Pawan Kalyan- BJP: ఆయన మార్పు కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతటి కష్టమైనా ఓర్చుకుంటారు. లక్ష్యసాధనలో దేనినీ లెక్కచేయరు. మదపుటేనుగుల పీచమణచడం లక్ష్యంగా ఎంచుకున్నారు. అందుకు ప్రతిపక్షాలను ఏకం చేయాలని ప్రతిన బూనారు. లక్ష్యం ఒక్కటే అయినా దారులు వేరు. ఆ దారులన్నింటిని ఏకం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయనే జనసేనాని పవన్ కళ్యాణ్. ఏపీలో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే బృహత్తర బాధ్యత నెత్తికెత్తుకున్నారు.

ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ప్రకటించాయి. కానీ ఒంటరి పోరాట పంథాను ఎంచుకున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కోదారిలో ముందుకుపోతున్నాయి. ప్రతిపక్షాల మధ్య సమన్వయం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రతిపక్షాలు ఒంటరిగా ఎన్నికలకు వెళితే వైసీపీకి మరోసారి అధికారం కట్టబెట్టడమే. వైసీపీకి కూడా ఇదే కోరుకుంటోంది. ప్రతిపక్షాలను ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయించేలా సర్వ ప్రయత్నాలు చేస్తోంది. జిత్తులమారి ఎత్తులను ప్రదర్శిస్తోంది.
వైసీపీ ఎత్తులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రహించారు. అందుకే ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ పిలుపునందుకుని టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కలిసి నడిచేందుకు సిద్ధమని ప్రకటించారు. టీడీపీ, జనసేన పొత్తుకు వెళితే ప్రమాదమని వైసీపీ గ్రహించింది. జనసేన లక్ష్యంగా మాటల దాడిని పెంచింది. ప్యాకేజీ కోసం టీడీపీతో కలుస్తోందని విషప్రచారం చేయిస్తోంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా నిగ్రహం కోల్పోలేదు. వైసీపీ వ్యూహాన్ని పసిగట్టారు. వైసీపీ విషపు ట్రాప్ లో పడకుండా జాగ్రత్తపడుతున్నారు. అందుకు అనుగుణంగానే తన వ్యూహరచన చేస్తున్నారు.
2024 ఎన్నికలకు టీడీపీతో మాత్రమే కాకుండా బీజేపీని కూడ కలుపుకుపోవాలని పవన్ కళ్యాణ్ కృతనిశ్చయంతో ఉన్నారు. తద్వార 2014 కాంబినేషన్ ను రిపీట్ చేయాలని భావిస్తున్నారు. 2014 తరహాలో విజయదుంధుబి మోగించాలని చూస్తున్నారు. టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నారు. ఒంటరిగా వెళ్లడం ద్వార ఎవరికీ ఉపయోగం లేదని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. ఒంటరిగా వెళితే వైసీపీకి ప్రతిపక్షాలే అధికారాన్ని కట్టబెట్టినట్టు అవుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు.

ఏపీ బీజేపీ టీడీపీతో కలిసి వచ్చేందుకు సిద్ధపడటం లేదు. జనసేనతో ఇప్పటికే పొత్తులో ఉంది. కాబట్టి జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికలకు వెళ్దామని పవన్ కల్యాణ్ కు సంకేతాలు ఇస్తోంది. ఒంటరిగా అయినా వెళ్తాం కానీ టీడీపీతో కలిసి రాలేమని బీజేపీ చెబుతోంది. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీ పై ఆశలు వదులుకోలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా వెళ్లాలని జనసేనాని కోరుకుంటున్నారు. అందుకోసం బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.
వాస్తవంగా ఏపీలో బీజేపీ పొత్తులను బీజేపీ కేంద్ర నాయకత్వం ఖరారు చేస్తుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యవర్గం తమ అభిప్రాయాన్ని ప్రకటించింది. కానీ ఇది ఫైనల్ కాదు. కేంద్ర నాయకత్వం చెబితే ఏపీ బీజేపీ ప్రతిపక్షాలతో కలిసి నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేంద్ర నాయకత్వంతోనే పొత్తుల విషయం మాట్లాడాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రతిపక్షాలను కలిపే బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో మాట్లాడారు. ఇక బీజేపీ పెద్దలను కలిసి ఒప్పంచగలిగితే ఏపీలో పొత్తులు ఖరారవుతాయి. పవన్ కల్యాణ్ ఏ మేరకు బీజేపీ పెద్దల్ని ఒప్పంచగలరు అన్న అంశం పై ఏపీలో పొత్తులు ఆధారపడి ఉంటాయి.