కరోనా టైంలోనూ దర్శక.. నిర్మాతలు భారీ బడ్జెట్లో సినిమాలను తెరకెక్కిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ‘బాహుబలి’.. ‘సాహో’.. ‘రోబో-2’ సినిమాలు అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కాయి. వీటిలో ‘బాహుబలి’ సినిమా మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించి టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.
‘బాహుబలి’ తర్వాత అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న మూవీగా ‘బ్రహ్మస్త్ర’ పేరు విన్పిస్తోంది. రణ్ బీర్ కపూర్.. ఆలియా భట్ జంటగా నటిస్తున్న ఈ మూవీలో బిగ్ బీ అమితాబచ్చన్.. నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై రెండేళ్లుగా బాలీవుడ్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ‘బ్రహ్మస్త్ర’పై ఓ క్రేజ్ న్యూస్ వైరల్ అవుతోంది.
‘బ్రహ్మస్త్ర’ మూవీని డిస్నీ సంస్థతో కలిసి కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటివరకు వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలకు మించి ‘బహ్మస్త్ర’ను నిర్మిస్తున్నట్లు టాక్ విన్పిస్తోంది. ‘బ్రహ్మస్త్ర’ను ఎంత బడ్జెట్లో నిర్మిస్తున్నారనేది తెలియకపోయినా అనధికారికంగా మాత్రం 300కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
‘బ్రహ్మస్త్ర’లో బిగ్ బీ.. కింగ్ నాగార్జున వంటి భారీతారాగణం నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రెండేళ్లుగా షూటింగు జరుపుకుంటున్న ఈ మూవీ అనివార్య కారణాలతో నిలిచిపోయింది. తాజాగా ఈ మూవీని తిరిగి ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తుంది. ‘బహ్మస్త్ర’ మూవీని వచ్చే దసరా నాటికి పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తుందని సమాచారం.