IPL Top-5 final matches : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో టాప్-5 ఫైనల్ మ్యాచ్ లు ఇవే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత ఆసక్తిని కలిగించిన ఫైనల్ మ్యాచ్ ల్లో 2014లో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఒకటి. ఈ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది.

IPL Top-5 final matches : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాయి. ప్రస్తుతం 16వ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ల్లో టాప్ లో నిలిచిన ఐదు ఫైనల్ మ్యాచ్ ల గురించి సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ఐదు ఫైనల్ మ్యాచ్ లు ఏమిటో ఒకసారి చూసేద్దాం.
గత 16 సీజన్ లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. సాధారణంగా సీజన్ లో పెరుగుతున్న కొద్దీ ఏ టోర్నీ పట్ల అయినా ఆసక్తి తగ్గుతుంది. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పట్ల అభిమానుల క్రేజ్ ఏటా పెరుగుతోంది. అభిమానుల అంచనాలకు అనుగుణంగా నిర్వాహకులు మార్పులు చేస్తున్నారు. దీంతో అభిమానుల ఆశిస్తున్న అంచనాలను ఈ లీగ్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఐపీఎల్ మొత్తం జరిగేది ఒక ఎత్తు అయితే.. ఒక్క ఫైనల్ మ్యాచ్ మరో ఎత్తుగా అభిమానులు భావిస్తుంటారు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వేలాది మంది తరలివస్తుంటారు. ఫైనల్ మ్యాచ్ ను టీవీల్లో చూసే క్రికెట్ ప్రేమికుల సంఖ్య కోట్లలో ఉంది. ఇప్పటి వరకు 16 ఫైనల్ మ్యాచ్ లు జరగ్గా, వీటిలో ఐదు ఫైనల్ మ్యాచ్ లు అత్యంత ఆసక్తికరంగా సాగాయి. ఆ ఐదు ఫైనల్ మ్యాచ్లు గురించి అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
టాప్ ఫైవ్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లు ఇవే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత ఆసక్తిని కలిగించిన ఫైనల్ మ్యాచ్ ల్లో 2014లో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఒకటి. ఈ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో మనన్ వోహ్రా 52 బంతుల్లో 67 పరుగులు చేయగా, వృధ్ధిమాన్ సాహా 55 బంతుల్లో 115 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ జట్టు భారీగా పరుగులు చేసింది. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి లక్ష్యాన్ని చేదించింది. కేకేఆర్ జట్టులో మనీష్ పాండే 50 బంతుల్లో 94 పరుగులు చేయగా, యూసఫ్ పఠాన్ 22 బంతుల్లో 36 పరుగులు, గౌతమ్ గంభీర్ 17 బంతుల్లో 23 పరుగులు చేయడంతో జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అనూహ్యంగా పీయూష్ చావ్లా ఐదు బంతుల్లో 13 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మనీష్ పాండే ఎంపికయ్యాడు.
థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసిన హైదరాబాద్..
అత్యంత ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో 2016 లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒకటి. ఈ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. హైదారాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 69 పరుగులు, శిఖర్ ధావన్ 25 బంతుల్లో 28 పరుగులు, యువరాజ్ సింగ్ 23 బంతుల్లో 38 పరుగులు, బెన్ కటింగ్ 15 బంతుల్లో 39 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. 209 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులకు పరిమితం కావడంతో ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. బెంగళూరు జట్టులో క్రిస్ గేల్ 38 బంతుల్లో 76 పరుగులు, విరాట్ కోహ్లీ 35 పంతులు 54 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ ఆశించని స్థాయిలో రాణించలేకపోవడంతో ఎనిమిది పరుగులు తేడాతో బెంగళూరు జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో బెన్ కటింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎన్నికయ్యాడు.
ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన ముంబై జట్టు..
