Padayatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశమొత్తం పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలో బండి సంజయ్, వైయస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్రలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో త్వరలో లోకేష్ కూడా పాదయాత్ర చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తెలుగు నాట పాదయాత్రల ట్రెండ్ ఇప్పటిది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేశారు.. వాస్తవానికి ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల నాయకులు పాదయాత్రలు చేయడం పరిపాటిగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అప్పటి కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఫలితంగా వరుసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత ఇప్పటి దాకా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు.. 2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు.

Padayatra
పూర్వకాలం నుంచి
పాదయాత్రలు మన దేశానికి కొత్త కాదు.. పూర్వకాలం నుంచే ఇవి ఆచరణలో ఉన్నాయి. గౌతమ బుద్ధుడు సర్వం త్యజించి పాదయాత్ర ద్వారా అడవుల బాట పట్టాడు. కోరికలే అన్ని దు: ఖాలకు మూలమని చాటి చెప్పాడు. శ్రీరాముడు కూడా తండ్రి మాట జవ దాటకుండా అడవులకు వెళ్లాడు. అక్కడ కూడా ఆయన పాదయాత్రనే ఎంచుకున్నారు. ఆ తర్వాత తన రాజ్యానికి వెళ్ళి మరింత మెరుగ్గా పాలన చేశాడు. అడవుల్లో ఉన్నప్పుడు రాముడు నేరుగా ప్రజల్లో కలిసిపోయాడు. వారి సమస్యలు విన్నాడు. ఆ తర్వాత వాటి పరిష్కార మార్గాలను ఆచరణలో పెట్టాడు. అందుకే రామ రాజ్యం అనే నానుడి పుట్టింది.
నాయకులకు ఎందుకు ఈ యాత్ర
పాదయాత్ర వల్ల ప్రజలను నేరుగా కలుసుకోవచ్చు.. వారి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు. రాజకీయ నాయకుల చుట్టూ ఉండే వారి వల్ల సరైన ఫీడ్ బ్యాక్ రాదు. దీనివల్ల వారు అధికారానికి దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. చుట్టూ ఉండే వారు అబద్ధాలు చెప్పడం వల్ల ఎంతోమంది ముఖ్యమంత్రులు అధికారం కోల్పోయారు. ఇందిరా గాంధీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. గతంలో పాదయాత్ర చేపట్టిన వైయస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దక్కించుకున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులకు నాలెడ్జ్ ఆఫ్ సోర్స్ పత్రికలు, న్యూస్ చానల్స్, సోషల్ మీడియా.. అయితే వీటిల్లో వచ్చే సమాచారం అంత నిస్పక్షపాతంగా ఉండదు. పైగా మీడియా అనేది సొంత డబ్బా కొట్టుకునేందుకు ఒక వస్తువుగా మారిపోయిన నేపథ్యంలో ఎవరూ అంత సులభంగా విశ్వసించే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో నాయకులు ప్రజలను నేరుగా కలవాలి కాబట్టి.. అందుకు పాదయాత్రలను ముఖ్యమైన మార్గంగా ఎంచుకుంటున్నారు.

chandrababu
ప్రభుత్వాన్ని నిలదీసే యత్నం
ఇటీవల వైఎస్ షర్మిల పాదయాత్ర ను టిఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. గతంలో బండి సంజయ్ పాద యాత్ర కు అడ్డంకులు కల్పించారు.. అయితే ఇలాంటి ఘటన వల్ల వారి వారి వ్యక్తిగత మైలేజ్ పెరిగింది.. పైగా వారు నేరుగా ప్రజలను కలుసుకుంటూ సమస్యలను వింటున్నారు. దీని వల్ల క్షేత్రస్థాయి పరిస్థితులు వారికి అవగతమయ్యే అవకాశాలు ఉంటాయి.. అయితే గతంలో పాదయాత్ర చేసిన నాయకులు.. ఎంతోకొంత ప్రజలకు మేలు చేసే పథకాలకు రూపకల్పన చేసినప్పటికీ.. అది పూర్తిస్థాయిలో మాత్రం కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే పాదయాత్ర చేసే నాయకులు.. అధికారం దక్కిన తర్వాత సామాన్య మానవులకు చిక్కరు. దొరకరు అనే అపవాదు ఉంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న పాదయాత్రను అధికార పార్టీ నాయకులు కార్నర్ చేస్తూ ఉంటారు.. తాము చేసిన అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులకు కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు.. ఏతా వాతా చెప్పేది ఏంటంటే. అధికారంలో ఉన్నవారు పీఠాన్ని వదులుకునేందుకు ఇష్టపడరు. ప్రతిపక్షంలో ఉన్నవారు పీఠాన్ని దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతుంటారు.. కానీ ఇందులో పాదయాత్ర అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ. రాజకీయ నాయకుల భాషలో చెప్పాలంటే అధికారాన్ని దక్కించుకునేందుకు ఓటర్లకు వేసే గాలం లాంటిది.