Taraka Ratna : నందమూరి తారకరత్న గుండెపోటుతో గత 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ బలోపేతం కోసం తాను సైతం అంటూ పాదయాత్ర కోసం వచ్చి కుప్పకూలి అకాల మృత్యువు ఒడికి చేరడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను సైతం పోటీ చేస్తానని చెప్పారని గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
తారకరత్న మృతి పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కొడుకు శ్రీరామ్ సంతాపం తెలిపారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన లేని లోటు తీర్చలేదన్నారు. దర్శకుడు రవిబాబు, నటుడు రాజేంద్రప్రసాద్ కూడా ఆయన పార్థివ దేహానికి అంజలి ఘటించారు. తారకరత్న పార్థివ దేహానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తారకరత్న పార్థివ దేహానికి అంజలి ఘటించి అనంతరం చంద్రబాబుతో మాట్లాడారు. ఎలా జరిగిందని తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా తారకరత్నకు ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ నేత, సినీనటుడు మురళీమోహన్ సైతం తారకరత్న మృతి దిగ్ర్బాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇలా పలువురు తారకరత్న భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు.
తారకరత్న ఒకే రోజు తొమ్మిది సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. అమరావతి సినిమాకు నంది అవార్డు దక్కించుకున్నారు. ఇలా నటనలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సాధించుకున్న నటుడిగా ఆయనకు గుర్తింపు దక్కింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఎదుగుతున్న క్రమంలో ఇలా జరగడం బాధాకరమే. కానీ విధి వైపరీత్యాన్ని ఎవరు కాదనలేరు. విధి ఆడిన వింత నాటకంలో తారక్ బలి కావడం ఆందోళన కలిగించేదే. ఈ నేపథ్యంలో తారకరత్న వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చంద్రబాబుతో అన్నట్లు గుర్తు చేసుకున్నారు.