Telangana Congress: ఉచితంపై అనుచితం.. కాంగ్రెస్ ను ఆత్మ రక్షణలో పడేసిందా?
తానా మహాసభల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో అంతరార్ధాన్ని గుర్తించని పార్టీ సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ” రేవంత్ రెడ్డి ఒక్కడిదే కాంగ్రెస్ పార్టీ కాదు.

Telangana Congress: కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది. అధికార భారత రాష్ట్ర సమితిలో నుంచి కీలక ప్రజా ప్రతినిధులు చేరడంతో అధికారంలోకి వస్తామని ఆశలు పెంచుకుంది. ఖమ్మం ప్రజాగర్జన సభ ద్వారా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే బలమైన నాయకుడిని చేర్చుకుంది. రాహుల్ గాంధీతో తెలంగాణకు ఏం చేయబోతున్నామో స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అన్నీ మంచి శకునములే అనుకుంటున్న తరుణంలో తానా మహాసభల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సీనియర్లు తలో మాట
తానా మహాసభల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో అంతరార్ధాన్ని గుర్తించని పార్టీ సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ” రేవంత్ రెడ్డి ఒక్కడిదే కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ హయాంలో 6 నుంచి 7 గంటల వరకే ఉచిత విద్యుత్ ఇచ్చాం. ప్రభుత్వం వాస్తవానికి 24 గంటల పాటు కరెంటు ఇవ్వడం లేదు. బాధ్యతగల ప్రతిపక్షంగా 24 గంటలపాటు కరెంటు ఇవ్వాలని కొట్లాడాలి. కానీ ఇదే సమయంలో సాగుకు ఉచిత విద్యుత్ వద్దు అనడం సరికాదు. టిడిపి నుంచి వచ్చిన వరకే కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు దక్కుతున్నాయి. దీనిపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానని” కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారు అనడం కలకలం రేపుతోంది. మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, దామోదర్ రాజ నరసింహ వంటి వారు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటం ఇక్కడ విశేషం. సరిగ్గా దీనినే భారత రాష్ట్ర సమితి తమకు అనుకూలంగా మలుచుకుంది. తమ సొంత పార్టీ మీడియాలో వార్తలు రాయిస్తోంది. దీంతో సహజంగానే ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చుతుందని తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉచిత విద్యుత్ గురించి ఎందుకు మాట్లాడాలి?
వాస్తవానికి విద్యుత్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడకపోయి ఉంటేనే బాగుండేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింది తమ ప్రభుత్వం అయినప్పటికీ.. 24 గంటల పాటు కరెంటు ఇవ్వడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే పార్టీకి లాభసాటిగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ” విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అనేక అక్రమాలు జరుగుతున్నాయి. స్థాపిత సామర్థ్యం పెరగకపోవడం వల్ల విద్యుత్ డిస్కంలు మునిగిపోతున్నాయి. ఈ విషయాన్ని బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి రేజ్ చేస్తే బాగుండేది. అనవసరంగా ఉచిత విద్యుత్ గురించి మాట్లాడారు” అని ఆయన వర్గానికి చెందిన కొంతమంది నాయకులు అంతర్గత సంభాషణలో పేర్కొన్నారు. కాగా రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని మరి కొంతమంది అంటున్నారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ పేరుతో విద్యుత్ రంగ సంస్థలను అప్పుల్లోకి నెట్టేసిందని, ఇది సరైన పద్ధతి కాదంటూ రేవంత్ రెడ్డి చెప్పారని..కానీ దానికి వక్ర భాష్యం చెబుతూ ప్రజలను గందరగోళ పరిస్థితుల్లోకి భారత రాష్ట్ర సమితి నెట్టేస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
