IND v PAK : పాక్ పై వీరవిహారం: సచిన్ రికార్డు కొల్లగొట్టిన కోహ్లీ..
సచిన్ టెండూల్కర్ 13 వేల పరుగుల మైలురాయిని చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అందుకోగా, విరాట్ కూడా తన 13 వేల పరుగుల మైలురాయిని పాకిస్థాన్‌పైనే చేయడం విశేషం.

IND v PAK : తనదైన రోజున కోహ్లీని ఎవరూ ఆపలేరు. బౌలర్ ఎవరైనా సరే బంతి స్టాండ్‌లోకి వెళ్లాల్సిందే. ఎంతటి పదునైన బంతులు వేసినా పరుగులు రావాల్సిందే. కొంతకాలంగా ఆకలిగొన్న చిరుతలాగా ఉన్న కోహ్లీ.. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. ఆసియా కప్‌లో భాగంగా అతడికి అసలైన ప్రత్యర్థి దొరికింది. ఇంకేముంది పరుగుల వరద పారింది. ఈ దెబ్బకు క్రికెట్ గాడ్ సచిన్ రికార్డు కనుమరుగయింది.
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో విరాట్ తన బ్యాట్‌తో శివతాండవం చేశాడు. వన్డేల్లో 13 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 267 ఇన్నింగ్స్‌లలో అతడు ఈ ఫీట్ సాధించాడు. దీంతో సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు. ఆదివారం తమ టీమ్‌ను వర్షం కాపాడిందన్న షోయబ్ అక్తర్ మాటలను నిజం చేసేలా కోహ్లీ బ్యాటింగ్ చేశాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి రికార్డు స్థాయిలో భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇద్దరూ సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లనూ తన విరోచిత బ్యాటింగ్‌తో విరాట్ 13 వేల పరుగులు పూర్తి చేశాడు. ఇందుకు 267 ఇన్నింగ్స్ అతడికి అవసరం పడ్డాయి. సచిన్ 321 ఇన్నింగ్స్‌లలో 13 వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికి పాంటింగ్ ఉన్నాడు. అతడు 341 ఇన్నింగ్స్‌లలో 13 వేల రన్స్ పూర్తి చేశాడు.
కాగా సచిన్ టెండూల్కర్ 13 వేల పరుగుల మైలురాయిని చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అందుకోగా, విరాట్ కూడా తన 13 వేల పరుగుల మైలురాయిని పాకిస్థాన్‌పైనే చేయడం విశేషం. సచిన్ పాకిస్థాన్‌లో పాకిస్థాన్‌పై ఈ రికార్డు సాధించాడు. కోహ్లీ మాత్రం శ్రీలంకలో పాకిస్థాన్‌పై ఈ రికార్డు సాధించాడు. మొత్తానికి చిరకాల ప్రత్యర్థిపై విరాట్ ఈ ఫీట్ సాధించడంతో ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఆఫ్రీది వేసిన 48వ ఓటర్‌లో విరాట్ క్విక్ డబుల్ తీసి వన్డేల్లో 13 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఆ వెంటనే మరో సింగిల్ తీసి, వన్డేల్లో మరో శతకం సాధించాడు. ఇది కోహ్లీకి వన్డేల్లో 47వ సెంచరీ. కాగా, కోహ్లీ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.
