TSPSC Paper Leak Case: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ లో “హైటెక్” కోణం.. అచ్చం మహేష్ బాబు అర్జున్ సినిమా లానే!
ప్రశ్నపత్రాల లీకేజీకే పరిమితమైందనుకున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. అధునాతన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సాయంతో మాస్ కాపీయింగ్ జరిగినట్లు సిట్ అధికారులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏఈఈ పరీక్ష రాసిన ముగ్గురు అభ్యర్థులు టెక్నాలజీ సాయంతో కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఇలాంటి వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు సిట్ వర్గాలు చెబుతున్నాయి.

TSPSC Paper Leak Case: మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమా చూశారా? అందులో ఒక ఎగ్జామ్ సన్నివేశం ఉంటుంది.. ఆ పరీక్ష రాసేందుకు వచ్చిన ఒక వ్యక్తి కళ్ళద్దాలు పెట్టుకుని పరీక్ష రాస్తూ ఉంటాడు. అనుమానం వచ్చిన మహేష్ బాబు ఆ కళ్లద్దాలు చూసి షాక్ అవుతాడు.. ఎందుకంటే బ్లూటూత్ డివైస్ సహాయంతో బయట ఒక వ్యక్తి పరీక్షలకు సంబంధించి సమాధానాలు పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ కళ్లద్దాల స్క్రీన్ లో క్వశ్చన్ పేపర్ కనిపిస్తూ ఉంటుంది.. అదంటే సినిమా కాబట్టి.. ఊహాతీతంగా ఉంటుంది. అని అదే నిజ జీవితంలో జరిగితే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీకి సంబంధించి అచ్చం ఇలాంటి హైటెక్ కాపీయింగే జరిగింది. దీని గురించి విచారణ చేస్తుంటే విస్తు పోవడం అధికారుల వంతవుతోంది.
కొత్త కోణం
ప్రశ్నపత్రాల లీకేజీకే పరిమితమైందనుకున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. అధునాతన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సాయంతో మాస్ కాపీయింగ్ జరిగినట్లు సిట్ అధికారులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏఈఈ పరీక్ష రాసిన ముగ్గురు అభ్యర్థులు టెక్నాలజీ సాయంతో కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఇలాంటి వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు సిట్ వర్గాలు చెబుతున్నాయి.
డీఈ రమేష్ కీలక సూత్రధారి
ఇక ఇటీవల వరంగల్‌లో అరెస్టయిన విద్యుత్ డీఈ రమేశ్ అలియాస్ రవీందర్ ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. ఈ కేసులో ఏ12గా ఉన్న సురేశ్ గ్యాంగ్‌కు చెందిన పూల రవికిశోర్ నుంచి ఏఈఈ మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన డీఈ రమేశ్ అలియాస్ రవీందర్.. దాన్ని పలువురికి భారీ మొత్తానికే అమ్మారు. నిజానికి ఏఈఈ మెరిట్ లిస్టును తీసుకున్న సిట్.. వరంగల్‌లో ఎక్కువ మార్కులు సాధించిన పలువురు అభ్యర్థులను విచారించాకే రమేశ్ పాత్ర బయటపడింది. హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న రమేశ్.. ఇక్కడ కూడా 20 మందికి ప్రశ్నపత్రాన్ని విక్రయించినట్లు ఆధారాలు సేకరించిన సిట్.. వారి గురించిన ఆరా తీస్తున్న క్రమంలో ప్రశాంత్, నరేశ్ అలియాస్ నవీన్, మహేశ్‌ను అదుపులోకి తీసుకుని, విచారించింది. ఈ క్రమంలో హైటెక్ మాస్ కాపీయింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో ఈ ముగ్గురూ చెవుల్లో సూక్ష్మ పరికరాల(బ్లూటూత్/వైఫై డివైజ్) ద్వారా మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డట్లు, తమకు సమాధానాలను రమేశ్ అలియాస్ రవీందర్ చేరవేసినట్లు సిట్ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. కాగా.. రమేశ్ తాను ఫ్యాకల్టీలో ఉన్న కోచింగ్ కేంద్రంలోనే ప్రశ్నపత్రాలను బయటపెట్టాడా? లేక, ఇతర కోచింగ్ కేంద్రాలకు కూడా చేర్చాడా? అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇలా చేశారు?
