Y. S. Vijayamma: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య ఆమె.. స్వయానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తల్లి. అలాంటి వైఎస్ విజయమ్మ నోట.. ‘ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డితో.. ఆంధ్ర రాష్ట్రంతో మనకేంటమ్మా’ అన్న మాట రావడం చర్చనీయాంశమైంది. ఎంత లేదనుకున్న ఏపీకి కొడుకు సీఎంగా ఉన్నారు. అయినా కూడా విజయమ్మ తల్లి ప్రేమ మొత్తం షర్మిలకే దక్కుతున్నట్టు ఉంది. ఎంతలా అంటే కొడుకు పార్టీ వైసీపీకి గౌరవ అధ్యక్షురాలు కూడా వదులుకునేంతగా.. కూతురు కోసం అమరావతి వదిలి హైదరాబాద్ వచ్చేంతలా.

Y. S. Vijayamma
కొడుకు జగన్ ఏపీకి సీఎం అవ్వడం.. ఆయనను ఆపదలో ఆదుకున్న షర్మిలకు ఏ పదవి ఇవ్వకుండా కాలదన్నడంతో తల్లి (విజయమ్మ) కడుపు తల్లడిల్లింది. అందుకే జగన్ ఇచ్చి వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవిని కూడా త్యజించి కూతురు పోరాటం కోసం హైదరాబాద్ తరలివచ్చింది. వైఎస్ షర్మిల ‘వైఎస్ఆర్ టీపీ’ పార్టీ పెట్టి తెలంగాణలో 3వేల కి.మీల పాదయాత్ర చేస్తోంది. కూతురుకు తోడుగా సభలు, సమావేశాల్లో విజయమ్మ తోడుగా నీడగా అండగా నిలుస్తోంది.
అయితే తాజాగా వైఎస్ షర్మిల ఏకంగా తన పాదయాత్రను అడ్డుకుంటున్నారని ‘ప్రగతి భవన్ ముట్టడి’కి తరలివెళ్లగా ఆమెను అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించారు. హైదరాబాద్ లో నిర్బంధించారు. కూతురు కోసం తల్లి విజయమ్మ రోడ్డెక్కారు. షర్మిలకు తోడుగా పోలీస్ స్టేషన్ బయలు దేరారు. కానీ విజయమ్మను ఆమె ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు. కూతురును కూడా పరామర్శించనీయరా? అంటూ పోలీసుల తీరుకు నిరసనగా విజయమ్మ రోడ్డుపై ఆందోళన చేసింది.

Y. S. Vijayamma
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తీరును తూర్పారపట్టింది. ఇక విలేకరులు పలు ఆసక్తికర ప్రశ్నలు విజయమ్మను అడిగారు. షర్మిలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమె అన్నయ్య అయిన సీఎం జగన్ హైదరాబాద్ రానున్నారా? అని విజయమ్మను మీడియా ప్రశ్నించింది. దానికి అసహనం వ్యక్తం చేసిన విజయమ్మ ‘ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డితో, ఆంధ్ర రాష్ట్రంతో మనకెందుకమ్మా?’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే జగన్ తో విజయమ్మ-షర్మిలకు పంచాయితీ ముగియలేదని.. ఆయన పొడనే గిట్టడం లేదని.. ఈ తల్లి కొడుకుల మధ్య సఖ్యత లేదన్న విజయం మీడియా జర్నలిస్టులకు, అందరికీ తేటతెల్లమైంది. ఏపీకి చెందిన విజయమ్మ కొడుకుతో, ఆ రాష్ట్రంతో సంబంధం లేదనడం చూస్తే వీళ్లు బాగా హర్ట్ అయినట్టే కనిపిస్తోంది.