
KCR Vs BJP: “మోదీ అయితే ఏంటి? ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? నువ్వు గోకినా, గోకక పోయినా నేను గోకుతూనే ఉంటా” అని బాజాప్త అన్నాడు. తాను ఎలా అన్నాడో, దాన్ని నిజం చేసి చూపిస్తున్నాడు. ఈ బీజేపీ పెద్దలకే ఏమీ అర్థం కావడం లేదు.. పైగా తన బిడ్డ మీద ఈడీ కేసు పెట్టి మూడుసార్లు ఢిల్లీకి రప్పిస్తే తను ఊరుకుంటాడా? అసలే కేసీఆర్. పైగా కుయుక్తులు పన్నడం లో మహాభారతం లో బాగా ఫేమస్ అయిన పాత్ర ను మించిన వాడు. నరేంద్ర మోదీకి ఈడీ,సీబీఐ ఉన్నట్టే.. కేసీఆర్ కు సిట్, సీఐడీ, ఏసీబీ ఉన్నాయి. వాటిని తప్పకుండా తన లక్ష్యాల కోసం ప్రయోగిస్తాడు.. అప్పుడు రేవంత్ రెడ్డి మీద ప్రయోగించి సక్సెస్ అయ్యాడు.. ఇప్పుడు బండి సంజయ్ మీద కూడా ప్రయోగించి దాదాపు సక్సెస్ అయ్యాడు.. ఒక్క అరెస్టుతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పడేశాడు.
అసలు బిజెపి పెద్దలను బజారుకు లాగాలి, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ తేవాలి అని సంకలు గుద్దుకుంటున్న వాడు, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ద్వారా ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ గాయి గత్తర చేసినవాడు, ఏకంగా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పేరు కేసులో ప్రస్తావనకు వచ్చేలా చేసినవాడు.. ఆఫ్ట్రాల్ ఎవడో పంపించిన హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ని లోపల వేయలేడా? కార్లు మార్చలేడా? వాటికి న్యూస్ పేపర్లు అంటించి గ్రామాలు మొత్తం తిప్పలేడా? చివరకి కోర్టు బోన్లు ఎక్కించలేడా? బరాబర్ ఎక్కించాడు. బరాబర్ గోకుతూనే ఉన్నాడు.. కానీ ఈ విషయమే బిజెపి పెద్దలకు సరిగా అర్థం అయినట్టు కనిపించడం లేదు.. కెసిఆర్ కూడా బిజెపిలో ఎవరి జోలికి పోడు. బాగా ఎగిరి ఎగిరి పడే రాజాసింగ్, బండి సంజయ్ మీదకే వెళుతూ ఉంటాడు. జైల్లో వేస్తూ ఉంటాడు.

చాలామంది న్యాయ నిపుణులు ఈ కేసులో వస లేదు. కోర్టులో నిలబడలేదు? ఎవడో బండి సంజయ్ కి ప్రశ్నపత్రం వాట్సాప్ లో షేర్ చేస్తే లీకేజీ కి సంబంధించి అతడికి లింకు ఉన్నట్టేనా? అని అంటే మీరు కోర్టులో చెప్పుకోండి? ఇది మా తెలంగాణ. మా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇలానే ఉంటాయి. కాదు కూడదు అని అంటే ప్రత్యేకమైన పోలీస్ దళాలు వెంటపడతాయి. అర్ధరాత్రి పూట అరెస్టు చేస్తాయి. ఇదేంటి అని అడిగితే మాకు అదుపులోకి తీసుకొని అధికారం ఉందని దబాయిస్తాయి.. అక్రమం అని ఎవరైనా అధికార పార్టీ నాయకులను అడిగితే… బెయిల్ తెచ్చుకో కావాలంటే? నీకు ఏమైనా అన్యాయం జరిగితే కోర్టులో చెప్పుకో? మా సార్ గోకుడు స్టైల్ ఇలాగే ఉంటుందని ఆ బాల్క సుమన్ లాగా చాలా లౌడ్ గా చెబుతారు.
అసలు ఇన్నిసార్లు గోకుతున్నా కేంద్ర పెద్దలకు ఏమీ చేతకావడం లేదు .. ఆ మోదీ,అమిత్ షా ప్లేస్ లో యోగి గనుక ఉండి ఉంటే ఈ టైం కి ఇళ్ళ ముందు బుల్డో జర్లు వచ్చి ఉండేవి. కెసిఆర్ విసిరే అస్త్రాలకు తెల్ల మొహాలు వేస్తున్నారే తప్ప.. ఒక్కటంటే ఒక్కటి గట్టి పంచ్ ఇస్తున్నారా. పోనీ ఇచ్చిన పంచ్ లో ఏమైనా పస ఉంటున్నదా? కవితను ఈ డి విచారణ చేస్తే.. ఇంతవరకు అరెస్టు చేయలేకపోయారు.. మమతా బెనర్జీని, రాబర్ట్ వాద్రాను, అఖిలేష్ యాదవ్ ను, ఏం చేయగలిగారు? పోనీ ఒక్క చర్యయినా తీసుకోగలిగారా? జస్ట్ అలా గోకి గోకనట్టు గోకి సైలెంట్ అయిపోయారు. ఇక మీరు గోకే ఆ చిన్నపాటి గోకుడుకు కెసిఆర్ ఏకంగా రక్తాలు వచ్చేలాగా గోకుతున్నాడు.
ఇప్పటికైతే కెసిఆర్ లక్ష్యం దాదాపు నెరవేరినట్టే. ఎందుకంటే హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు విజయవంతంగా బండి సంజయ్ మెడ మీదకి వేశారు. అప్పట్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాన్ని కూడా బిజెపికి అంటగట్టే ప్రయత్నం చేశారు.. ఇక తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ మొదలుపెట్టగానే.. మిగతా మంత్రులు, ప్రతినిధులు బిజెపి దొంగ, బండి సంజయ్ దొంగ స్టార్ట్ చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నుంచి సబితా ఇంద్రారెడ్డి దాకా ప్రతి ఒక్కరు ఇవ్వాలా సామాజిక మాధ్యమాల్లో మోత మోగించారు.. ఇకనుంచి తెలంగాణలో ఏం జరిగినా బండి సంజయ్ ప్రధాన నిందితుడు అవుతాడు. కెసిఆర్ అంటే ఎగిరి ఎగిరి పడుతుంటారు కాబట్టి ఆ స్థాయిలో గోకుతూ ఉన్నాడు.. ఇవాళ బండి సంజయ్ అరెస్టు తర్వాత నరేంద్ర మోదీకి ఈ విషయాన్ని జేపీ నడ్డా, అమిత్ షా చెప్పారని, వారు ఇక్కడి పరిస్థితులను గవర్నర్ ద్వారా ఆరా తీశారని వార్తలు వచ్చాయి. అంటే కెసిఆర్ గోకుడు తీవ్రత మోదీకి తెలిసినట్టేనా? రేపు 8వ తేదీన మోదీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో దీని మీద ఏమైనా మాట్లాడతాడా? లేక సాతియో అంటూ ముగిస్తాడా? ఏమో కాలమే సమాధానం చెప్పాలి.