Jagan- YCP MLAs: పిల్లిని భయపెట్టొచ్చు కానీ.. గదిలో బంధిస్తే పులిగా మారిపోతుందంటారు. తన ఆత్మరక్షణకు తిరగబడుతుందంటారు. ఇప్పుడు ఏపీలో కూడా అటువంటి సీన్లే రిపీట్ అవుతున్నాయి. ఇన్నాళ్లూ వినయ విధేయతలు, భక్తి చాటుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. హైకమాండ్ కు ఎదురుతిరుగుతున్నారు. బయటకు వచ్చి దండయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు. మున్ముందు ఈ ధిక్కార స్వరాలు పదుల సంఖ్యలో ఉండవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నెలలు కరిగి ఎన్నికలు సమీపించేసరికి ఈ జాబితా అమాంతం పెరిగిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితికి ముమ్మాటికీ కారణం మాత్రం సీఎం జగనే. ఆయన ఏరికోరి తెచ్చుకుంటున్నారు ఈ బాధలు. తనను అభిమానించే వారిని అనుమానించి దూరం చేసుకుంటున్నారు.

Jagan- YCP MLAs
సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ పెద్దలుగా చెప్పుకునే ‘ఆ నలుగురు’పై పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఇటువంటి బాధితుల్లో మంత్రులు కూడా ఉండడం విశేషం. పేరుకే మంత్రి పదవి కానీ.. పవర్ ఉండదు.. ఫండ్స్ లేవన్నది బహిరంగ రహస్యం. పైగా తమ బొమ్మతో, తమ అండతో గెలిచారన్న చులకన భావం, కట్టుబానిసల్లా చూడడం ఈ పరిస్థితికి కారణమని విశ్లేషణలు ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ ను సీఎం చేయడమే జెండా, అజెండాగా మార్చుకున్న ఎంతోమందికి అధికారంలోకి వచ్చాక రిక్తహస్తమే ఎదురైంది. రాజకీయాల్లో పరస్పర ప్రయోజనాలు తప్ప మరేమీ ఉండవు. ఇతర అంశాలు ఎక్కువ కాలం మనబోవు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేలు తమకు ఎక్కడ మేలు జరుగుతుందో అక్కడకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. పార్టీ నుంచి బయటపడుతున్నారు.
జగన్ సర్కారులో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయిందన్నది వాస్తవం. చివరకు వలంటీర్లకు ఉన్న ప్రాధాన్యం కూడా లేకుండా పోయింది. పథకం రావాలన్నా.. తీసివేయాలన్నా వలంటీరుకే సర్వహక్కులు. వారిని ఎన్నికల రధసారధులుగా చూస్తున్న జగన్.. ఎమ్మెల్యేలను మాత్రం కట్టుబానిసల్లా.. ఉత్సవ విగ్రహాలుగా చేశారు. వలంటీరుకున్న గౌరవం తమకు లేకుండా పోయిందని ఎమ్మెల్యేలు మర్రోమన్నా పట్టించుకోలేదు. వలంటీర్లు తమకు లెక్కచేయడం లేదని ఫిర్యాదులిచ్చినా స్పందించలేదు. ఎమ్మెల్యే పదవిని వలంటీరు కంటే చులకన అన్న భావనకు ప్రజలు వచ్చే స్థితిని ఏరికోరి కల్పించారు. ఇది ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని రగిల్చింది.
151 మంది ఎమ్మెల్యేల కంటే 100 మంది ఉన్న ఐ ప్యాక్ బృందానికే విలువ. వారు చెప్పిందే నిజం.. చేసిందే కరెక్ట్ అన్నట్టు నాయకత్వం గుడ్డి నమ్మకం ఏర్పరచుకుంది. వారిచ్చే సర్వేలు, నివేదికలను టేబుల్ పై పెట్టుకొని ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు తలంటేస్తోంది. మీరు మారుతారా? మార్చేయమంటారా? అని అడిగేసరికి ఎమ్మెల్యేల మనసు చిన్నబోతోంది. ఎన్నికల్లో తమకు సీటు ఇవ్వాలా? వద్దా? అన్నది ఐ ప్యాక్ టీమ్ డిసైడ్ చేయడం ఏమిటన్న బాధ సీనియర్ ఎమ్మెల్యేలను దహించేస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా.. ఏంచేయాలన్నా ఐప్యాక్ టీమ్ వాచ్ కూడా వారికి మింగుడుపడడం లేదు. గత ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఖర్చుచేశామని.. కనీసం చేసిన పనులకు బిల్లులు ఇప్పించుకోలేని స్టేజ్ లో ఉన్నామన్న ఆవేదన, నిర్వేదం ఎమ్మెల్యేల్లో గూడు కట్టుకొని ఉంది.

Jagan- YCP MLAs
సీఎం జగన్ ను కలవడం వైసీపీ ఎమ్మెల్యేలకు గగనంగా మారిపోయింది. మధ్య సజ్జల ఓకే అంటేనే కలవగలరు. లేకుంటే కష్టమే. ఎక్కడో సదస్సులు, సమావేశాల్లో దూరం నుంచి చూడడమే కానీ.. దగ్గరగా వెళ్లి మాట్లాడలేకపోతున్నామని.. తమ పరిస్థితి చెప్పలేకపోయామన్న ఎమ్మెల్యేల సంఖ్య కోకొల్లలు. పోనీ సజ్జలకు చెబుదామంటే తాము చెప్పింది జగన్ వరకూ పోనీయరు. ఎన్నో అన్వయించుకోని చెబుతుంటారు. తన అనుచరులు, కోటరీలకే ప్రాధాన్యిమస్తారు. సొంత వర్గాన్ని పెంచుకునే క్రమంలో హైకమాండ్ కు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ నకు సజ్జలే కారణమన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. అయినా హైకమాండ్ పట్టించుకోలేదు. జగన్ చేస్తున్న అతిపెద్ద తప్పు అదేనంటూ సీనియర్లు చెబుతున్నా సీఎంకు తలకెక్కడం లేదు.