Uma Maheshwari Committed Suicide: పోయింది ఓ పెద్ద ప్రాణం.. నాలుగు గోడల మధ్యన జరిగిన వివాదం అది.. ఆ నలుగురికి తప్ప బయట వాళ్లకు తెలిసే ఛాన్స్ యే లేదు. ఆ కుటుంబ సభ్యులు ఎవరూ నోరు మెదపడం లేదు. బయటివాళ్లు మాత్రం రకరకాలుగా అనుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అందరూ అభిమానించే ‘నందమూరి ఫ్యామిలీ’లో చోటుచేసుకున్న సంక్షోభం అదీ.. ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత, మాజీ సీఎం చంద్రబాబుకు దగ్గరి బంధుత్వం గల కుటుంబమది. సహజంగానే దానికి రాజకీయ రంగు పులిమేస్తారు. ఇలాంటి విషయాల్లో చంద్రబాబును లాగి రాజకీయం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇది నిజమో కాదో ఎవరికీ తెలియదు.. కేవలం ప్రత్యర్థి వర్గాలు చంద్రబాబును ఈ ‘ఉమామహేశ్వరి ఆత్మహత్య’ వ్యవహారంలోకి లాగి చేస్తున్న రాజకీయంలో ఆయన అభాసుపాలవుతున్నారు.
రాజకీయాల్లో చీమ చిటుక్కుమన్నా కూడా దాన్ని ప్రత్యర్థులకు అంటగట్టి రొచ్చు రాజకీయం చేయడంలో పార్టీలు ఆరితేరిపోయాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబంలో ‘ఉమామహేశ్వరి ఆత్మహత్య’ వ్యవహారాన్ని అలాగే వాడుకుంటున్నాయి. ఆమె మరణానికి అనారోగ్య కారణాలు, మానసిక ఒత్తిడియే కారణమని ఆమె కూతురు పోలీసులకు అధికారికంగా తెలిపింది. కానీ ఆర్థికంగా, సామాజికంగా అంత ఉన్నత స్థితిలో ఉన్న ఆమె ఆత్మహత్య వెనుక ఇంకా ఏదో కారణం ఉందన్న గుసగుసలు ఉన్నాయి. అందుకే ఎవరికి తగ్గట్టుగా వారు అన్వయించుకొని కథనాలు అల్లేస్తున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు, టీడీపీ వ్యతిరేక పార్టీలు, వారి గ్రూపుల్లో ఓ కథనం మాత్రం వైరల్ అవుతోంది. చంద్రబాబు మోసం చేశాడని.. కోట్లు ఎగ్గొట్టాడని.. తిట్టి పంపించాడని.. అందుకే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుందన్న ప్రచారం మొదలైంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. ప్రత్యర్థులు మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఆస్తుల్లో పెట్టుబడి పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుందన్నట్టు ఫోకస్ చేస్తున్నారు.
ఆ వాట్సాప్ వైరల్ పోస్టులో ఏముందుంటే… ‘‘మొదటి భర్త నరేంద్ర రాజన్ సైకో చేష్టలకు విసిగిపోయిన ఉమా మహేశ్వరి అతనితో విడాకులు తీసుకున్న అనంతరం, అమెరికాలో స్థిరపడిన కంఠమనేని శ్రీనివాస్ ని ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంది. . అయితే ఇక్కడ నుండే అసలు కష్టాలు మొదలువ్వడం గమనార్హం.. ఆర్ధికంగా బలంగా ఉన్న కంఠమనేని వారి నుండి హెరిటేజ్ లో పెట్టుబడులు పెట్టాలని అక్క భువనేశ్వరితో రాయబారాలు నడిపి, కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశగా చూపి బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం దాదాపు 500 కోట్ల రూపాయలు చంద్రబాబు హెరిటేజ్ లో పెట్టుబడిగా పెట్టించాడని సమాచారం.. కానీ ఆ మొత్తానికి చెందిన షేర్ల బదలాయింపు ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన సమయానికి, చేయకపోగా, అడిగిన ప్రతిసారీ ఆటబొమ్మని చేసి ఆడుకోవడం బాధాకరం.. అయితే తర్వాత అవే షేర్స్ ని ఫ్యూచర్ గ్రూప్ కి అమ్మేసి, మంచి రేటు రావడంతో అమ్మకతప్పలేదు. మీకు అదనంగా రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ సమీపంలో జయభేరి లో మార్కెట్ రేట్ 20 కోట్లు విలువ చేసే 50 ఎకరాల ల్యాండ్ మీకు 10 కోట్లకే ఇస్తామంటూ మభ్యపెట్టి మోసం చేస్తూ రావడంతో విసిగిపోయిన ఉమా మహేశ్వరి, తప్పనిసరి పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం చంద్రబాబు ఇంటికి వెళ్ళి గట్టిగా అడిగిందని సమాచారం.. అయితే ఈ వాదనలో మాటా మాటా పెరిగి, సహనం కోల్పోయిన చంద్రబాబు, లోకేష్ లు దుర్భాషలాడడమే కాకుండా ఆమెపై దాడికి కూడా దిగారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తన కష్టాన్ని తిరిగి ఇవ్వాలని అడగడానికి వెళ్లిన ఆడబిడ్డని అన్యాయంగా మాటలతో వేధించడంతో ఉమా మహేశ్వరి తీవ్ర మనస్తాపానికి గురైందని, ఇది ఇలా ఉంటే నిన్న ఎవరో నారా కుటుంబ సభ్యులు ఆమెను కలవడానికి వచ్చారని, అంతలోనే ఇలా జరగడం చాలా విడ్డూరంగా ఉందని, ఆమె నిజంగా అనారోగ్యంతోనే ఉరేసుకుంటే మెడపై రెండు గాట్లు ఎలా వస్తాయని చుట్టు ప్రక్కల వాళ్ళు చెప్పుకుంటున్నారని భోగట్టా!’’
పైన కథనం చూస్తేనే అందులో కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఉమామహేశ్వరి రెండో పెళ్లి అనేది ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడే రెండో సంబంధం చూసి పెళ్లి చేశాడు. ఉమామహేశ్వరి భర్త అమెరికాలో బాగా సంపాదించాడని.. ఆయన వద్ద రూ 500 కోట్లు ఉన్నాయని.. అవి చంద్రబాబు సంస్థలో పెట్టుబడి పెట్టాడన్నది కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఉమామహేశ్వరి ఫ్యామిలీ వద్ద ఏకంగా 500 కోట్లు ఉన్నాయన్నది నమ్మశక్యంగా లేని విషయం. వారి ఆస్తులు అన్ని లేవని అంటున్నారు. ఇక ఉరివేసుకున్న ఉమామహేశ్వరి మెడపై రెండు గాట్లు ఉన్నాయన్నది కూడా ప్రచారమే. ఆమె ఉరివేసుకున్నది నిజం.. కానీ గాట్లు ఉన్నాయని చుట్టుపక్క వాళ్లు చెప్పుకుంటున్నారన్నది అబద్ధం. ఇక చనిపోవడానికి ముందు నారా కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి ఇంటికి వచ్చారనడానికి ఆధారాలు లేవు.
సో ఉమామహేశ్వరి మరణం చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తోందన్నది వాస్తవం. ఇందులో చంద్రబాబు పాత్ర ఉందా? లేదా? అన్నది స్పష్టంగా తెలియదు. తెలిస్తే బయటపడేదే. ఎందుకంటే పోయింది ఓ ప్రాణం. పైగా ఎన్టీఆర్ కూతురు. చంద్రబాబు కారణమైతే ఎవరో ఒకరు బయటపెట్టేవారు. లేదంటే ఎవరైనా తొక్కిపెట్టవచ్చు. నిజనిజాలు తెలియకుండా ఒక అవగాహనకు రావడం అన్నది కష్టం. ఇప్పటికైతే ఉమామహేశ్వరి మరణం వెనుక అసలు రహస్యాలు మాత్రం బయటపడలేదు. ప్రత్యర్థులు మాత్రం చంద్రబాబుపై రాజకీయంగా దెబ్బతీసేందుకు ఈ కథనాన్ని వండి వర్చారు. నిజానిజాలు తెలియాల్సి ఉంది.