Hyderabad: ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అంటారు. ఇష్టపడిన వ్యక్తిని దక్కించుకునేందుకు ఎంతటి సాహసాన్నైనా చేయిస్తుందంటారు. అయితే పిచ్చి వ్యామోహం, ప్రేమ మాటున కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. చివరకు కటకటాల పాలవుతున్నారు. హైదరాబాదులో యువతి ఇలానే పోలీసులకు చిక్కింది. ఓ యాంకర్ పై మనసు పారేసుకున్న ఆమె..అతడిని కిడ్నాప్ చేయించి పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టింది. చివరకు కటకటాల పాలయ్యింది.
హైదరాబాదులోని ఓ టీవీ ఛానల్ లో ప్రణవ్ అనే వ్యక్తి యాంకర్ గా పని చేస్తున్నాడు. ఆయన పెళ్లి చేసుకునేందుకు ఓ వివాహ పరిచయ వేదికను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అక్కడ ఆయన ఫొటోలను గమనించిన ఓ యువతి మనసు పారేసుకుంది. ప్రణవ్ కు అప్రోచ్ అయితే ఆయన తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ప్రణవ్ ను కిడ్నాప్ చేయాలని సదరు యువతి భావించింది. ఫిబ్రవరి 10 అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధించారు. అప్పుడే సదరు యువతి ఎంటర్ అయ్యింది. తనను పెళ్లి చేసుకుంటావా? లేదా? అని డిమాండ్ చేసింది. ఆ తరువాత రోజు ప్రణవ్ తప్పించుకున్నాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆ యువతి చిక్కింది. ఆమె డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ లో పనిచేస్తోంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. మ్యాట్రిమోనీ సైట్లో ప్రణవ్ ఫోటోతో చైతన్య రెడ్డి అనే యువకుడు ఆమెతో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సదరు యువతి ప్రణవ్ అని భావించింది. పెళ్లికి తిరస్కరించడంతో కిడ్నాప్న కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సదరు యువతి తో పాటు కిడ్నాప్నకు పాల్పడిన ఐదుగురు, చైతన్య రెడ్డి లను అదుపులోకి తీసుకున్నారు.