రమేశ్ ముఠా ఓ ముందస్తు ప్రణాళికతో హైటెక్ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడి ఉంటుందని స్పష్టమవుతోంది. ‘‘వీరు కాపీయింగ్‌కు ఎలా పాల్పడ్డారు? ఏయే పరికరాలను వినియోగించారు? అనేది ఇంకా తేలాల్సి ఉంది. నిందితులను విచారిస్తున్నాం. రమేశ్ నోరు మెదపడం లేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ వ్యవహారం గుట్టంతా బయటపడుతుంది’’ అని సిట్ అధికారులు చెబుతున్నారు. అయితే.. కమ్యూనికేషన్ మాధ్యమాలు లేకుండా రిమోట్‌గా ఒక పరికరానికి సమాచారాన్ని చేరవేయడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. ‘‘రిసీవర్‌లు సూక్ష్మంగా ఉన్నా.. సోర్స్ వెంటే ఉండాలి. ఉదాహరణకు సెల్‌ఫోన్‌కు 30 మీటర్ల లోపు దూరంలో ఉంటేనే బ్లూటూత్ ద్వారా సమాచారం అందుతుంది. లేదంటే వైఫైని మాధ్యమంగా చేసుకోవాలి. అది కూడా పరిమిత దూరంలోనే సాధ్యమవుతుంది. సెల్‌ఫోన్, సిమ్‌కార్డు లేకుండా సుదూర ప్రాంతాల నుంచి సమాచారం చేరవేయడం సాధ్యపడదు’’ అని వివరిస్తున్నారు.
2014 లోనూ..
2014లో వెలుగు చూసిన భారీ ఆర్‌ఆర్‌సీ(రైల్వే రిక్రూట్‌మెంట్) మాస్ కాపీయింగ్‌లోనూ మశ్చేందర్ ముఠా మౌలాలి రైల్వే క్వార్టర్స్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, అభ్యర్థులకు తాయొత్తుల్లాంటి పరికరాల్లో పట్టే సెల్‌ఫోన్ డివైజ్‌ను ఇచ్చి, సూక్ష్మ బ్లూటూత్ పరికరం ద్వారా హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడింది. రమేశ్ కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తేగానీ టీఎ్‌సపీఎస్సీలో హైటెక్ మాస్ కాపీయింగ్ సాధ్యమయ్యే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. రమేశ్ విద్యుత్తు శాఖలో డిప్యూటీ ఇంజనీర్(డీఈ) కావడం వల్ల.. పరీక్ష కేంద్రాల సమీపంలోని విద్యుత్తు స్తంభాలను ఇందుకోసం ఉపయోగించుకున్నాడా? వాటికి ఎక్కువ రేంజ్ ఉండే వైఫై పరికరాలను అమర్చి మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడా? అనే అనుమానాలు సిట్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరో వైపు టీఎస్ పీఎస్సీ ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు శాఖకు చెందిన సెక్యూరిటీ వింగ్‌ల ద్వారా మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసింది. ఎక్కువ మంది అభ్యర్థులు హాజరైన గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన కేంద్రాల వద్ద కనీసం ఒక డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్(డీఎఫ్ డీడీ), ఒక హ్యాండ్‌హెల్డ్ మెటల్ డిటెక్టర్(హెచ్‌హెచ్‌డీడీ)లను ఏర్పాటు చేసి, అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఏఈఈ, డీఏవో వంటి పరీక్షలకు తక్కువ అభ్యర్థులు ఉండడంతో పరీక్ష కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్ల సంఖ్యను రెట్టింపు చేసింది. సిటీ సెక్యూరిటీ వింగ్(సీఎస్ డబ్ల్యూ) పోలీసులు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. మెడలో చైన్, చివరకు మహిళా అభ్యర్థుల జడ పక్కపిన్నులను సైతం మెటల్ డిటెక్టర్లు గుర్తిస్తాయి. కానీ, ఏఈఈ పరీక్షకు సూక్ష్మ బ్లూటూత్ పరికరాలతో వెళ్లిన వారిని ఎందుకు నిలువరించలేకపోయాయి? అనే ప్రశ్న తలెత్తుతోంది. కాగా.. రమేశ్ నుంచి ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన గుగులోత్ శ్రీనివాస్.. మరో 8 మందికి దాన్ని విక్రయించినట్లు సిట్ నిర్ధారించింది. ప్రశ్నపత్రాల లీకేజీ, హైటెక్ మాస్ కాపీయింగ్‌లకు సంబంధించి మరో 50 మంది అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అరెస్టుల సంఖ్య 100 దాటే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
