Pawan Kalyan- PM Modi: ఏపీలో ప్రధాని మోదీ పర్యటన రకరకాల రాజకీయ సమీకరణలకు, చర్చలకు దారితీసింది. అల్లూరి విగ్రహావిష్కరణ విషయంలో జరిగిన రాజకీయాలు అన్నీఇన్నీ కావు. వైసీపీకి ఇష్టం లేని వారిని పక్కన పెట్టారని ప్రచారం సాగింది. జగన్ కు కేంద్ర ప్రభుత్వం లొంగిపోయిందని.. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆహ్వానితుల జాబితాను మార్చేశారని కూడా వార్తలు వెలువడ్డాయి. ప్రధాన ప్రతిపక్ష టీడీపీకి పిలిచినట్టే పిలిచి అవమానించారని.. లోకల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజును సైతం పక్కనపెట్టారని.. అంతకంటే ఎక్కువగా బీజేపీ మిత్రపక్షమైన జనసేనకు దారుణ అవమానం జరిగిందని కూడా వ్యాఖ్యలు వినిపించాయి. బీజేపీ, జనసేనల మధ్య అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు ప్రధాని పర్యటనతో పూర్తి తెగతెంపులు కావడం ఖాయమని కూడా ఎక్కువ మంది నమ్మకంగా చెబుతూ వచ్చారు. అయితే అవన్నీ ఒట్టి పుకార్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చిపారేశారు.

Pawan Kalyan- PM Modi
జనసేనతో కలిసే..
జనసేన తమకు ఇప్పటికీ మిత్రపక్షమేనని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి వెళతామని సోము ప్రకటించారు. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం రాజకీయాలకతీతమని.. అందుకే ఏ వర్గానికి కానీ.. ఏ నాయకుడికి కానీ ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగినందునే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కార్యక్రమాన్ని జరిపించారని.. ఇందులో అసలు రాజకీయమే లేదని తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే ముందడుగు వేస్తాయని.. ఇందులో వేరే ఆలోచనేమీ లేదని కొట్టిపారేశారు. ఏపీలో మోదీ పర్యటన సక్సెస్ అయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చిందన్నారు. తటస్థులు సైతం మొగ్గుచూపేలా ప్రధాని పర్యటన సాగిందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.
Also Read: CM KCR- Gurukul Schools: గురుకులాలపై కేసీఆర్ సంచలన నిర్ణయం
బీజేపీయే ప్రత్యామ్నాయం..
రాష్ట్రంలో బీజేపీ బలోపేతమవుతోందని.. 2024 ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం ఖాయమన్నారు. పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారమే అజెండాగా బీజేపీ కార్యక్రమాల ప్రణాళికను రూపొందించినట్టు తెలిపారు. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో పెండింగ్ ప్రాజెక్టులను సందర్శించినట్టు తెలిపారు. నిర్వాసితుల సమస్యలపై అధ్యయనం చేసినట్టు చెప్పారు. అలాగే ఏపీలో బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుంచి 15 వరకూ యువ సంఘర్షణ యాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నిరుద్యోగ యువతను వైసీపీ సర్కారు దారుణంగా వంచించిందన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులు భర్తీ చేస్తానని సీఎం జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఆ సంగతే మరిచిపోయారన్నారు. కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయం కూడా మరిచిపోయారని ఎద్దేవా చేశారు. వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం గుర్తుకు తెచ్చేలా యువసంఘర్షణ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా చేపట్టనున్నట్టు తెలిపారు. విద్యార్థి సంఘాల భాగస్వామ్యంతో చేపట్టే కార్యక్రమాలతో ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు.

Pawan Kalyan- PM Modi
జగన్ తీరుతో నష్టం..
వైసీపీ ప్రభుత్వ చర్యలతో అన్నివర్గాల ప్రజలు దారుణంగా వంచనకు గురయ్యారని సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉచిత రేషన్ బియ్యం అందుతున్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం మొండి చేయి చూపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో నిరుపేద రేషన్ లబ్దిదారులు నష్టపోయారన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ద్రుష్టకి తీసుకెళ్లామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడతామన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రేషన్ పంపిణీని పునరుద్ధరించే బాధ్యత తీసుకుంటామన్నారు. తాము వైసీపీకి దగ్గరవుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కుటుంబపాలనకు బీజేపీ వ్యతిరేకమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేందుకు జనసేనతో కలిసి పోటీ చేస్తామన్నారు., ఇందులో వేరే ఆలోచనంటూ ఏమీ లేదని సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు.
Also Read:Revanth Reddy: కాంగ్రెస్ లో చేరే వారికి టికెట్ల హామీ ఇవ్వడం లేదట.. రేవంత్ సంచలనం