MLC Kavitha vs YS Sharmila: “40 జుట్లు కలిసి ఉంటయి.. మూడు శిక లు కలిసి ఉండయి.” తెలంగాణ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన సామెత ఇది. ఇప్పుడు కవిత, షర్మిల దానిని నిజం చేస్తున్నారు. వైయస్ షర్మిల ఏడాది క్రితం పార్టీ పెట్టి, టిఆర్ఎస్ నాయకులను తూర్పార పట్టుడే పనిగా పెట్టుకుంది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలో చేసిన పాదయాత్రలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే బిజెపి నాయకుల కంటే షర్మిల చేసిన ఆరోపణలే ఎంతో కొంత జనాన్ని ఆలోచనలో పడేసాయి.. ఆమె బలమైన పబ్లిక్ రిలేషన్ టీం ఏర్పాటు చేసుకుంది.. వారంతా కూడా ఆమెకు స్థానిక పరిస్థితులపై ఫీడ్ బ్యాక్ ఇవ్వడం, లోతుగా స్టడీ చేసి షర్మిలకు స్పష్టమైన సమాచారం ఇచ్చేవారు. దీనివల్ల ఆమె ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేసేది. చేస్తున్నది.

MLC Kavitha vs YS Sharmila
టిఆర్ఎస్ పార్టీ గుర్తించిందా
వైయస్ షర్మిల పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా టిఆర్ఎస్ నాయకులు ఆమెను గుర్తించలేదు. ఆమె పాదయాత్రను కూడా పట్టించుకోలేదు. ఆమె విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఖాతరు చేయలేదు. వాస్తవానికి నర్సంపేట నియోజకవర్గం లో పాదయాత్ర జరుగుతున్నప్పుడు షర్మిల చేసిన విమర్శలు కొత్తవి కావు. ఇంతకంటే ఘాటుగా షర్మిల విమర్శలు చేసింది. కానీ ఒకటి రెండు చోట్ల మినహా టిఆర్ఎస్ నాయకులు పెద్దగా ప్రతిఘటించలేదు. కానీ ఇప్పుడు మాత్రం కవిత నుంచి ఒక స్థాయి ఉన్న నాయకులు దాకా షర్మిలను విమర్శిస్తున్నారు.
బిజెపి, షర్మిల ఒక్కటేనని చూపే ప్రయత్నం
ఈరోజు ఉదయం ట్విట్టర్ లో బిజెపి నాయకులను, షర్మిలను ఉటంకిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెట్టిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి షర్మిల పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కవిత స్పందించలేదు.. కవిత, షర్మిల మధ్య మంచి స్నేహమే ఉందని చెబుతూ ఉంటారు. కానీ ఆకస్మాత్తుగా ఈరోజు కవిత సోషల్ మీడియాలో బిజెపి, షర్మిల ఒకటే అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేయడం నిజంగానే ఆసక్తి కలిగించింది. కవిత చెప్పినట్టు బిజెపి నాయకులను షర్మిల కలిసినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. కానీ ప్రస్తుతం బిజెపిని ఎదుర్కోవాలంటే ఏదో ఒక రూపంలో బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కవిత ఈ ట్వీట్ చేసిందని కమలం పార్టీ నాయకులు అంటున్నారు. లిక్కర్ స్కామ్ లో పీకల్లోతు కూరుకుపోయిన కవితకు ఏం చేయాలో తెలియక, ఇలాంటి పనికిమాలిన ట్వీట్లు చేస్తున్నదని వారు ధ్వజమెత్తుతున్నారు.

MLC Kavitha vs YS Sharmila
తమలపాకుతో ఒకటి ఇస్తే..
తమలపాకుతో ఒకటి ఇస్తే.. తలుపు చెక్కలతో రెండు ఇచ్చినట్టు.. కవిత ఒక ట్వీట్ చేయగానే.. షర్మిల దానికి బదులుగా మరో ట్వీట్ చేశారు. ” పాదయాత్రలు చేసింది లేదు. ప్రజల సమస్యలు చూసింది లేదు. ఇచ్చిన హామీలు అమలు చేసింది లేదు. పదవులే కానీ.. గులాబీ తోటలో పనితనం లేని కవితలు ఎంతోమంది అంటూ” నేరుగా అటాక్ చేశారు. ఇక్కడ కవిత తాను చేసిన ట్వీట్లో షర్మిల ట్యాగ్ చేయలేదు.. కానీ షర్మిల నేరుగా రంగంలోకి దిగారు. కవితను ట్యాగ్ చేశారు.. దీంతో సోషల్ మీడియాలో యుద్ధం మొదలైంది.. టిఆర్ఎస్ నాయకులు కూడా షర్మిల కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.. అయితే ఈ యుద్ధంలో కవిత దే కాస్త పై చేయిగా కనిపిస్తోంది. అయితే మొదటినుంచి షర్మిల పాదయాత్రను పెద్దగా సీరియస్ గా తీసుకొని టిఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు ఈ తీరుగా స్పందించడం పట్ల రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బైంసాలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నందున.. ఆయనకు క్రెడిట్ దక్కకుండా ఉండేందుకు టిఆర్ఎస్ నాయకులు ఎత్తుగడ వేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఏమైనప్పటికీ తెలంగాణలో ఎన్నికలకు మరో ఏడాదిలోపే గడువున్నప్పటికీ… నేతల మాటల తీరుతో అప్పుడే ఎన్నికలు వచ్చాయా అనే అనుమానం కలుగుతున్నది.