Varudu Kaavalenu: ప్రస్తుతం ఉన్న డిజిటల్ విప్లవం లో ఒక సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో వినూత్న ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే, ఎప్పటికప్పుడు మేకర్స్ తమదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో సినిమా పబ్లిసిటీ రకరకాలుగా తయారైంది. ముఖ్యంగా సినిమా కథ ఏమిటి ? అసలు సినిమా ఏ థీమ్ ప్రకారం నడుస్తోంది ? లాంటి విషయాలకు అనుగుణంగా ప్రమోషన్లు చెయ్యడం అలవాటు చేసుకున్నారు.

Varudu Kaavalenu
ఈ వారం రానున్న సినిమాల్లో ‘వరుడు కావలెను’ అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సినిమా పై మంచి బజ్ ఉంది. అయినా, ఓపెనింగ్స్ రావాలి అంటే.. విస్తృతంగా ప్రమోషన్స్ చేయాలి. అందుకే మేకర్స్ కూడా ఆ కోణంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. సినిమా ఎలాగూ పెళ్లి చుట్టూ తిరిగే కథ కాబట్టి.. హీరో నాగ శౌర్య, హీరోయిన్ రీతూ వర్మ హైదరాబాద్ లో జరుగుతున్న కొన్ని పెళ్లి వేడుకలకు హాజరవుతున్నారు.
పిలవని పెళ్ళికి ఈ హీరోహీరోయిన్లు వెళ్లి.. నూతన వధూవరులను సర్ప్రైజ్ చేస్తున్నారు. అయితే, ఒక్కసారిగా సినిమా వాళ్ళను చూసిన జనం పెళ్లి తంతును వదిలేసి.. మొత్తానికి ఫోటోల కోసం హీరోహీరోయిన్ల వెంట పడుతున్నారు. అసలు శుభమా అని పెళ్లి జరుగుతుంటే..మధ్యలో వెళ్లి అక్కడున్న ప్రశాంత వాతావరణాన్ని పాడు చేసే హక్కు ఈ వరుడు కావలెను టీమ్ కి ఎవరిచ్చారు ?
నిజమే.. కోవిడ్ తర్వాతి పరిస్థితుల్లో జనాలను సినిమా థియేటర్లకు రప్పించడం కష్టమే, కావొచ్చు, అంతమాత్రాన చెప్పాపెట్టకుండా పెళ్లి మండపాలకు వెళ్లి.. అక్కడ హడావిడి చేయడం ఎంతవరకు కరెక్ట్ ? అయినా ప్రమోషన్స్ కోసం ఏమైనా చేస్తారా ? ప్రతి సినిమాకి మొదటి వీకెండ్ కలెక్షన్లు బాగా కీలకం అయిపోయాయి కాబట్టి.. ఓపెనింగ్స్ కోసం హీరో, హీరోయిన్లు ఇలా ఏదోకటి చెయ్యాల్సి వస్తోంది.
ఇక నూతన దర్శకురాలు లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య – రీతూవర్మ హీరోహీరోయిన్లుగా రాబోతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అక్టోబరు 29న ఈ సినిమా థియేటర్ లలో రిలీజ్ కానుంది.