South heroines in Bollywood : కొన్నాళ్లుగా బాలీవుడ్ లో సౌత్ ఇండియా చిత్రాలు విపరీతంగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. బాహుబలి చిత్రాల అనంతరం ప్రభాస్ నటించిన సాహో మంచి విజయాన్ని నమోదు చేసింది. పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కెజిఫ్ 2, కార్తికేయ 2, కాంతార ఇలా పలు చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దున్నేశాయి. లోకల్ స్టార్స్ మాత్రం ఒక్క హిట్ అంటూ అల్లాడిపోతున్నారు. 2022 బాలీవుడ్ కి చుక్కలు చూపించింది. బడా బడా హీరోలు కూడా తిరగబడిపోయారు. డిజాస్టర్స్ తో బెంబేలెత్తారు. అదే సమయంలో సౌత్ ఇండియా సినిమాల కోసం ప్రేక్షకులు ఎగబడ్డారు.
ఇక సౌత్ సినిమాలే కాకుండా హీరోయిన్స్ కూడా బాలీవుడ్ మీదకు దండెత్తుతున్నారు. ఏకంగా ఐదుగురు సౌత్ ఇండియా భామలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ లిస్ట్ లో ముందుగా రష్మిక మందాన గురించి చెప్పుకోవాలి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆమెకు మార్కెట్ ఉంది. అయినా బాలీవుడ్ లో ఎదగాలని ఆశపడుతున్నారు. రష్మిక నటించిన గుడ్ బై, మిషన్ మజ్ను చిత్రాలు ఈ మధ్య కాలంలో విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఉంది. రన్బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు.
మరో స్టార్ లేడీ పూజా హెగ్డే నార్త్ లో సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం సల్లూ భాయ్ కి జంటగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీలో నటిస్తుంది. ఇది తమిళ హిట్ మూవీ వీరం రీమేక్. రంజాన్ కానుకగా విడుదల కానుంది. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో వెంకటేష్ కీలక రోల్ చేయడం విశేషం. ఆయన పూజా హెగ్డే బ్రదర్ గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో సౌత్ రీమేక్ భోళా. కార్తీ నటించిన ఖైదీ చిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
భోళా మూవీలో అజయ్ దేవ్ గణ్ కి జంటగా అమలా పాల్ నటిస్తున్నారు. ఇక తెలుగులో జోరు తగ్గిన రాశి ఖన్నా కూడా బాలీవుడ్ లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఆమె సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రంలో నటిస్తున్నారు. యోధ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. యోధ మూవీలో దిశ పటాని మరొక హీరోయిన్. అలాగే సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార షారుక్ తో జతకడుతున్నారు. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయంలో తెలిసిందే. ప్రియమణి సైతం ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఇలా మొత్తం ఐదుగురు సౌత్ స్టార్స్ బాలీవుడ్ భారీ చిత్రాల్లో నటిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు.