India vs Australia: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. భారత్ వేదికగా జరిగే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. విశ్వ విజేతగా నిలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దీంతో పోరు హోరాహోరీగా జరుగడం ఖాయం. అయితే భారత జట్టు బలంగా కనిపిస్తున్నా.. కొన్ని బలహీనతలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని అధిగమిస్తే సొంత గడ్డపై జరిగే టోర్నీలో భారత్ విశ్వ విజేతగా నిలవడం ఖాయం. గతంలో భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ల రికార్డు చూస్తే ఇండికా కాస్త వెనుకబడే ఉంది. అయితే బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ మాత్రం టీం ఇండియా గెలవడం 1996–97 నుంచి మొదలైంది. ఈ సిరీస్‌ను ఇప్పటి వరకు ఇండియా పదిసార్లు గెలుచుకోగా, ఆస్ట్రేలియా ఐదుసార్లే గెలిచింది. ఇండియన్ క్రికెటర్లు మాత్రం కొన్ని మ్యాచ్‌లలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియాలోనూ కొన్ని అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలతో చరిత్ర సృష్టించారు. ఇందులో గబ్బాలో టీం ఇండియా సాధించిన విజయం చారిత్రాత్మకం. గురువారం నుంచి నాగ్‌పూర్‌లో జరగనున్న తొలి టెస్టుతో ఐకానిక్ సిరీస్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. యుద్ధానికి ఇంకా కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్ ఆడిన భారత ఆటగాళ్లు, వారు చేసిన ఐదు మరపురాని టెస్ట్ ఇన్నింగ్ గురించి తెలుసుకుందాం.

India vs Australia
– వీవీఎస్.లక్ష్మణ్ – కోల్‌కతాలో 281
వీవీఎస్ లక్ష్మణ్, భారతదేశం యొక్క ఆల్ టైమ్ టాప్ టెస్ట్ ప్లేయర్లలో ఒకరు. 2001 కోల్‌కతా టెస్ట్‌లో ఆయన ఆడిన ఇన్నింగ్స్ ఆయనను గ్రేట్ క్రికెటర్‌గా నిలిపింది. కోల్‌కతా ప్రేక్షకుల ముందు అతను అద్భుతంగా 281 పరుగులు చేశాడు. భారత్ దాదాపు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోతున్న సమయంలో లక్ష్మణ్ మొత్తం బాధ్యతను తనపై వేసుకున్నాడు. 452 బంతులు ఎదుర్కొని 281 పరుగులు చేశాడు. గడ్డు పరిస్థితి నుంచి భారత్‌ను గట్టెక్కించడమే కాకుండా విజేతగా నిలిపాడు. రాహుల్ ద్రవిడ్‌తో కలిసి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు.

VVS Laxman
-రాహుల్ ద్రవిడ్ – కోల్‌కతాలో 180
కోల్‌కతాలో జరిగిన పోరులో స్టైలిష్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి రాహుల్ ద్రావిడ్ ఆడిన ఇన్నింగ్ ఆయన కెరీర్‌లో మరుపురానిది. స్వదేశంలో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ఓటమి అంచున ఉండగా వీవీఎస్.లక్ష్మణ్(281)తో కలిసి ద్రవిడ్ వీరోచిత పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో 180 పరుగులు చేసి భారత జట్టును ఓటమి నుంచి విజయ తీరానికి చేర్చాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయగా, భారత జట్టు కేవలం 171 పరుగులకే ఆలౌటైంది. ఈ సమయంలో లక్ష్మణ్, ద్రవిడ్ మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఇందులో ద్రవిడ్ 363 బంతులు ఎదుర్కొని 180 పరుగులు చేశాడు. ఇందులో 20 బౌండరీలు ఉన్నాయి.

