Trudeau Vs Modi: భారత్ పై ఒత్తిడికి ట్రూడో యత్నాలు.. తిప్పి కొడుతున్న నరేంద్ర మోడీ
ఈనెల ఢిల్లీలో జరిగిన జి20 సమావేశాలకు ముందే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ లతో కూడిన “ఫైవ్ ఐస్” నిఘా వ్యవహారాల కూటమిని ట్రూడో సంప్రదించారు..

Trudeau Vs Modi: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ప్రధానమంత్రి ట్రూడో భారతదేశంపై చేసిన వ్యాఖ్యలు ఇంకా చల్లారడం లేదు. పైగా భారత్ తమ అంతర్గత విషయంలో జోక్యం చేసుకుంటున్నదని ట్రూడో ఆరోపించడం కలకలం రేపుతోంది. అయితే భారత్ పై ట్రూడో చేసిన ఆరోపణలకు ముందు ఆయన అమెరికా అధ్యక్షుడు జో బై డెన్ తో సమావేశమయ్యారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఓ విలేఖరి ట్రూడో ఎదుట ప్రస్తావించారు. అయితే దీనిని దౌత్యపరమైన సంభాషణగా ట్రూడో పేర్కొన్నారు..
ఒత్తిడి తేవడానికి..
ఈనెల ఢిల్లీలో జరిగిన జి20 సమావేశాలకు ముందే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ లతో కూడిన “ఫైవ్ ఐస్” నిఘా వ్యవహారాల కూటమిని ట్రూడో సంప్రదించారు.. నిజ్జర్ హత్యను ఖండిస్తూ ఫైవ్ ఐస్ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసే విధంగా ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. కానీ g20 సమావేశాలను భారత్ నిర్వహిస్తున్న దృష్ట్యా ఫైవ్ ఐఎస్ దేశాలు దానికి అంగీకరించలేదని తెలిసింది. అయితే ప్రైవేటుగా జరిగిన చర్చల్లో పలు దేశాల అధికారులు భారత్ తో ఈ విషయాన్ని గట్టిగానే ప్రస్తావించారని, జీ_20 కి ముందే ఇది జరిగినట్టు తెలుస్తోంది.. నిజ్జర్ హత్యపై జరిగే దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలను ఫైవ్ ఐస్ తరఫున ఉమ్మడి ప్రకటన రూపంలో వెల్లడించాలని ట్రూడో ప్రతిపాదించారని, దీనికి కూడా అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు కూడా నిరాకరించాయని తెలుస్తోంది.
తిప్పి కొట్టే ప్రయత్నాల్లో..
మరోవైపు భారత్ పై గుడ్డ కాల్చి మీద వేస్తున్న కెనడా దేశం తీరు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహం గా ఉన్నారు. అంతర్జాతీయంగా దేశం పై ఒత్తిడి తేవడానికి కెనడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.. నిజ్జర్ హత్య కేసులో సాక్ష్యాధారాలను చూపిస్తే తాము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని కెనడాకు సూచించారు. భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులు, ఖలిస్థానీ వేర్పాటువాదులు కెనడాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని గతంలో పలుమార్లు తెలియజేసినప్పటికీ ఆ దేశ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తమకు ఎన్నడూ సహకరించలేదని నరేంద్ర మోడీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి బాంబు పేల్చారు.. కెనడా నుంచి నిజ్జర్ హత్య విషయంలో ఇప్పటివరకు ఆ నిర్దిష్టమైన వివరాలు అందలేదని ప్రకటించారు. కెనడా గడ్డమీద నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వివరాలు మాత్రం ఆ దేశానికి అందించామని, కానీ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ప్రకటించారు. ఈ విషయంలో బాధపడే దేశం ఏదైనా ఉందంటే అది కెనడా మాత్రమే అని ఆయన చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఉగ్రవాదులకు, వ్యవస్థీకృత ముఠాలకు కెనడా అడ్డాగా మారిందని ఆయన ప్రకటించడం ఆ దేశాన్ని ఓ కుదుపు కుదుపుతోంది.
Recommended Video:
