ అయితే చెల్లని ఓట్లతో బీజేపీ పోటీ పడుతోంది. కానీ ఎక్కడా వాటిని మించి ఓట్లు దక్కించుకుటున్న దాఖలాలు లేవు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. కనీస ప్రభావం చూపించలేకపోయింది. కనీసం చెల్లని ఓట్లకు కూడా అధిగమించలేకపోయింది. బీజేపీ నేతలు ఎప్పుడో నేల విడిచి సాము చేయడం అలవాటు చేసుకున్నారు. ఉంటే అధికార పార్టీతో అంటగాకడం, లేకుంటే విపక్షాల నెత్తిన పాలుపోయడానికి ప్రయత్నించడం.. ఈ రెండు తెలిసినంతగా పార్టీని అభివృద్ధి చేయాలని తలపోయడం అంటూ ఏదీ లేదు. ఒకటి మాత్రం నిజం ఏపీ బీజేపీ నేతలు పార్టీని అభివృద్ధి చేద్దామన్న యావ కంటే.. తమకు ఇష్టమైన పార్టీలకు లబ్ధి చేకూర్చడానికే ఎక్కువ పాకులాడుతారు. ఏపీ బీజేపీ అని గుర్తుకుతెస్తే ఒక రెండు డజన్ల మంది రాష్ట్రాస్థాయి నాయకులు కనిపిస్తారు. కానీ పార్టీని బతికించాలని చిత్తశుద్ధితో కృషిచేసేది మాత్రం ఒకరిద్దరు మాత్రమే ఉంటారు.

Uttarandhra- BJP
పూర్వాశ్రమంలో పనిచేసే పార్టీకి కొందరు.. అధికార పార్టీకి దాసోహమయ్యేది మరికొందరు. మధ్యలో నిజమైన కాషాయదళం ఉంటుంది. వారి వేదన అరణ్యరోదనగా మిగులుతుందే తప్ప పట్టించుకునేవారు ఉండరు. తమ సొంత అభివృద్ధికి పార్టీని వాడుకుంటున్నవారు అధికార, విపక్షాలకు అండదండగా ఉండటం తప్ప.. తమ సొంత పార్టీని ముందుకు తీసుకెళదామని ఆలోచించే నాయకులు కేవలం కొద్ది మంది మాత్రమే. చివరికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయని జనసేన మద్దతును కూడా వారు అడగలేదు. పవన్ తో ఓ ప్రకటన కూడా చేయించుకోలేకపోయారు. కానీ.. మాట్లాడితే.. తమదే ఏపీలో అధికారమని.. ప్రాంతీయ పార్టీలు లేవని ఉదరగొడుతూంటారు. రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని వేదాలు వల్లిస్తుంటారు.

Uttarandhra- BJP
ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి పోటీచేసిన పీవీఎన్ మాధవ్ నే తీసుకుందాం. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ. రెండోసారి బరిలో దిగారు. విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. కానీ చెల్లని ఓట్లనుకూడా దాటలేకపోయారు. పన్నెండు వేలకుపైగా చెల్లని ఓట్లు వస్తే.. మాధవ్ పదకొండు వేల ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. ఇక రాయలసీమ జిల్లాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ చెల్లని ఓట్లలో సగం కూడా బీజేపీ తెచ్చుకోలేకపోయింది. తూర్పు రాయలసీమలో పదిహేడు వేల వరకూ చెల్లని ఓట్లు వచ్చాయి. బీజేపీకి వచ్చిన ఓట్ల సంఖ్య ఆరు వేల కంటే తక్కువే. పశ్చిమ రాయలసీమలోనూ అదే పరిస్థితి. అక్కడ బీజేపీకి ఐదు వేల ఓట్లకు మించి రాలేదు. కానీ చెల్లని ఓట్లు పన్నెండు వేలకుపైగానే ఉన్నాయి. దీనికి కారణం ఎవరంటే మాత్రం ముమ్మాటికీ ఎన్నికల తరువాత పార్టీలో చేరిన నాయకులే. ఇక్కడ బీజేపీ ఓటమి కంటే టీడీపీ గెలుపుబాటకు కారణం కూడా ఈ నాయకులే. కాషాయదళంలో ఉండి పసుపుదళానికి గూడాచార్యం చేసేది కూడా వీరే. అటువంటి నాయకులను పట్టుకుంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టే. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవ్ కూడా చేసింది ఇదే.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాధవ్ పోటీ చేశాడు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా ఈయన. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో మాధవ్ ఈజీగా గెలిచాడు. ఈసారి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. ఈ పరిస్థితికి అతడి వైఖరే కారణం. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సోమువీర్రాజుతోపాటు మాధవ్ కూడా పోటీపడ్డాడు. అప్పట్లో తెరవెనుక సుజనా చౌదరి, సీఎం రమేశ్ సహా టీడీపీ బ్యాచ్ మాధవ్ కు సహకరించారు. కానీ అధ్యక్ష స్థానం మాధవ్ కు రాలేదు. అధిష్టానం సోమువీర్రాజుకు వచ్చింది. కానీ ఇప్పుడు అదేది మనసులో పెట్టుకోకుండా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా మాధవ్ గెలవడానికి ఉత్తరాంధ్రకు వచ్చి మరీ ప్రచారం చేశాడు. సోమువీర్రాజు ఎంతో పాటు పడ్డాడు. కానీ సుజనా చౌదరి, సీఎం రమేశ్ లాంటి వారు మాధవ్ తరుఫున ప్రచారం చేయడానికి, అండగా నిలవడానికి ఎవరూ రాలేదు. మాధవ్ వెంట సోము వీర్రాజు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓడి డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు. దీనంతటికి కారణం మాధవ్ నే కారణం. ఆయన వ్యవహారశైలినే ప్రధాన లోపం. ఈ ఓటమిని సోమువీర్రాజుపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఓటమిని అడ్డంపెట్టుకొని సోము వీర్రాజులాంటి వారిని పక్కకు తప్పించాలన్న వ్యూహానికి మాధవ్ లాంటి వారు సాయం చేయడాన్ని ఏమనాలి? తన విజయానికి అహోరాత్రులు శ్రమించిన వీర్రాజుకు వ్యతిరేకంగా పావులు కదపడాన్ని ఏమనాలి? అయితే సుజాన చౌదరి లాంటి వారి చర్యలను ప్రోత్సహిస్తున్న హైకమాండ్ లోని ఒక వర్గం నేతల వైఖరిని ఏమని వర్ణించాలి? ఇలా ఎలా తీసుకున్నాబీజేపీ ఈ పరిస్థితి బీజేపీయే కారణమన్నది ముమ్మాటికీ వాస్తవం.