Coconut Water: అతిగా కొబ్బరి నీళ్లు తాగితే వచ్చే అనర్ధాలు ఇవే..
కొబ్బరి నీళ్లల్లో కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ వంటివి విరివిగా ఉంటాయి. అదే అదే పనిగా కొబ్బరి నీరు తాగితే బ్లడ్ షుగర్ లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Coconut Water: అతి సర్వత్రా వర్జయేత్… అంటే ఏదీ కూడా మోతాదుకు మించి వాడితే ప్రమాదమని.. అందుకే మోతాదు మించకుండా చూసుకోవాలి. ఏదైనా మితంగా తీసుకోవాలి. అప్పుడే మన దేహం బాగుంటుంది, దేహంలోని జీవ క్రియలూ సక్రమంగా సాగుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. కొబ్బరి తెలుసు కదా! మనందరి ఇళ్లల్లో శుభకార్యాల్లో వాడతాం. వంటలో కూడా విరివిగా వినియోగిస్తాం. ఇక కొబ్బరి నీళ్లయితే లొట్టలు వేసుకుంటూ తాగుతాం. తీపి, కొంచెం పులుపు కలయికతో ఉండే కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి ఎంతో మంచివని చెప్తుంటారు. అందులో ఉన్న రకరకాల ఖనిజ లవణాలు దేహానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు కూడా విశ్వసిస్తుంటారు. రోగులకు కూడా తాగాలని చెబుతుంటారు. అయితే ఇన్నాళ్ళూ కొబ్బరి నీళ్లు మంచి వనే మనందరిలోనూ ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు రకరకాల అధ్యయనాల తర్వాత ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
కొబ్బరి నీళ్లల్లో కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ వంటివి విరివిగా ఉంటాయి. అదే అదే పనిగా కొబ్బరి నీరు తాగితే బ్లడ్ షుగర్ లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతిని.. అది శరీరంలో కణాల పనితీరుపై ప్రభావం చూపించవచ్చు. కొబ్బరినీరు ఎక్కువ తాగితే పొట్ట ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తవచ్చు. మూత్రపిండాల సంబంధిత వ్యాధులు ఉన్నవారు కొబ్బరినీరు తాగకపోవడమే మంచిది. అలర్జీ వంటి సమస్యలున్నారు కొబ్బరి నీరు తాగితే దురద, మంట వంటి సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. రక్తపోటు సమస్య ఉన్నవారు కొబ్బరినీరు తాగే ముందు వైద్యుడుని కలవడం ఉత్తమం. కొబ్బరినీళ్ళల్లో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర ఎక్కువ ఉన్నవారికి ఇది సమస్యగా మారుతుంది. ఇలాంటివారు కొబ్బరినీళ్లు మితంగా తాగడమే మంచిది. ఏదైనా శస్త్ర చికిత్స జరిగినప్పుడు అదే పనిగా కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఇలా కొబ్బరి నీళ్లు తాగితే శరీరం రక్తపోటును నియంత్రించడంలో ఇబ్బందిపడుతుంది. కొబ్బరి నీళ్లల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. శరీర వృద్ధికి పొటాషియం అవసరం. కానీ అదేపనిగా కొబ్బరి నీళ్లు తాగితే పొటాషియం పరిమాణం ఎక్కువై “హైపర్ కలేమియా” అనే వ్యాధికి దారితీస్తుంది. అయితే ఇప్పుడు ఒకసారి కొబ్బరి నీరు తీసుకంటే మాత్రం పెద్దగా ఇబ్బంది ఉండదు.
కొందరు లేత కొబ్బరిని అదే పనిగా తింటూ ఉంటారు.. అందులో బెల్లం కూడా పెట్టుకొని లాగించేస్తుంటారు.. లేత కొబ్బరిలో కార్బోహైడ్రేట్లు పరిమాణం అధికంగా ఉండటం వల్ల అది శరీరంలో చక్కెర స్థాయి పెరిగేందుకు కారణం అవుతుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు ఇలా తింటే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంకా మరికొందరైతే వంటల్లో కొబ్బరిని విరివిగా వినియోగిస్తారు. దానివల్ల రుచి పెరుగుతుందనుకుంటారు.. అలా వాడితే కూరల్లో కొవ్వు స్థాయిలు పెరిగి శరీరంలో కణాల పనితీరును ప్రభావితం చేస్తాయి. కణాలు సక్రమంగా పనిచేయకపోతే శరీరంలో వృద్ధి మందగిస్తుంది. అది అంతిమంగా రకరకాల వ్యాధులకు దారి తీస్తుంది. ముందుగానే చెప్పినట్టు ఏదైనా మితంగానే వాడితే బాగుంటుంది. ఎక్కువ తీసుకుంటే రకరకాల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.
