Global Firepower Report 2023: శక్తివంతమైన సైన్యం కలిగి ఉన్న టాప్ టెన్ దేశాలు ఇవి.. భారత్ స్థానం ఎంతో తెలుసా?
గ్లోబల్ ఫైర్ పవర్ గతంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గత ఏడాది ఎనిమిదవ స్థానంలో ఉన్న యూకే ఈ ఏడాది ఐదవ స్థానానికి ఎగబాకింది. గత ఏడాది మాదిరిగానే దక్షిణ కొరియా ఆరవ స్థానంలో కొనసాగుతోంది.

Global Firepower Report 2023: మనం ఉండే ఇంటి చుట్టూ ఎన్నో భద్రతాపరమైన ఏర్పాట్లు చేసుకుంటాం. సీసీ కెమెరాలు, సోలార్ పెన్సింగ్, లేదా కరెంటు ఫెన్సింగ్, 24 గంటల పాటు కాపలా కాసే సెక్యూరిటీ వంటివి అదనంగా ఏర్పాటు చేసుకుంటాం. అదే ఒక దేశం విషయానికొస్తే సరిహద్దుల్లో సైనికులు కాపలాగా ఉంటారు. దీనినే అంతర్జాతీయ పరిభాషలో దేశ భద్రతా పరిరక్షణ అంటారు. దేశాలన్నీ ఒకే తీరుగా ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు. రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసినప్పటికీ కొన్ని దేశాల అధ్యక్షుల తీరు సామ్రాజ్యవాదాన్ని మించి ఉండడంతో.. అంతర్గత భద్రత పరిరక్షణ కోసం సైన్యాన్ని నియమించుకోవలసిన అని వార్య పరిస్థితి ఏర్పడు తోంది. ఒక దేశానికి సైన్యం అనేది తప్పనిసరే అయినప్పటికీ.. శత్రు దేశాల నుంచి ముప్పును ఎప్పటికప్పుడు తొలగించుకునేందుకు ఆ సైన్యాన్ని మరింత పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సైన్యం అంటే మనుషులను నియమించడంతోనే సరిపోదు. దానికి తగ్గట్టుగానే ఆయుధాలు, మందు గుండు సామగ్రి, యుద్ధ విమానాలు వంటివి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఒక అంచనా ప్రకారం అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు కేవలం రక్షణ రంగం కోసమే సింహభాగం బడ్జెట్ కేటాయిస్తున్నాయి. ఈ బడ్జెట్ తో ఆఫ్రికా అలాంటి దేశాలను దారిద్రరేఖ దిగువ నుంచి ఎగువకు మార్చొచ్చు. ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాలు ఉన్న దేశాలను ఒక్కసారి పరిశీలిస్తే..
గ్లోబల్ ఫైర్ పవర్ నివేదిక ప్రకారం..
ప్రపంచంలో రక్షణ రంగానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్లోబల్ ఫైర్ పవర్ అనే సంస్థ ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ప్రతి ఏడాది ఇది సర్వే నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా అది ఈ ప్రక్రియ నిర్వహించింది. అది వెల్లడించిన ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక సైనిక శక్తిగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు నిలిచాయి. దీని తర్వాత స్థానాల్లో చైనా, రష్యా, ఇండియా నిలిచాయి. గ్లోబల్ ఫైర్ పవర్ 145 దేశాలను తన సర్వేకు ఎంచుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశం రక్షణ రంగానికి ఎంత కేటాయిస్తున్నది? ఎంతమంది సైనికులను నియమించుకుంటున్నది? యుద్ధ విమానాల కోసం ఎంత ఖర్చు చేస్తోంది? అనే విషయాలపై సమగ్రంగా సర్వే చేసింది. సైనిక దళాలతో పాటు అత్యంత ఆధునికమైన యుద్ధ విమానాలు, పేలుడు సామాగ్రి అమెరికా సంయుక్త రాష్ట్రాల వద్ద ఉన్నాయి. ఇక తర్వాత రష్యా వద్ద సైనిక దళాలు, రక్షణ రంగానికి సంబంధించిన పేలుడు సామాగ్రి ఉన్నాయి.. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం మొదలు పెట్టక ముందు అమెరికాతో సరితూగేది. కానీ యుద్ధం వల్ల ఆ దేశం భారీగా సైనికులను కోల్పోయింది. పేలుడు సామగ్రిని కూడా వినియోగించింది. ఫలితంగా అది రెండవ స్థానంలో(దీనిపై అనుమానాలు ఉన్నాయి) నిలవాల్సి వచ్చింది. ఇక చైనా మూడవ స్థానంలో కొనసాగుతోంది. భారత్ నాలుగవ స్థానంలో, యునైటెడ్ కింగ్డమ్ ఐదవ స్థానంలో, దక్షిణ కొరియా ఆరవ స్థానంలో, పాకిస్తాన్ ఏడవ స్థానంలో, జపాన్ 8వ స్థానంలో, ఫ్రాన్స్ తొమ్మిదవ స్థానంలో, ఇటలీ పదవ స్థానంలో కొనసాగుతున్నాయి.
గతంలో ఇలా ఉండేది పరిస్థితి
గ్లోబల్ ఫైర్ పవర్ గతంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గత ఏడాది ఎనిమిదవ స్థానంలో ఉన్న యూకే ఈ ఏడాది ఐదవ స్థానానికి ఎగబాకింది. గత ఏడాది మాదిరిగానే దక్షిణ కొరియా ఆరవ స్థానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్ ఏడవ స్థానంలోకి కొనసాగుతోంది. జపాన్, ఫ్రాన్స్ గత ఏడాది 5, 7 స్థానాల్లో ఉండేవి. ఈ ఏడాది 8, 9 స్థానాలకు పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా రెండవ స్థానంలో ఉండటంపై గ్లోబల్ ఫైర్ పవర్ అనుమానం వ్యక్తం చేసింది. భారీ స్థాయిలో మందు గుండు సామాగ్రి, సైనికులను కోల్పోయిన ఆ దేశం రెండవ స్థానంలో కొనసాగడంపై ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
తక్కువ మిలిటరీ ఉన్న దేశాలు ఇవే..
ఇక గ్లోబల్ ఫైర్ పవర్ అత్యంత తక్కువ మిలటరీ ఉన్న దేశాల వివరాలు కూడా ప్రకటించింది. ఈ జాబితాలో భూటాన్ మొదటి స్థానంలో ఉంది. బెనిన్ రెండవ స్థానం, మోల్డోవా మూడవ స్థానం, సోమాలియా నాలుగవ స్థానం, లైబీరియా 5వ స్థానం, సూరి నామ్ ఆరవ స్థానం, బెలిజ్ ఏడవ స్థానం, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఎనిమిదవ స్థానం, ఐస్ లాండ్ తొమ్మిదవ స్థానం, సియర్రా లియోన్ పదో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ దేశాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో అవి సైన్యం కోసం తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయని గ్లోబల్ ఫైర్ పవర్ అభిప్రాయ పడింది. వరుస కరువు కాటకాలు ఆ దేశాల ఆర్థిక పరిస్థితులను చిన్నా భిన్నం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలు తలుచుకుంటే ఈ దేశాల ఆర్థిక పరిస్థితి మారుతుందని, కానీ ఆ దిశగా ఆ దేశాలు అడుగులు వేస్తాయా అనే సందేహాన్ని వెలిబుచ్చింది.
