Producers: ఇది తెలుగువారు గర్వంగా చూడాల్సిన సినిమా అంటూ.. తమ సినిమా గురించి సాలిడ్ ప్రమోషన్స్ చేసుకున్నా.. పెద్ద పెద్ద సినిమాలనే జనం పట్టించుకోవడం లేదు. ఇక అంతంతమాత్రం చేసే ప్రమోషన్స్ నడుమ ఒక చిన్న సినిమా విడుదల అయ్యి హిట్ అవ్వడం అంటే… అది కుదిరే పని కాదు. అందుకే, సినిమా ఎలా ఉన్నా.. సినిమా వాళ్ళు తమ సినిమాను గ్రాండ్ గా, అవసరం అయితే.. కాస్త ఓవర్ బిల్డప్ ఇచ్చి అయినా సరే.. సినిమాకి ఫుల్ పబ్లిసిటీ చేసుకుంటారు.
ఒక్కోసారి ఈ పబ్లిసిటీనే సినిమాని కాపాడుతుంది. ఏవరేజ్ గా ఉన్న సినిమాను హిట్ వరకు తీసుకువెళ్తుంది. అయితే, చిన్న సినిమాని ఎంతగా ప్రమోట్ చేసినా జనంలో వెళ్ళాలి అంటే.. బలమైన వ్యక్తి సపోర్ట్ కావాలి. లేదా ఒక బ్రాండ్ వాల్యూ ఉన్న స్టార్ సాయం కావాలి. అందుకే ఒక చిన్న సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లే క్రమంలో చిన్న సినిమా మేకర్స్ ఎవరో ఒక స్టార్ ను పట్టుకుంటారు. వారి చేత తమ సినిమాను ప్రమోట్ చేయించుకుంటారు.
చిన్న సినిమాలకే కాదు, మీడియం రేంజ్ సినిమాలకు ఇది బాగా వర్తిస్తుంది. తాజాగా సితార ఎంటర్టైన్ మెంట్స్ తమ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ -రానా లతో భీమ్లా నాయక్ చేస్తోంది. అదే సమయంలో నాగ శౌర్య హీరోగా ‘వరుడు కావలెను’ అనే చిన్న చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. అయితే, ఈ సినిమా ఈవెంట్ కి తమ బ్యానర్ లో సినిమా చేస్తున్న రానా ని గెస్ట్ గా పిలిచి, రానా చేత నాలుగు మంచి మాటలు మాట్లాడించి సినిమాను బాగా ప్రమోట్ చేసుకున్నారు.
అలాగే పూజా హెగ్డేను కూడా సితారా సంస్థ తమ సినిమా ప్రమోషన్స్ కు వాడుకుంది. పూజాతో సితార ‘అరవింద సమేత’ , ‘అల వైకుంఠ పురములో’ సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. ఆ పరిచయంతోనే పూజా ‘వరుడు కావలెను’ కు గెస్ట్ గా మారింది. ఇక పూరి తన కొడుకు ఆకాష్ తో ‘రొమాంటిక్ ‘ సినిమా నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండని బరిలోకి దింపి సినిమాను జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు పూరి. మొత్తానికి నిర్మాతలు తెలివిగా స్టార్లను వాడుకుంటూ తమ సినిమాలను బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి ప్రమోషన్స్ కి ఇటు సితార సంస్థ గాని, అటు పూరి గాని ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. కానీ కాలం మారింది కదా, అందుకే వీళ్లు కూడా మారినట్టు ఉన్నారు.