CM Jagan- Union Budget 2023: రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న రాష్ట్రానికి.. చివరి బడ్జెట్లోనూ నిరాశను మిగిల్చారు. పార్లమెంటులో చేసిన చట్టాలను గాలికొదిలేశారు. ఇచ్చిన హామీలకు నీళ్లొదిలేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మరోసారి అన్యాయం చేశారు. విభజనతో నష్టపోయిన ఏపీకి మరోసారి మొండిచేయి చూపారు.

ఏపీ విభజన జరిగిన తొమ్మిదేళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ ఏ బడ్జెట్లోనూ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కేటాయించాల్సిన నిధుల్ని కేటాయించలేదు. అరకొర నిధులు విధిలించడమే తప్పా ఎప్పుడూ పూర్తీస్థాయిలో కేటాయించలేదు. ఏపీ అభివృద్దికి పూర్తీస్థాయిలో ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టును కూడా కేటాయించలేదు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఒక్కటే కాదు.. ఏపీ ప్రభుత్వ చేతగానితనం కూడా. సొంత పనుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగే సీఎంలు ఉన్నంత కాలం ఏపీలాంటి రాష్ట్రాలకు నిధులు రావు. హామీలు నెరవేరవు.
విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు పరిష్కారం కాలేదు. ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం మర్చిపోయారు. వైసీపీ బలహీనతలు ఆసరాగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ ఏపీ పై వివక్ష చూపుతోందని చెప్పవచ్చు. జగన్ కు ఉన్న కేసుల కారణంగా కేంద్రాన్ని పల్లెత్తి మాట అనలేరు. ఇదే అదునుగా ఏపీకి రావాల్సిన నిధుల్ని కేంద్రం ఇవ్వడంలేదు. ఏపీ ప్రభుత్వం గట్టిగా ప్రశ్నించగలిగితే ఏపీకి రావాల్సిన నిధులు, కేటాయింపులను సాధించుకోవచ్చు. కానీ ఏపీ ప్రభుత్వ చేతగానితనంతో కేంద్ర ప్రభుత్వం ఏపీ పై నిర్లక్ష్యాన్ని చూపుతోంది. సీఎం జగన్ సీబీఐ కేసులు, వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ఢిల్లీకి వెళ్తారు. కానీ ఏపీకి రావాల్సిన నిధుల పై నిలదీయడానికి ఎప్పుడూ వెళ్లరు. ఇదే ఏపీ పాలిట శాపంగా మారింది.

విశాఖ రైల్వేకు, పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఏపీ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఈసారి కూడా అదే మొండిచేయి చూపారు. పైసా కూడా విదల్చలేదు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇలా విభజన చట్టంలో ఉన్న ఏ అంశం గురించి కూడా బడ్జెట్ లో ప్రస్తావించలేదు. ఏపీ విభజన జరిగి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఏపీకి జరిగిన న్యాయం శూన్యమనే చెప్పాలి. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తూ.. ఆ రాష్ట్రాల్లోనే అభివృద్ధి చేస్తోంది కేంద్రంలోని బీజేపీ. ఏపీలాంటి రాష్ట్రాలను అసలు పట్టించుకోవడంలేదు.
జగన్ పై ఉన్న కేసుల కారణంగానే బీజేపీ ఏపీ పట్ల నిర్లక్ష్యం చూపుతోందని అర్థమవుతోంది. ప్రశ్నించే పరిస్థితి లేకపోవడం వల్లే ఏపీ పై ఇంతటి వివక్ష చూపుతోంది. ఇది ముమ్మాటికీ ఏపీ పాలకుల చేతగానితనమే. అప్పుల కోసం ఢిల్లీ చుట్టు తిరుగుతారు కానీ హక్కుగా రావాల్సిన నిధుల గురించి ప్రశ్నించడానికి వెనకడుగు వేస్తున్నారు. బీజేపీ దీనినే అలుసుగా తీసుకొని ఏపీ అభివృద్ధి పై నిర్లక్ష్యం చూపుతోంది.