
Kaleshwaram
Kaleshwaram: పవిత్ర గోదావరి నదికి ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరం. తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధి గాంచిన త్రిలింగ క్షేత్రాల్లో కాలేశ్వరం ఒకటి. మహిమాన్వితమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణానికి 125 కిలోమీటర్ల దూరంలో మహాదేవపూర్ మండలానికి సమీపంలో దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వరం ప్రత్యేకతపై కథనం.
ఒకేపానవట్టంపై యముడు.. శివుడు కలిసి..
సాధారణంగా శివాలయాల్లో గర్భగుడి ఒకే శివలింగం మనకు దర్శనమిస్తుంది. కానీ కాళేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు ఒకేపానవట్టంపై మనకు దర్శనమిస్తాయి. అందులో ఒకటి ముక్తేశ్వరుడు(శివుడు), మరొకటి కాళేశ్వరుడి(యముడు). ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం దేశంలో ఎక్కడా కనిపించదేమో..!
ఆలయ స్థల పురాణం
దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి అనుగ్రహించడంతో యమధర్మ రాజుకు పనిలేకుండా పోయిందట. అప్పుడు యముడు ముక్తేశ్వర స్వామి వద్దకి వెళ్లి వేడుకోగా… శివుడు యమున్ని తనవద్దే పక్కన లింగరూపంలో నిల్చోమన్నాడట. తనని దర్శించుకున్న వారు అతనిని దర్శించుకోంటే మోక్షప్రాప్తి లభించదని అన్నాడట. అలాంటి వారికి కాలం దగ్గరపడుతున్నప్పుడు నేరుగా నరకానికి తీసుకొని వెళ్లమని చెప్తాడు. అందుకే భక్తులు స్వామి వారిని దర్శించుకొని (శివుణ్ని), కాళేశ్వరుణ్ణి (యమున్ని) కూడా దర్శించుకుంటారు.

Kaleshwaram
రెండు ప్రత్యేకతలు..
ఆలయంలో రెండు శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉండటం ఒక విశేషమైతే ముక్తేశ్వరస్వామి లింగంలో రెండు రంధ్రాలు ఉండటం మరో ప్రత్యేకత. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు సమీపంలోని గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందంటారు. ఇక, దేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ ఆలయాల్లో ఒకటైన కాళేశ్వరంలోని మహా సరస్వతి ఆలయం ఇక్కడ చూడవలసిన మరొక ప్రధాన ఆలయం. అలాగే సూర్యదేవాలయం కూడా ఇక్కడ ఉంది. కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనమత్ తీర్థం, జ్ఞానతీర్థం, వాయుసతీర్థం, సంగమతీర్థం వంటి తీర్థాలున్నాయి.
ఆది ముక్తేశ్వర ఆలయం
కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పడమటి వైపు యమగుండం మీద సుమారు ఒక కి.మీ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం. ఆలయంలో మొదట లోనికి వేళ్లే చోట యమకోణం ఉంది, ఇందులో నుంచి బయటకి వెల్లినట్లయితే యమ దోషం పోతుంది అని భక్తులు విశ్వసిస్తారు.
ప్రతీ శివరాత్రికి ప్రత్యేక పూజలు..
నిత్యం పూజలందుకుంటున్న కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి దర్శనానికి శివరాత్రికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు అభిషేక ప్రయుడికి పవిత్ర గోదావరి జలాలతో అభిషేకిస్తారు. పవిత్ర తివేణి సంగమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరంలో గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం అందుకే శివరాత్రివేళ ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. శనివారం మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వర, ముక్తీశ్వరాలయం భక్తులతో కిటకిటలాడుతోంది.