Rahul Dravid
-సచిన్ టెండూల్కర్ – సిడ్నీలో 241
క్రికెట్ దేవుడు అని అభిమానులు ముద్దుగా పిలవబడే సచిన్ టెండూల్కర్ 1989 నుంచి రిటైర్ అయ్యే వరకు ఆయన ఆడిన ఆటలే ఆయనకు ఆ Mీ ర్తి తెచ్చాయి. తన కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడి భారత జట్టుకు విజయాలు అందించారు. అయితే 2003–04లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా సిడ్నీలో సచిన్ ఆడిన ఇన్నింగ్ బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటి. ఈ మ్యాచ్‌లో సచిన్ 241 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో అడిలైడ్‌లో ద్రవిడ్(233) ఆట తీరుతో గెలిచిన టీం ఇండియా, మెల్‌బోర్న్ మ్యాచ్‌లో ఓడిపోయింది. సిరీస్ స్థాయి 1–1తో సమంగా ఉన్న సమయంలో సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్‌లో సచిన్ తన సొగసరి ఇన్నింగ్స్‌తో టీం ఇండియాను గెలిపించారు. అతను 33 అద్భుతమైన షాట్లతో 241 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియన్లందరినీ నిరాశపరిచిన భారత జట్టు 700 పైగా భారీ స్కోరు చేసింది. ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది, ఆ తర్వాత భారత్ 211 పరుగులు చేసింది. కంగారూలు తమ చివరి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 357 పరుగులు చేయడంతో గేమ్ డ్రాగా ముగిసింది.

Sachin Tendulkar
-రాహుల్ ద్రవిడ్ – అడిలైడ్‌లో 233
ఇక టెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు ఉన్న రాహుల ద్రవిడ్ ఆడిన మరో ఇన్నింగ్స్ కూడా అతని కెరీర్‌లో, భారత జట్టు చిరస్మరణీయ విజయాల్లో ఒకటిగా నిలిచింది. 2003–04లో అడిలైడ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ద్రవిడ్ 233 పరుగులు చేసి భారత్‌కు ఆల్‌టైమ్ అత్యుత్తమ విజయాన్ని అందించాడు. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రికీపాంటింగ్ చేసిన డబుల్ సెంచరీలో మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోరు సాధించింది. మరోవైపు రాహుల్ ద్రవిడ్ చేసిన 233 పరుగుల చక్కటి ఇన్నింగ్స్‌తో భారత్ 523 పరుగులతో ధీటుగా బదులిచ్చింది. ద్రవిడ్ 446 బంతుల్లో 23 బౌండరీలతో 233 పరుగులు చేశాడు.

Rahul Dravid
-అజింక్యా రహానే – మెల్‌బోర్న్‌లో 112
టీం ఇండియా అత్యంత సొగసైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన అజింక్యా రహానే 2020–21లో జట్టుకు అద్భుతమైన విజయం అందించాడు. అడిలైడ్‌లో 0–1తో భారత జట్టు వెనుకబడింది. మెల్‌బోర్న్ టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ గాయపడ్డారు. ఇలాంటి సమయంలో అజింక్య రహానే జట్టును గెలిపించే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను బౌలర్లు 195 పరుగులకు కట్టడి చేశారు. తర్వాత భారత జట్టు రహానే సొగసరి ఇన్నింగ్స్‌తో 112 పరుగులు చేయడం ద్వారా భారత జట్టు 326 పరుగులు చేసి భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కేవలం 200 పరుగులకే ఆలౌటైంది, చివరి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 70 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను 1–1తో సమం చేసింది. దీంతో రహానే ఇన్నింగ్స్ చిరస్మరణీయంగా నిలిచింది.

Ajinkya Rahane
*తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా ఈ ఐదుగురు పాత ప్లేయర్ల రికార్డులను ఎవరు బద్దలు కొడుతారు?. ఇప్పుడున్న కొత్త ప్లేయర్లు ఎలాంటి రికార్డులు సృష్టిస్తారన్నది వేచిచూడాలి. మొత్తానికి ఇండియాలో ఇండియాను కొట్టడం అన్నది ఆస్ట్రేలియాకు అంత ఈజీకాదు. అలా అని వాళ్లను తక్కువగా తీసేయడానికి లేదు. సో ఈ సమఉజ్జీల భీకరపోరును ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేయడమే మిగిలింది.*