
Pushpa 2 Promotions: ఒక సక్సెస్ ఫుల్ ఫార్ములాను పలువురు వాడేస్తుంటారు. ఆ ఫార్ములా అందరి విషయంలో వర్కవుట్ అవుతుందనే గ్యారంటీ ఉండదు. బాహుబలి 2 ప్రమోషనల్ టెక్నిక్ ని పుష్ప 2 కోసం సుకుమార్ అడాప్ట్ చేసుకున్నారు. ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. వీర విధేయుడైన కట్టప్ప అమరేంద్ర బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చింది? అనే ఆసక్తి రాజమౌళి లేవనెత్తాడు. బాహుబలి 2 విడుదలయ్యే వరకు ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి?’ నినాదం ప్రచారంలో ఉంది. అంతగా అది ప్రాచుర్యం పొందింది. బాహుబలి 2 విజయంలో కీలక పాత్ర పోషించింది.
సుకుమార్ ‘వేర్ ఈజ్ పుష్ప?’ అనే ప్రశ్న ద్వారా అదే తరహాలో ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచాలనుకుంటున్నారు. సుదీర్ఘమైన టీజర్ విడుదల చేయడం వెనుక కారణం ఇదే కావచ్చు. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ పుష్ప నెల రోజుల తర్వాత శేషాచలం అడవుల్లో నైట్ విజన్ కెమెరాల్లో రికార్డు అవుతాడు. అతడు బ్రతికే ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. పోలీసుల నుండి పారిపోయిన పుష్ప ఎక్కడికెళ్లాడు? అనే క్యూరియాసిటీ డెవలప్ చేయాలని చూస్తున్నారు.
అయితే బాహుబలి స్థాయిలో ఇది సక్సెస్ అవుతుందని చెప్పలేం. రాజమౌళి ముందుగానే ప్రణాళిక వేసి కథలో భాగంగా పార్ట్ 1 క్లైమాక్స్ లో చెప్పాడు. దీంతో ఎమోషనల్ గా బాగా జనాలకు కనెక్ట్ అయ్యింది. ఇది కేవలం ఆ తరహా ప్రచారం కోసం తెరపైకి తెచ్చిన పాయింట్. సుకుమార్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్ లో గూస్ బంప్స్ కలిగించే మూమెంట్స్ ఉన్నాయి. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. పుష్ప పార్ట్ 1 వరల్డ్ వైడ్ రూ. 360 కోట్లు రాబట్టింది. పార్ట్ 2 తో వెయ్యి కోట్లు కొల్లగొట్టాలనేది మేకర్స్ ప్లాన్ గా తెలుస్తుంది. పుష్ప 2 టీజర్ కి హిందీలో భారీ రెస్పాన్స్ దక్కడం విశేషం.