సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల జయంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఫిబ్రవరి 20న హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలోని విజయ నిర్మల స్వగృహంలో ఉదయం 9గంటలకు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతోపాటు సూపర్ స్టార్ కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
విజయ నిర్మల నటిగానే కాకుండా పలు సినిమాలకు దర్శకత్వం, నిర్మాత బాధ్యతలను నిర్వహించారు. తెలుగు, తమిళం, మళయాళ భాషల్లో 44చిత్రాలను తెరకెక్కించారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం చేసిన మహిళా డైరెక్టర్ గా విజయ నిర్మల గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నారు. నటిగా ఎన్నో అవార్డులను దక్కించుకున్న ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా రాణించారు. సినీ రంగానికి ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.
విజయనిర్మల దురదృష్టవశాత్తు గతేడాది జూన్ 27న గుండెపోటుకు గురయ్యారు. ఆసుప్రతిలో చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించడంతో మృతిచెందిన విషయం తెల్సిందే. దీంతో ఆమె అభిమానులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఈనెల 20న విజయ నిర్మల జయంతి నేపథ్యంలో ఆమె విగ్రహాష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.