Tirumala : శ్రీవారి ఆలయంలో అపచారం.. ఏం జరుగనుంది
వాస్తవంగా శ్రీవారి హుండీలను భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. మొక్కుబడులు చెల్లించుకుంటారు. అటువంటి హుండీ నుంచి కానుకలు పడిపోవడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

Tirumala : ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న పరిణామాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కొన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇటీవల పెంపుడు కుక్కతో భక్తులు తిరుమల కొండపై చేరుకున్నారు. అలిపిరి చెక్ పోస్టు వద్ద భద్రతా సిబ్బంది ఏమరపాటుగా ఉండడంతో కర్నాటకకు చెందిన భక్తులు కొండపై పెంపుడు కుక్కను తీసుకెళ్లారు. ఆ ఘటన మరువక ముందే ఏకంగా శ్రీవారి కానుకల హుండి ఒకటి కిందకు పడిపోయింది. దీంతో భక్తులు వేసిన కానుకలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ హఠాత్ పరిణామంతో భద్రతా సిబ్బంది అలెర్టయ్యారు. కానుకలను సరిచేసి హుండీలో వేసి తరలించారు.
ఆలయ ముఖద్వారం దగ్గర హుండీ జారి కింద పడిపోయింది. శ్రీవారి హుండీని ఆలయం నుంచి పరకామణి మండపానికి తరలిస్తున్న సమయంలో మహాద్వారం దగ్గర హుండీ కిందపడింది. ఆ సమయంలో హుండీలో నుంచి కానుకలు కిందపడ్డాయి. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కానుకలను జాగ్రత్తగా తిరిగి ట్రాలీలోకి ఎక్కించారు. అక్కడి నుంచి లారీ పరాకామణి మండపానికి వెళ్లింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే హుండీ కింద పడి పోయినట్లు టీటీడీ అధికారులు భావిస్తున్నారు. దీనిపై చర్యలకు ఉపక్రమించనున్నట్టు తెలుస్తోంది.
శ్రీవారి ఆయంలో హుండీలు ఏర్పాటుచేశారు. భక్తులు వేసే కానుకలతో నిండిపోయిన తరువాత వాటిని జాగ్రత్తగా ఆయం వెలుపలకు తీసుకొస్తారు. లారీలో లోడ్ చేసి పరకామణికి తీసుకెళతారు. ఇలా తీసుకెళ్లి లారీలో లోడ్ చేస్తున్నప్పుడే హుండీ కిందపడినట్టు తెలుస్తోంది. హుండీని బయటకు బాగానే తీసుకొచ్చారు. కానీ లోడింగ్ చేసే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. వాస్తవంగా శ్రీవారి హుండీలను భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. మొక్కుబడులు చెల్లించుకుంటారు. అటువంటి హుండీ నుంచి కానుకలు పడిపోవడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