2017 లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. లో స్కోర్ నమోదైన ఈ మ్యాచ్ లో ముంబై జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రైజింగ్ పూణే సూపర్ గెయింట్ 128 పరుగులకు పరిమితం కావడంతో ముంబై జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టులో రోహిత్ శర్మ 22 బంతుల్లో 24 పరుగులు, క్రుణాల్ పాండ్యా 38 బంతుల్లో 47 పరుగులు, మిచెల్ జాన్సన్ 14 బంతుల్లో 13 పురుగులు చేయడంతో ముంబై జట్టు 129 పరుగులకు పరిమితమైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పూనే జట్టును మిచెల్ జాన్సన్, బుమ్రా కోలుకోలేని దెబ్బ తీశారు. ఈ మ్యాచ్ లో జాన్సన్ మూడు వికెట్లు, బుమ్రా రెండు వికెట్లు పడగొట్టారు. పూణే జట్టులో రహానే 38 బంతుల్లో 44 పరుగులు, స్టీవెన్ స్మిత్ 50 బంతుల్లో 51 పరుగులు మాత్రమే చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవరు రాణించలేకపోవడంతో ఒక్క పరుగు తేడాతో పూనే జట్టు ఓడిపోయింది. మాన్ అఫ్ ద మ్యాచ్ గా క్రునాల్ పాండ్య ఎంపిక
అయ్యాడు.
ఘన విజయాన్ని నమోదు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు..
2018 లో మరో ఆసక్తికరమైన ఫైనల్ మ్యాచ్ జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో శిఖర్ ధావన్ 25 బంతుల్లో 26 పరుగులు, కేన్ విలియమ్సన్ 36 మంత్రులు 47 పరుగులు, షకిబుల్ హసన్ 15 బంతుల్లో 23 పరుగులు, యూసఫ్ పఠాన్ 25 బంతుల్లో 45 పరుగులు, బ్రాత్ వైట్ 11 బంతుల్లో 21 పరుగులు చేయడంతో ఆరు వికెట్లు నష్టపోయి 178 పరుగు చేసింది హైదరాబాద్ జట్టు. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో వాట్సన్ అద్భుతమైన ఆట తీరుతో అదరగొట్టాడు. షేన్ వాట్సన్ 57 బంతుల్లో 117 పరుగులు చేయగా, సురేష్ రైనా 24 బంతుల్లో 32 పరుగులు, అంబటి రాయుడు 19 బంతుల్లో 16 పరుగులు చేయడంతో చెన్నై జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరుతో చెన్నై జట్టుకు విజయనందించిన షేన్ వాట్సన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన ముంబై జట్టు..
ముంబై జట్టు మరోసారి ఒకే ఒక్క పరుగు తేడాతో ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. 2017లో ఒకసారి ఒకే పరుగు తేడాతో విజయం సాధించగా, 2019లో కూడా చెన్నై జట్టుపై ఒకే ఒక్క పరుగు తేడాతో ముంబై మరోసారి గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా, స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు వికెట్ల నష్టపోయి 148 పరుగులకు పరిమితమై ఒక పరుగు తేడాతో ఓటమి పాలైంది. ముంబై జట్టులో డీకాక్ 17 బంతుల్లో 29 పరుగులు, రోహిత్ శర్మ 14 బంతుల్లో 15 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 17 బంతుల్లో 15, ఇషాన్ కిషన్ 26 బంతుల్లో 23 పరుగులు, పోలార్డ్ 25 బంతుల్లో 41 పరుగులు, హార్దిక్ పాండ్య పది బంతుల్లో 16 పరుగులు చేయడంతో ముంబై జట్టు 149 పరుగులు చేసింది. చెన్నైలో దీపక్ చాహర్ మూడు వికెట్లు, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్ రెండు వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు విజయం సాధించలేక చతికిల పడింది. చెన్నై జట్టులో ఫాఫ్ డు ప్లెసిస్ 13 బంతుల్లో 26 పరుగులు, షేన్ వాట్సన్ 59 బంతుల్లో 80 పరుగులు చేసి అదరగొట్టారు. ఆ తర్వాత వచ్చిన సురేష్ రైనా, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోనీ రాణించలేకపోవడంతో ఓటమి పాలైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా బుమ్రా ఎంపికయ్యాడు. సోమవారం జరుగుతున్న 16 వ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. గుజరాత్ జట్టులో వృద్ధి మాన్ సాహా 39 బంతుల్లో 54 పరుగులు, గిల్ 20 బంతుల్లో 39 పరుగులు, సాయి సుదర్శన్ 47 బంతుల్లో 96 పరుగులు, హర్దిక్ పాండ్య 12 బంతుల్లో 21 పరుగులు చేయడంతో 214 పరుగులు చేసింది. చెన్నై జట్టు 215 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగాల్సి ఉంది.
