Vadhandhi Web Series Review: నటీనటులు: ఎస్ జే సూర్య, సంజన, లైలా, నాజర్, వివేక్ ప్రసన్న, హరీష్, స్మృతి వెంకట్, కుమారన్ త్యాగరాజన్. సంగీతం: సిమన్స్, సినిమాటోగ్రఫీ: శరవణన్, ఎడిటింగ్: రిచర్డ్ కెవిన్, నిర్మాతలు: పుష్కర్ అండ్ గాయత్రి, దర్శకత్వం: అండ్రూ లూసిస్.

Vadhandhi Web Series Review
కోవిడ్ తర్వాత ఓటిటి ల వినియోగం బాగా పెరిగిపోయింది. సినిమా థియేటర్లలో దోపిడీ ఎక్కువ కావడంతో ఇంటిల్లిపాది ఓటీటీలకు అతుక్కుపోతున్నారు. ప్రేక్షకుల అభిరుచి కూడా మారడంతో ఓటీటీ సంస్థలు కూడా విభిన్నమైన నేపథ్యంతో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నాయి.. అందులో క్రైమ్, సస్పెన్స్, డిటెక్టివ్ వంటి కోణాల్లో సాగే కథలకు ప్రాధాన్యమిస్తున్నాయి. వాటిని ప్రేక్షకులు కూడా బాగా చూస్తున్నారు.. గ్రిప్పింగ్ కథ, కథనం ఉండడంతో వాటిని ఇష్టపడుతున్నారు.. డబ్బింగ్ వెసలు బాటు కూడా ఉండటంతో ఇలాంటి వాటికి ఆదరణ నానాటికి పెరుగుతున్నది. అలా ఇటీవల ప్రేక్షకులకు ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ “వదంతి”. దర్శకుడు, నటుడు ఎస్ జె సూర్య ఇందులో కీలక పాత్రలో నటించారు.. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందామా?
కథ ఏంటంటే
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి శివారు ప్రాంతంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటుంది. ఆ చిత్ర బృందం షూటింగ్ చేస్తుండగా ఒక యువతి మృతదేహాన్ని చూస్తారు.. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ ను హత్య చేశారని ఒక వదంతి వ్యాపిస్తుంది.. అయితే హత్యకు గురైన యువతి హీరోయిన్ కాదని, వేలోని( సంజన) అని గుర్తిస్తారు.. అయితే అప్పటికి ఈ విషయం వదంతిలా వ్యాపించడంతో ఈ కేసును తప్పనిసరిగా ఛేదించాల్సిన పరిస్థితి పోలీసులకు ఏర్పడుతుంది.. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సై వివేక్ ( సూర్య) రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత అతడికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఇంతకీ హత్యకు గురైన ఆ యువతి ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? ఈ కేసు విచారణ ఎలా సాగింది? అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే
వాస్తవానికి క్రైమ్ సస్పెన్స్ నేపథ్యంతో సాగే వెబ్ సిరీస్ లకు కథతో పాటు ట్విస్ట్ లు ఉండాలి. అన్నింటికీ మించి ఎంగేజ్ స్క్రీన్ ప్లే ఉండాలి. ఈ పని చేయడంలో ఈ వెబ్ సిరీస్ దర్శకుడు విజయవంతమయ్యారు. యువతి హత్యతో ఎలాంటి వదంతులు వ్యాపిస్తాయో చెప్పేందుకు దర్శకుడు మొదటి ఎపిసోడ్ వాడుకున్నాడు. ఎస్ఐ కేసు టేకప్ చేయడంతో అసలు కథ మొదలవుతుంది.. మొదటి మూడు ఎపిసోడ్లు పాత్రల పరిచయం, వాటి నేపథ్యానికి సరిపోయాయి. నాలుగో ఎపిసోడ్ నుంచి కథ వేగం పుంజుకుంటుంది. కథను ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో అక్కడక్కడ కొన్ని సన్నివేశాలకు కత్తెర లేకుండా అలానే వదిలేశారు. కేసు విచారణలో భాగంగా ఒక్కొక్క ఆధారాన్ని సేకరించడం, కేసుకు సంబంధించిన వివరాలు క్రోడీకరించడం ప్రేక్షకులకు ఎంగేజింగ్ అనిపిస్తుంది. టెంపో చివరి వరకు దర్శకుడు కొనసాగించిన విధానం బాగుంది.. మరీ ముఖ్యంగా ప్రతి పాత్ర పై అనుమానం కలిగేలా దర్శకుడు సన్నివేశాలు రాసుకున్న విధానం కొత్త అనుభూతిస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం సూపర్బ్. ప్రేక్షకులు ఒక్కసారిగా అలా నిశ్చేష్టులవుతారు. అయితే ఆ యువతని హత్య ఎవరు చేశారని చెప్పేందుకు ఎనిమిది ఎపిసోడ్లు చాలా ఎక్కువ. ఏ కారణం వల్ల చంపారో తెలిసిన తర్వాత కూడా ఇంత సాగదిత అవసరమా అనిపిస్తుంది.
నటన ఎలా ఉందంటే
సూర్యకు పోలీస్ పాత్రలు కొత్త కాదు. ఆయన ఈ పాత్రలో జీవించారు. అయితే ఆయనకు చెప్పిన తెలుగు డబ్బింగ్ అంతగా అతకలేదు. వెటరన్ నటిమణి లైలా ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించారు. ఆమె ఇలా చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇక నాజర్, సంజన తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంది. విక్రమ్ వేదా సినిమా దర్శక ద్వయం పుష్కర్ గాయత్రి నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సిమన్స్ సంగీతం కొత్త అనుభూతి ఇస్తుంది. శరవణన్ సినిమాటోగ్రఫీ వెబ్ సిరీస్ ని మరో స్థాయికి తీసుకెళ్ళింది. కెవిన్ ఎడిటింగ్ అసలు బాగోలేదు.. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది.. టేకింగ్ కొత్తగా అనిపించింది.. హత్య ఎవరు చేశారు అనే విషయాన్ని చివరి వరకు తీసుకెళ్లడం ఇంకా బాగుంది.. కానీ ఆ విషయం కోసమే ఇంత సాగదీత బాగోలేదు.

Vadhandhi Web Series Review
ప్లస్ లు
నటీనటులు… ట్విస్టులు… మ్యూజిక్.. సినిమాటోగ్రఫీ.. కొత్త కథ
మైనస్ లు
రెగ్యులర్ స్టోరీ.. సుదీర్ఘమైన ఎపిసోడ్లు… మధ్యలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు..
చివరిగా వదంతి బాగున్నా.. సాగదీశారు.