AP – BJP : ఏపీకి క్యూకడుతున్న బీజేపీ అగ్రనేతలు.. పొత్తులపై ఫిక్స్
తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎలా శత్రువుగా ప్రకటించారో అలా ప్రకటించి. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే..అప్పుడు రాష్ట్ర నేతలు.. ఏదో విధంగా అందుకుంటారు. కఠిన చర్యలకు ఉపక్రమిస్తే కానీ.. ఇటువంటి పర్యటనలను అగ్రనేతలు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు.

AP – BJP : ఏపీ విషయంలో బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. తనతో బహిరంగంగా నడిచేందుకు సిద్ధంగా ఉన్నవారితో కలవాలా? లేకుంటే ఇన్నాళ్లు రహస్య మిత్రుడిగా భావిస్తున్న వైసీపీతోనా అన్న డైలమాలో ఉంది. ఎన్నికలకు ఏడాది వ్యవధి ఉండడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఏపీకి బీజేపీ అగ్రనేతలు క్యూకడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. 8న విశాఖకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తిరుపతి రానున్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా రాష్ట్ర నాయకత్వం అభిప్రాయం వినేందుకేనన్న చర్చ ప్రారంభమైంది.
టీడీపీ, జనసేనల మధ్య దాదాపు పొత్తు కుదిరినట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పుడు బీజేపీ పాత్ర ఏమిటన్నది ప్రశ్న. ఓట్లపరంగా కాకున్నా కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీ సాయం అన్ని పార్టీలకు అనివార్యంగా మారింది. తప్పకుండా బీజేపీ తమతో కలిసి వస్తుందని చంద్రబాబు, పవన్ ఆశతో ఉన్నారు. కానీ ఢిల్లీ సంకేతాలు వేరేలా ఉన్నాయి. అటు వైసీపీ సర్కారుకు అన్నివిధాలా కేంద్రం సాయం చేస్తోంది. సరిగ్గా ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు ఎప్పుడో చంద్రబాబు హయాం నాటి రెవెన్యూ లోటు రూ.10,400 కోట్ల నగదును బదిలీ చేసింది. ఈ తరుణంలో కేంద్రం జగన్ వైపే అన్న సిగ్నల్స్ వచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వపరంగా సాయం చేసిందే తప్ప.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర నాయకులు కొందరు చెబుతున్నారు.
ఇప్పుడు అగ్రనాయకులు రాష్ట్రానికి వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ బలోపేతం చర్యల్లో భాగంగానే వస్తున్నారని తెలుస్తోంది. ఏపీ బీజేపీ ఎదగలేకపోవడానికి రాష్ట్ర నాయకులే కారణం కాదు.. కేంద్ర నాయకత్వం కూడా. కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం.. ఏపీలో ప్రాంతీయ పార్టీలతో పరోక్షంగా అయినా సన్నిహిత సంబంధాలు కొనసాగించడం వల్ల సమస్యలు వస్తున్నాయి. కొన్ని సార్లు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం.. కొన్ని సార్లు వైసీపీ లాంటి పార్టీలతో అంతర్గత అవగాహనతో పోరాటాలు చేయకుండా ఉండటంతో సమస్య జఠిలమవుతోంది. బీజేపీ మోదీ, షాల చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో బలహీనంగా ఉన్న చోట్ల బలోపేతం చేసుకున్నారు. కానీ ఏపీలో అది కూడా సాధ్యం కాలేదు.
ఏపీలో బీజేపీ దుస్థితికి ప్రాంతీయ పార్టీల వ్యూహం కూడా కారణమే. రెండు పార్టీలు బీజేపీతో ఢిల్లీ స్థాయిలో స్నేహంగా ఉంటాయి. నిజానికి ఏపీ బీజేపీ నేతలు కొంత కాలంగా పోరాడుతున్నారు. ఏపీ బీజేపీ పోరాడుతున్నా.. అంతా లైట్ తీసుకోవడానికి కారణం… ఏపీలోని కొంత మంది నేతల తీరు మాత్రమే కాదు.. కేంద్రం కూడా ప్రధాన కారణమే. బీజేపీకి వైసీపీ వ్యతిరేకమని ప్రజలు ఎలా అనుకుంటారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎలా శత్రువుగా ప్రకటించారో అలా ప్రకటించి. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే..అప్పుడు రాష్ట్ర నేతలు.. ఏదో విధంగా అందుకుంటారు. కఠిన చర్యలకు ఉపక్రమిస్తే కానీ.. ఇటువంటి పర్యటనలను అగ్రనేతలు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు.
